సీఎం ప్రమాణానికి మళ్లీ వస్తా

– బెంగాల్లో ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం
– బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మోదీ

కోల్‌కతా, ఏప్రిల్ 27: బెంగాల్‌లో 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం ముగిసింది. చివరి ప్రచారం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు బారక్‌పూర్‌లో చివరి ర్యాలీలో పాల్గొన్నానని, మళ్లీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రానికి తిరిగి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రమంతా మిఠాయిలు పంచుతామన్నారు. అదే ఉత్సాహంతో నేడు తాను వెళ్తున్నానన్నారు. తాను హెలిప్యాడ్ నుంచి వస్తుంటే 2 కి.మీ వరకు ఇరువైపులా ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారన్నారు. తనను ఆశీర్వదించడానికి వేలాదిమంది ప్రజలు వస్తారని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీలో చేరిన తర్వాత ఓ కార్యకర్తగా పార్టీ ఏది చేయమన్నా చేశానని ప్రధాని వెల్లడించారు. ఎన్నికల బాధ్యతలు స్వీకరించడం కూడా ఇందులో భాగమేనన్నారు. తనకు ప్రత్యేకంగా ఓ కుటుంబం అంటూ ఏదీ లేదని, దేశ ప్రజలే తన కుటుంబమని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను దేశంలోని ప్రతి ప్రాంతంలో పర్యటిస్తున్నానని, ఈ రోడ్‌షోలే తనకు పుణ్య యాత్రలని వ్యాఖ్యానించారు. వారు అధికారంలోకి రావడానికి కారణమైన ‘మా-మాటి-మనుష‘ నినాదాన్నే టీఎంసీ నేతలు విడిచిపెట్టారని ప్రధాని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో వారు ఒక్కసారి కూడా ఈ నినాదాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి దూషణలు, బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ పాలనలో మహిళలపై మునుపెన్నడూ లేని స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *