త్యాగాల పునాదులపై ఏర్పడ్డదే బీఆర్ఎస్

– 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను ఐక్యం చేసిన జెండా
– పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: దశాబ్దాలుగా అన్యాయానికి గురై నెత్తురు మరిగిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగనప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చన్నారు. కేసీఆర్ పాతికేండ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తిపట్టారని గుర్తు చేశారు. పధ్నాలుగేండ్ల పోరాటంతో తెలంగాణ జాతిని ఐక్యం చేసి సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ కలను సాకారం చేశారన్నాను. అడుగడుగునా పోరాటాలు చేస్తూ దిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆరఎస్ అని కేటీఆర్ అన్నారు. పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారన్నారు. తెలంగాణ ప్రజలకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ అనేవారని, ఈ ప్రజలను కాంగ్రెస్, బీజేపీల నుంచి రక్షించుకునేందుకు, మళ్లీ బీఆరఎస్‌ను పట్టాలెక్కించేందుకు ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పార్టీ పునరంకితం అవుతుందన్నారు. సాధించిన తెలంగాణ కోసం అధికారం అప్పగిస్తే పదేండ్ల కాలంలో బాధ్యతగా పనిచేసి అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. కానీ, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆరాచక పాలన మొదలైందన్నారు. కాంగ్రెస పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల తరఫున పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ బాధ్యత అప్పగించినా బీఆరఎస్ పార్టీ సమర్ధవంతంగా నిర్వహిస్తుందన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసేదాకా దండుగా కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దిశానిర్దేశర కోసం గులాబీ దండు ఎదురుచూస్తోందన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్, పార్టీ కార్యకర్తల”, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు సమస్త ప్రజానీకానికి వినమ్ర ధన్యవాదాలు తెలిపారు.

ఊరూరా ఎగిరిన గులాబీ జెండా 

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ వార్షికోత్సవం వాడవాడలా పండుగలా కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన బీఆరఎస్ లక్ష్యాన్ని సాధించి రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా 25 వసంతాలు పూర్తిచేసుకుని 26 వసంతంలోకి అడుపెట్టింది. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆవిర్భావ దిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్నాలు, ఆయా ప్రాంతాల పార్టీల కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు ఎగరవేసి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.

అలుపెరగని పోరాటంతో లక్ష్యసాధన : కేటీఆర్, హరీష్‌ల ట్వీట్లు

తెలంగాణ రాజకీయ యవనికపై అలుపెరుగని పోరాట పటిమతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుని 26వ ఏట అడుగుపెట్టింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఆ పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సామాజిక మాధ్యమం ‘ఎక్స’ వేదికగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన సందేశంలో బీఆరఎస్ రాజకీయ పార్టీ కాదని, మ‌హోజ్వ‌ల‌ విప్లవమని వ్యాఖ్యానించారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండాగా, స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం నేటికి 25 వసంతాల మైలురాయిని అధిగమించింద్కన్నారు. సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల సందర్భంగా కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వం కోసం మళ్లీ పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ కేసీఆర్ నాయకత్వ ప్రాముఖ్యాన్ని హరీశ్‌రావు వివరించారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసిన ధిక్కార వేదిక బీఆరఎస్ అని, ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిందని కొనియాడారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అడుగంటిందని, అరాచకం తాండవిస్తోందని ఆరోపించారు. ప్రజల గుండెల్లో ఇప్పుడు రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం మారుమోగుతోందని తెలిపారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు దగ్గరలోనే ఉందని, గులాబీ జెండా సగర్వంగా మళ్లీ ఎగురుతుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *