భూగర్భ జలాల క్షీణతకు పరిష్కారం ఎక్కడ?

“పరిశ్రమ వల్ల స్థానిక భూగర్భ జలాలపై గణనీయమైన ప్రభావం ఏర్పడితే, ఆ భారాన్ని ప్రజలపై మోపకూడదు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని అందించడం పరిశ్రమ బాధ్యత కావాలి. అవసరమైన చోట పైప్‌లైన్‌ సరఫరా లేదా కమ్యూనిటీ వాటర్‌ సిస్టమ్‌ వంటి శాశ్వత మౌలిక సదుపాయాలను సంస్థే ఏర్పాటు చేసి నిర్వహించాలి. పరిశ్రమ నీటిని వాణిజ్య ఉత్పత్తిగా మార్చి లాభం పొందుతుంటే, అదే ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను కొనాల్సిన పరిస్థితి ఉండకూడదు..”
భూగర్భ జలాల క్షీణత భారతదేశంలో నెమ్మదిగా జరుగుతున్న ఒక తీవ్రమైన పర్యావరణ సంక్షోభం. నది ఎండిపోతే కనిపిస్తుంది. చెరువు ఆక్రమణకు గురైతే కనిపిస్తుంది. భూమి అడుగున నీటి మట్టం క్రమంగా దిగజారితే మాత్రం దాని ప్రభావం బయటపడేసరికి సమస్య లోతుగా వెళ్లిపోయి ఉంటుంది. 2025 భూగర్భ జల వనరుల అంచనా ప్రకారం దేశంలో వార్షిక భూగర్భ జల పునర్భరణ 448.52 బిలియన్‌ ఘన మీటర్లు కాగా, వార్షికంగా వెలికితీయగల వనరు 407.75 బిలియన్‌ ఘన మీటర్లు. అదే ఏడాది వెలికితీత 247.22 బిలియన్‌ ఘన మీటర్లకు చేరింది. అంటే వెలికితీయగల వనరులో 60.63 శాతం ఇప్పటికే వినియోగంలో ఉంది. దేశంలోని 6,762 అంచనా విభాగాల్లో 730 అతి-దోపిడీ, 201 సంక్షోభ, 758 అర్ధ-సంక్షోభ విభాగాలుగా గుర్తించబడ్డాయి.
మొత్తం భూగర్భ జల వినియోగంలో సుమారు 87 శాతం వ్యవసాయానికే వెళ్తోంది. కానీ ఈ సంఖ్యను చూపించి రైతునే సంక్షోభానికి కారణంగా చూపడం సమస్యను సగం మాత్రమే చూడటం. వర్షపాతం అనిశ్చితంగా, కాలువ నీరు పరిమితంగా ఉన్నప్పుడు, మార్కెట్‌ హామీ ఉన్న పంట కోసం రైతు అందుబాటులో ఉన్న నీటిపైనే ఆధారపడతాడు. అసలు ప్రశ్న వ్యవసాయ ఆదాయాన్ని భూగర్భ జలాలపై ఆధారపడేలా చేసిన వ్యవస్థ గురించి. అందుకే పంటల మార్పు సూచనతో సరిపోదు. తక్కువ నీటి పంటలకు ధర, కొనుగోలు, నిల్వ, ప్రాసెసింగ్‌, మార్కెట్‌ భరోసా కల్పించాలి. వ్యవసాయ విద్యుత్‌లో సమర్థవంతమైన పంపులు, నియంత్రిత పంపింగ్‌, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలి. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి పద్ధతులు నీటిని ఆదా చేసినా, ఆ నీటితో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల విస్తీర్ణం పెరిగితే భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గదు.
వ్యవసాయం తరువాత పరిశ్రమలు కూడా భూగర్భ జలాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ యూనిట్లు, ఇతర నీటి ఆధారిత పరిశ్రమల వెలికితీతను కచ్చితంగా లెక్కించాలి. అతి-దోపిడీ ప్రాంతాల్లో కొత్త నీటి ఆధారిత పరిశ్రమలపై ఆంక్షలు ఉన్నా, అనుమతులు, మీటరింగ్‌, పర్యవేక్షణ, అమలులో లోపాలు ఉంటే అవి కాగితాలకే పరిమితమవుతాయి.
అందుకే పెద్ద నీటి వినియోగదారులందరికీ నీటి సమతుల్య లెక్క తప్పనిసరి కావాలి. ఎంత నీరు తీసుకున్నారు, ఎంత ఉత్పత్తికి వాడారు, ఎంత తిరిగి వినియోగించారు, ఎంత పునర్భరణకు మళ్లించారు అన్నది మీటర్ల ద్వారా నమోదై డిజిటల్‌గా పర్యవేక్షించాలి. ఆర్ఓ కేంద్రాల్లో మిగిలే నీటిని సాధ్యమైన చోట శుభ్రపరచడం, ఫ్లషింగ్‌ వంటి పనులకు తిరిగి ఉపయోగించాలి. ప్రతి ప్లాంట్‌ పరిస్థితి వేరు కాబట్టి ఒకే వృథా ప్రమాణం కంటే యూనిట్‌ వారీగా నీటి లెక్క ఉండాలి. దీనికి తోడు భూగర్భ జలాల నుంచి లాభం పొందే సంస్థ, ఆ వనరు క్షీణించడం వల్ల సమాజంపై పడే ఖర్చులోనూ భాగస్వామి కావాలి. ప్రాంతీయ నీటి కొరతను బట్టి వెలికితీతపై రుసుము లేదా పర్యావరణ పరిహారం విధించవచ్చు. నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రుసుము ఎక్కువగా, పునర్వినియోగం–పునర్భరణ ఎక్కువగా చేసే సంస్థలకు తక్కువగా ఉండవచ్చు. ఈ ఆదాయాన్ని అదే ప్రాంతంలోని తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జల పర్యవేక్షణకు వినియోగించాలి.
పరిశ్రమ వల్ల స్థానిక భూగర్భ జలాలపై గణనీయమైన ప్రభావం ఏర్పడితే, ఆ భారాన్ని ప్రజలపై మోపకూడదు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని అందించడం పరిశ్రమ బాధ్యత కావాలి. అవసరమైన చోట పైప్‌లైన్‌ సరఫరా లేదా కమ్యూనిటీ వాటర్‌ సిస్టమ్‌ వంటి శాశ్వత మౌలిక సదుపాయాలను సంస్థే ఏర్పాటు చేసి నిర్వహించాలి. పరిశ్రమ నీటిని వాణిజ్య ఉత్పత్తిగా మార్చి లాభం పొందుతుంటే, అదే ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను కొనాల్సిన పరిస్థితి ఉండకూడదు.తీవ్రంగా క్షీణించిన ప్రాంతాల్లో కొత్త నీటి ఆధారిత పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయాలి. ఉన్న పరిశ్రమలకు దశలవారీగా వెలికితీత పరిమితులు విధించి, సాధ్యమైన చోట ఉపరితల జలాలు, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి మార్చాలి. అయితే పరిశ్రమలను నదుల పక్కన పెట్టడం ఒక్కటే పరిష్కారం కాదు. నది నీటి లభ్యత, పర్యావరణ ప్రవాహం, స్థానిక అవసరాలు, కాలుష్య నియంత్రణ, పునర్వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే నీటి వనరును నిర్ణయించాలి.
పట్టణీకరణ కూడా పునర్భరణను దెబ్బతీస్తోంది. కాంక్రీట్‌ ఉపరితలాలు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గుతుంది. చెరువులు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, రీచార్జ్‌ ప్రాంతాల ఆక్రమణ సమస్యను మరింత పెంచుతుంది. అందువల్ల వర్షపు నీటి సేకరణ, చెరువుల సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం పట్టణ ప్రణాళికలో తప్పనిసరి కావాలి. అయితే రీచార్జ్‌ నిర్మాణాలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. ముందుగా ఒక ప్రాంతం నుంచి సంవత్సరానికి ఎంత నీటిని తీసుకోవచ్చో నిర్ణయించాలి. దాని ఆధారంగానే వినియోగానికి అనుమతులు, పునర్భరణ చర్యలు ఉండాలి. ముందు నీటి బడ్జెట్‌, తరువాత వినియోగం; ఎంత తీసుకుంటున్నామో బట్టి పునర్భరణ. గ్రామ స్థాయిలో నీటి బడ్జెట్లు, పంటల నీటి అవసరాల అంచనా, భూగర్భ జల మట్టాల నిరంతర పర్యవేక్షణ దీనికి పునాది కావాలి.
నీటి పరిమాణంతో పాటు నాణ్యతను కూడా పర్యవేక్షించాలి. వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక కాలుష్యం, పట్టణ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తే, నీరు ఉన్నా ఉపయోగపడని వనరుగా మారుతుంది. అందువల్ల నీటి మట్టం, వెలికితీత పరిమాణం, నీటి నాణ్యత — ఈ మూడింటినీ ఒకే పర్యవేక్షణ వ్యవస్థలోకి తీసుకురావాలి.
వాతావరణ మార్పు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. భారీ వర్షాలు తక్కువ సమయంలో కురిసి వరదలుగా వెళ్లిపోవచ్చు; దీర్ఘకాలిక ఎండల్లో భూగర్భ జలమే తాగునీటికి, వ్యవసాయానికి చివరి భద్రతగా మారుతుంది. అందుకే భూగర్భ జలాలను భవిష్యత్తు వాతావరణ అనిశ్చితికి రక్షణ నిల్వగా చూడాలి. ఆ నిల్వను ఖాళీ చేసే విధానాలను మార్చాలి.
దీనికి కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు తమ తమ బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తించాలి. కేంద్రం శాస్త్రీయ అంచనాలు, మ్యాపింగ్‌, సాంకేతిక సహకారం అందించాలి. రాష్ట్రాలు వెలికితీతపై నియమాలు, పర్యవేక్షణను బలోపేతం చేయాలి. స్థానిక సంస్థలు నీటి బడ్జెట్లు అమలు చేయాలి. పరిశ్రమల నీటి వినియోగం పారదర్శకంగా ఉండాలి. పట్టణాల్లో రీచార్జ్‌ ప్రాంతాలు రక్షించబడాలి. రైతుకు పంట మార్పుతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు ధర, మార్కెట్‌, ఆదాయ భరోసా కల్పించాలి.
భూగర్భ జలం ఒకరి సొంత ఆస్తి కాదు. అది సామూహిక సహజ వనరు. దాని నుంచి లాభం పొందే ప్రతి రంగం దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడే బాధ్యతను పంచుకోవాలి. నీటి లాభం ఒకరి చేతుల్లోకి వెళ్లి, నీటి కొరత ఖర్చు మాత్రం ప్రజలపై పడే వ్యవస్థ దీర్ఘకాలం నిలవదు. భూగర్భ జలాల పాలనకు అసలు ప్రమాణం వచ్చే బోరు ఎంత లోతుకు వెళ్లిందన్నది కాదు. తరువాతి తరానికి మరింత లోతైన బోరు అవసరం లేకుండా ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే ఆ పాలన విజయాన్ని నిర్ణయిస్తాయి.
డి జయరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *