డీలిమిటేషన్ – భారత ప్రజాస్వామ్యానికి కొత్త కొలతలు

“2023లో చేసిన 106 వ రాజ్యాంగ సవరణ, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రిజర్వేషన్, 2023 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలకు రిఫరెన్స్ తేదీ మార్చి 1, 2027. తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2029లో జరుగుతాయని పరిగణనలోకి తీసుకుంటే, 2027 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2029 ఎన్నికలకు ముందు పూర్తయ్యే అవకాశం లేదు. దీనివల్ల 2029 లోక్‌సభ ఎన్నికలకు మహిళల రిజర్వేషన్ వర్తించదని అర్థమవుతుంది. చివరి డీలిమిటేషన్ కమిషన్‌ను 2002లో ఏర్పాటు చేశారు , దాని ఉత్తర్వులను 2008లో ఖరారు చేశారు..”

-చాపల అనిల్ కుమార్
కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్
9542415080

భారత్ అంటే ఒక భూభాగం కాదు, ఒక జీవన విధానం” ఉత్తరమైనా, దక్షిణమైనా మనమంతా భారతమాత బిడ్డలమే. అనే భావం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఉండాలి. అప్పుడే వ్యక్తి నిర్మాణంతో జాతి పునర్నిర్మాణం అనే సంకల్పం నెరవేరుతుంది. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం చర్చిస్తున్న విషయం డీలిమిటేషన్. అంటే “One Vote, One Value, One Nation” ఒక MP 30 లక్షలకు, మరో ఎంపీ  12 లక్షలకు ప్రాతినిధ్యం వహించడం అసమానత. దాన్ని సరిచేయడమే డీలిమిటేషన్.జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకొని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్వచించడమే డీలిమిటేషన్.

మన దేశంలో ఇప్పటివరకు 4 సార్లు – 1952, 1962, 1972, 2002 లలో జరిగింది.లోక్‌సభలోని సీట్లను రాష్ట్రాల జనాభాకు అనుపాతంలో కేటాయించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, ప్రతి రాష్ట్రంలోని నియోజకవర్గాలలో దాదాపు ఒకే జనాభా ఉండాలి. ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాలను పునర్విభజించాలని (డీలిమిటెడ్ అని కూడా అంటారు) ఇది నిర్దేశిస్తుంది. ఇలాంటి నిబంధనలే రాష్ట్ర శాసనసభలకు కూడా వర్తిస్తాయి. 1976లో చేసిన 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా, లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికి ఉండే మొత్తం సీట్ల సంఖ్య , రాష్ట్ర శాసనసభలలోని మొత్తం సీట్ల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా స్తంభింపజేశారు. ఈ స్తంభన ప్రారంభంలో 2000 సంవత్సరం తర్వాత మొదటి జనాభా లెక్కల ప్రచురణ వరకు వర్తించింది. 2001లో చేసిన 84 వ రాజ్యాంగ సవరణ ఈ స్తంభనను 2026 తర్వాత మొదటి జనాభా లెక్కల ప్రచురణ వరకు పొడిగించింది. జనాభా స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ అజెండాను కొనసాగించడానికి వీలుగా ప్రోత్సాహకరమైన చర్యగా ఇది చేయబడింది.

2023లో చేసిన 106 వ రాజ్యాంగ సవరణ, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రిజర్వేషన్, 2023 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలకు రిఫరెన్స్ తేదీ మార్చి 1, 2027. తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2029లో జరుగుతాయని పరిగణనలోకి తీసుకుంటే, 2027 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2029 ఎన్నికలకు ముందు పూర్తయ్యే అవకాశం లేదు. దీనివల్ల 2029 లోక్‌సభ ఎన్నికలకు మహిళల రిజర్వేషన్ వర్తించదని అర్థమవుతుంది. చివరి డీలిమిటేషన్ కమిషన్‌ను 2002లో ఏర్పాటు చేశారు , దాని ఉత్తర్వులను 2008లో ఖరారు చేశారు.

2026 ఏప్రిల్ 16న లోక్‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి: (i) రాజ్యాంగ (131 వ సవరణ) బిల్లు, 2026, (ii) కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026,  (iii) డీలిమిటేషన్ బిల్లు, 2026. ఈ బిల్లులు లోక్‌సభ పరిమాణాన్ని పెంచడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌కు వీలు కల్పించడం,  ఈ డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించడం వంటివి చేస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాల (యూటీల) చట్టాల బిల్లు పుదుచ్చేరి, దిల్లీ,  జమ్మూ , కాశ్మీర్ విషయాలలో ఇలాంటి నిబంధనలను అమలు చేస్తుంది.

లక్ష్యం
జనాభా పెరుగుదలకు అనుగుణంగా సమాన ప్రాతినిధ్యం కల్పించడం.
ఆర్టికల్  82, 170 అంటే అది రాజ్యాంగ ఆదేశం. ప్రతి జనగణన తర్వాత డిలిమిటేషన్ జరగాలి. అలాగే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ డీలిమిటేషన్ ను గౌరవించాలి.
లాభాలు ఏమిటి?
 1. సమాన వోటు విలువ
ఈరోజు ఒక ఎంపీ  30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరో ఎంపీ  12 లక్షల మందికే వహిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. డీలిమిటేషన్ తో “One Vote, One Value” నిజమవుతుంది.
2. కొత్త భారతానికి కొత్త ప్రాతినిధ్యం హైదరాబాద్ లాంటి వేగంగా పెరుగుతున్న నగరాలకు, గిరిజన ప్రాంతాలకు కొత్త నియోజకవర్గాలు వస్తాయి. వారి గొంతు పార్లమెంట్ లో వినిపిస్తుంది.
3. సామాజిక న్యాయం:*SC/ST జనాభా మార్పు ప్రకారం రిజర్వేషన్లను మళ్లీ హేతుబద్ధంగా కేటాయించవచ్చు.
4. పాలన సులభం ;నియోజకవర్గం చిన్నదైతే ఎమ్మెల్యే , ఎంపీ  ప్రజలకు  అందుబాటులో ఉంటారు. అభివృద్ధి వేగం పెరుగుతుంది.

లోక్‌సభలో గరిష్ట సీట్ల సంఖ్యలో పెరుగుదల: రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉంటారు, వీరిలో రాష్ట్రాల నుండి 530 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ సవరణ బిల్లు గరిష్ట సభ్యుల సంఖ్యను 850కి పెంచుతుంది, వీరిలో రాష్ట్రాల నుండి 815 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 మంది వరకు సభ్యులు ఉంటారు.

మహిళలకు రిజర్వేషన్ల ప్రారంభం: 106 వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2023 లోక్‌సభ , రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. 2023 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఈ నిబంధనను తొలగిస్తుంది.

నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ నియామకం: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 2026, నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడానికి ఒక పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. ఇందులో ఈ క్రింది వారు ఉంటారు: (i) సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న లేదా గతంలో పనిచేసిన ఒక చైర్‌పర్సన్, (ii) ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ నామినేట్ చేసిన ఒక ఎన్నికల కమిషనర్,  (iii) సంబంధిత రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. చైర్‌పర్సన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

తుష్టీకరణ రాజకీయాలకు చెక్:
చాలా చోట్ల వోటు బ్యాంకు కోసం నియోజకవర్గాలను అలాగే ఉంచారు. డీలిమిటేషన్ వస్తే అక్రమ వలసలు, రోహింగ్యాల వల్ల పెరిగిన జనాభా బయటపడుతుంది. నిజమైన భారతీయులకు న్యాయం జరుగుతుంది.
హిందూ, గిరిజన ప్రాంతాలకు న్యాయం:
ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతంలోని గిరిజన ప్రాంతాలు, కొత్తగా హిందూ జనాభా పెరిగిన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లేదు. డీలిమిటేషన్ తో భారతీయ సంస్కృతికి పట్టం కట్టే ప్రాంతాలకు బలం వస్తుంది.
దక్షిణాది భయం పై సమాధానం:
దక్షిణాది మా సోదరులు. వారి అభివృద్ధిని మేము గౌరవిస్తాం. కానీ దేశాన్ని ఉత్తర-దక్షిణం అని విడగొట్టడం ద్రవిడవాదుల కుట్ర. మనం భారతీయులం. ఉత్తరప్రదేశ్ ఎంపీ  అయినా, తమిళనాడు ఎంపీ  అయినా ఇద్దరూ భారత్ మాతా కి జై అనేవారే.

కాబట్టి జనాభా ప్రాతిపదికనే, ఎలాంటి బుజ్జగింపులు లేకుండా, నిష్పక్షపాతంగా డీలిమిటేషన్ జరగాలి. ఇది దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్యానికి అవసరం.ఒక మాటలో చెప్పాలంటే డీలిమిటేషన్ అంటే పాత బట్టను కొత్త కొలతలకు సరిచేయడం లాంటిది. ప్రజల ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు రాజకీయ పటాన్ని మార్చడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *