రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి

– రేవంత్  కు రాష్ట్రంలో కరువు కనిపించడంలేదా
– నా గడ్డంపైనే రేవంత్ కు ఫికర్
– ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి
– ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా?
– సంక్షేమ సారథి కేసీఆర్ను మ‌ళ్లీ గెలిపించుకోవాలి
–నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 11: కరువు నేపథ్యంలో రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని, ఇంకా మిగిలిపోయిన రైతు రుణమాఫీని కూడా తక్షణమే పూర్తి చేయాలని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్మల్లో బుధవారం జరిగిన రైతు గర్జన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పడం లేదని, కరెంట్ ఇస్తానని భరోసా ఇవ్వడం లేదని, కనీసం ధైర్యం కూడా చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కూడా కనిపించడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరువు కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు రూ.వెయ్యి చొప్పున 36 నెలలకు గాను మొత్తం రూ.36 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు వెంటనే నాలుగు విడతల రైతుబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులు కష్టాల్లో ఉంటే గ్రామాల్లో నాటకాలు వేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. రైతు జీవితం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమాఅని నిల‌దీశారు. రైతులకు ధైర్యం చెప్పడం చేతకాదు కానీ కేటీఆర్ గడ్డం మీద మాత్రం రేవంత్ రెడ్డికి ఫికర్ పట్టుకుంది. రేవంత్‌ను తిడుతున్న తిట్లకు ఇంకెవరైనా అయితే బకెట్ నీళ్లలో దూకి చచ్చిపోయేవారు.. తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ రేవంత్ రెడ్డికి పడుతున్నాయని వ్యాఖ్యానించారు.

బీజేపీ తీరుపై ఆగ్ర‌హం

తెలంగాణలో ఓట్లు కావాలి, సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే సోయి లేదని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. మూడేళ్లలో బీజేపీ వల్ల రాష్ట్రానికి ఒక్క పనైనా జరిగిందా? బీజేపీ ఎంపీని, బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే నిర్మల్ జిల్లాకు ఏమైనా మంచి జరిగిందా? ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేస్తుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడటం లేదు. జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయం కూడా రాలేదు. ఓట్లు తొలగిస్తున్నారని దేశమంతా గగ్గోలు పెడుతుంటే నిర్మల్‌లో మాత్రం ఎన్నికల సంఘానికి మద్దతుగా బీజేపీ ర్యాలీ తీస్తోందన్నారు. పక్కనే ఉన్న ఏపీ, మహారాష్ట్రలకు కరువు బృందాలు వెళ్తున్నాయని, కానీ తెలంగాణలో నెలకొన్న కరువు బీజేపీకి కనిపించడం లేదని విమర్శించారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకని ప్రశ్నించారు.

రేవంత్ పాలనలో సంక్షేమం మొత్తం సర్వనాశనం

మీ నాటకాలు, ఉద్దర మాటలతో ప్రజల కడుపు నిండదు. రైతులకు మోసం, యువతకు మోసం, మహిళలకు మోసం, దళితులకు మోసం.. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు కూడా మోసం.. రేవంత్ పాలనలో సంక్షేమం మొత్తం సర్వనాశనం అయింది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ డబ్బులన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్ర‌శ్నించారు. కలుపు మొక్కలాంటి కాంగ్రెస్‌ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాం.. ఇవాళ దరిద్రం మళ్లీ మన గడప తొక్కింది.. రైతుబంధు, రైతు బీమా పథకాలను ఎగ్గొట్టారు. యూరియా దొరకడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారు. రైతు ఇంటి ముందు మళ్లీ చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ కోతలతో మళ్లీ రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పడకబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టారు. గోదావరి, కృష్ణా నదుల్లో దక్కాల్సిన వెయ్యి టీఎంసీల నీటిని కిందకు విడిచిపెట్టారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు?  ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన వికృతి కరువు. పట్టిసీమ దగ్గర చంద్రబాబు నీళ్లు ఎత్తుతుంటే నువ్వు కన్నెపల్లి దగ్గర ఎందుకు పంపులు ఆన్ చేయలేదు? కేసీఆర్ కట్టిన సదర్‌మాట్ బ్యారేజీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోవడం చేతకావడం లేదు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లోకి నీళ్లను లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ నీళ్ల జాతర సాగుతుండేద‌న్నారు.

నిర్మల్ ప్రాంతానికి, కేసీఆర్ ఉద్యమానికి అనుబంధం వుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి తానే సారథ్యం వహిస్తానని కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రకటించిన గడ్డ ఇది. రాష్ట్రాన్ని సాధించి, ఈ గడ్డ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్. తుమ్మలు మొలిచిన ప్రాజెక్టుల్లో నీళ్లు పారించిన నాయకుడు కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో అరవయ్యేళ్ల దుఃఖం చాలు, రైతుల ఆత్మహత్యలు చాలని ఆలోచించి తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ చూపించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చి 46 వేల చెరువులకు మళ్లీ జీవం పోశారు కేసీఆర్. మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకేలా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఉన్న నీటితీరువాను శాశ్వతంగా రద్దు చేశారు. అరవయ్యేళ్ల కరెంట్ కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన రైతులకు నిరంతర విద్యుత్ అందించారు. అప్పుల మీద అప్పులు చేసి రైతులు ఆగమవుతున్న సమయంలో వారిని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక నాయకుడిగా కేసీఆర్ నిలిచారు. 11 విడతలుగా రైతులకు రైతుబంధు అందించారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలనే ఉద్దేశంతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టిన నాయకుడు కేసీఆర్. రాష్ట్రంలో సాగునీటి వసతులను పెంచి వ్యవసాయానికి పెద్దపీట వేశారు. కరోనా సమయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసింది. గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చిన నాయకుడు కేసీఆర్. నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని గుర్తుచేశారు.
ఒకప్పుడు మంచం పట్టిన మన్యంలో విషజ్వరాలు ప్రబలేవి. కేసీఆర్ పాలనలో ఆ విషజ్వరాలను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించి, కలుషిత నీటి కారణంగా వచ్చే వ్యాధులను నివారించేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామానికి నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. పల్లెలు, పట్టణాలకు నిధులు వరదలా వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు ఇప్పుడు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలి. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. మరోవైపు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అందినకాడికి భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 63 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్. 2017లో బీడీ పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తే దాన్ని అడ్డుకున్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *