స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించాలి

– రబీ కార్యాచరణపై వ్యవసాయ కమిషనర్ వీసీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతోపాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ(యాసంగి) 2026-27 కార్యాచరణ ప్రణాళికపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా యాసంగి సీజన్‌కు సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించాలని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన అంశాలను క్రోడీకరించి రబీ కార్యాచరణ£ను రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తక్కువ నీటితో పండే పంటల ఎంపిక, అనువైన విత్తన రకాలు, పంట యాజమాన్య పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. కాగా, వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్‌కు సరిపడ ఎరువుల సరఫరా, ప్రస్తుత నిల్వల స్థితిగతులపై సమీక్షించి రాబోయే సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి, ఉద్యాన శాఖ సంచాలకురాలు డాక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. వీరితోపాటు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఇక్రిశాట్, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ(క్రిడా), భారత వాతావరణ శాఖ, భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్), భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్), భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ(ఐఐఓఆర్), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *