– పథకం వేగవంతం కోసం కలెక్టర్లకు మరిన్ని అధికారాలు
– ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు
– ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు
– సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
– సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం
– ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలుకు అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడా సమస్యలు రాకుండా చూసేందుకు ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా హౌసింగ్, రెవెన్యూ అంశాలపై లోతుగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై స్పందించి వెంటనే తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం నిరంతరం ప్రక్రియ అని, గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే ఇంటిని మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా విస్తృతంగా భాగస్వాములు కావాలన్నారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, ఆయా లబ్దిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు తమకు ఇల్లు అవసరం లేదని తెలియజేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని సూచించారు. ఇంటి బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి అయి రూ.లక్ష రూపాయలు మంజురు చేశాక వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పేదవారి అభివృద్ధి, సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని, మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులు కల్పించాలని ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్దిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు.
భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం
భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని చెప్పారు. ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని వివరించారు. సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను దఖలుపరిచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని, తొలివిడతలో శిథిలావస్థకు చేరినచోట నిర్మిస్తామని చెప్పారు. అలాగే ప్రతీ జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాలుగా రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయంటూ ఉమ్మడి సర్వే నిర్వహించి ఈ సమస్యలకT శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, హౌసింగ్ సెక్రటిరీ వి.పి.గౌతం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





