– సర్వే తర్వాత అభ్యంతరాల స్వీకరణపై రైతులకు స్పష్టత ఇవ్వాలి
– రీ సర్వే ఎస్‌వోపీలో మార్పులు, చేర్పులతో స్పష్టమైన మార్గదర్శకాలు
– 22ఎ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
– ఐదు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్
– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : సమగ్ర భూ రీ సర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అధికారులతో రీ సర్వే, హౌసింగ్ అంశాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు అభ్యంతరాలుంటే వాటిని తెలియజేసేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ప్రతి 15 రోజులకొకసారి సంబంధిత గ్రామాల్లో చాటింపు నిర్వహించాలని, కలెక్టర్లు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూమి విస్తీర్ణం.. రీ సర్వే అనంతరం గుర్తించిన విస్తీర్ణం ఎంత అనే వివరాలను భూ యజమానులకు తెలియజేయాలన్నారు. భూ యజమానులకు ఎలాంటి సందేహాలు, అపోహలు లేకుండా సర్వే ప్రక్రియపై పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు.
పైలట్ ప్రాజక్టుగా పాలేరు నియోజకవర్గం
పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని నియోజకవర్గం పరిధిలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు, రెండు రోవర్లను సమకూర్చినట్లు తెలిపారు. 708 రోవర్లతో సర్వే కొనసాగుతోందని, మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
క్షేత్రస్థాయి అధికారుల సూచనలతో ఎస్‌వోపీలో మార్పులు
రీ సర్వే నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ) జారీ చేసిందని మంత్రి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని సక్రమంగా అమలు చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన పద్ధతులు అనుసరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల అనుభవాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌వోపీలో మార్పులు, చేర్పులు చేసి మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సర్వేలో ఎదురవుతున్న సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపేలా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు.
రీ సర్వే సమస్యలపై తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సుదీర్ఘ సమీక్షలు
రీ సర్వే అమలు తీరుపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతోపాటు జిల్లాలవారీగా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మండలస్థాయి రెవెన్యూ, సర్వే అధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో క్షేత్రస్థాయి అధికారులతో స్వయంగా సమావేశమై రీ సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్వే పూర్తయిన గ్రామాలు, నోటీసులు జారీ చేసిన గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను సమీక్షించినట్లు తెలిపారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, ప్రభుత్వ భూములు, ఇతర భూ వివాదాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించినట్లు చెప్పారు.
నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అభినందనలు.. నిజామాబాద్‌పై అసంతృప్తి
రీ సర్వే నిర్వహణలో మంచి ప్రతిభ కనబరుస్తున్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను మంత్రి అభినందించారు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపరుచుకుని నిర్దేశిత లక్ష్యాల మేరకు సర్వేను వేగవంతం చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను తక్షణమే గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల పనులు ఏ దశలో ఉన్నా లబ్దిదారులను గుర్తించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని, ఎంపికైన వారికి తక్షణమే ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
22ఎ భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి
22ఎ భూములకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, అయినా కొన్ని జిల్లాల్లో ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. ఆ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వే, గృహ నిర్మాణం, 22ఎ భూముల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వేగం, పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రెవెన్యూ-ఫారెస్ట్ భూ సరిహద్దుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి
రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దుల విషయంలో గందరగోళానికి తావు లేకుండా అటవీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ఇరు శాఖల అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిహద్దులు నిర్ధారించాలని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





