‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

  1. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మనదేశంలో అవినీతిమయమైన రాష్ట్రాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.

బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ కాలంలో రాష్ట్ర సెక్రటేరియట్‌ ‌ముఖ్య శాఖలో పనిచేసిన కొంతమంది అత్యున్నత స్థాయి ఐఏఎస్‌ అధికారులు చేసిన నిర్వాకం ప్రజలకు తెలిసింది. ఒక ఉన్నతాధికారి నిర్వహించిన వివాహ వేడుకల్లో 16 వేల రూపాయలకు ఒక్క భోజనం చొప్పున వేలాది మందికి బంధుమిత్రులకు విందు ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వొచ్చింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న లక్షల కోట్ల అవినీతిలో ఉన్నతాధికారుల చేతివాటం కూడా తగినంత ఉన్నట్లు ఇటీవల జరుగుతున్న ఉన్నత స్థాయి దర్యాప్తులలో బయట పడుతూనే ఉన్నాయి. సెక్రటేరియట్‌ ‌నుంచి మొదలైన ఈ అవినీతి.. రాష్ట్రంలో జిల్లా, మండల స్థాయి వరకు విస్తరించిందని అనేక ఉదంతాలు మీడియా ద్వారా వెలువడుతున్నాయి. నిత్యం రాష్ట్ర ప్రజల అనుభవాలు కూడా తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ‌పోలీసు, రోడ్డు రవాణా, రోడ్స్ అం‌డ్‌ ‌బిల్డింగ్స్, ‌నీటిపారుదల వ్యవసాయ శాఖల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని బాధిత ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి కనీసం ఎన్నికల సందర్భంలోనైనా చర్చకు రాకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అవినీతి మహమ్మారి మరింత పెట్రేగి పోయిందని సామాజిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ధరణి పోర్టల్‌ ఏర్పడే ముందు ఆ తర్వాత కూడా పేద, మధ్యతరగతి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లక్షలాది రూపాయలు రుణము తెచ్చి అవినీతి అధికారులకు సంతర్పణ చేయడం సాధారణమైపోయింది. అధికారులు ఏదో ఒక సాకు చెప్పి భూమి విలువను బట్టి లంచం రేటు లక్షలు, కోట్లలో నిర్ణయిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అధికారులు దురాశతో సృష్టించబడిన ఒకే సమస్యకు సంబంధించిన కింది స్థాయి అధికారుల నుంచి తాలూకా, రెవెన్యూ, డివిజన్‌ ‌స్థాయి అధికారుల వరకు ఎవరికి వారే వసూళ్ల కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సంబంధిత నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులకు విన్నవించు కున్నప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నదని రైతులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయంలో ఇదే తంతు కొనసాగుతోంది. తిలా పాపం తలా పిరికెడు అన్నట్లుగా ల్యాండ్‌ ‌మాఫియాలో భాగస్తులైన గూండాలు, అధికారులు. అనధికారులు, కొంతమంది నాయకులు భూతగాదాలు సృష్టించి పేద రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. కేవలం రెవెన్యూ అధికారులే కాకుండా అనేక మంది పోలీసు అధికారులు కూడా ఈ అక్రమార్జనలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

గత ప్రభుత్వ వ్యవస్థలో కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్న అవినీతి అధికారుల మూలంగా నిజాయితీపరులైన సాధారణ ప్రజల ఆస్తులకు.. ముఖ్యంగా భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరి ఆస్తులు ఎవరికి బదిలీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. ఆనాటి భూస్వాముల నుంచి సాదా బైనామా పత్రాలతో కొనుగోలు చేసి మూడు నాలుగు దశాబ్దాల కాలం సాగు చేసుకున్న రైతులు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌ ఉపసంహరించినప్పటికీ భూభారతి వొచ్చినప్పటికీ అవినీతి యథావిధిగా కొనసాగుతూనే ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాజకీయ నాయకుల చలవతోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వారికి కావలసిన జిల్లా, డివిజన్‌, ‌మండలాలలోకి బదిలీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కొంతమంది అధికారులు జంకుగొంకు లేకుండా  ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నట్టుగా బాధితులు వాపోతున్నారు.

రాష్ట్రంలో గతేడాది అవినీతి నిరోధక శాఖ ద్వారా అనేక మంది పోలీస్‌, ‌రిజిస్ట్రేషన్‌, ‌రెవెన్యూ ఇంజనీరింగ్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఆదాయాలకు మించి వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నట్లుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏసిబి పట్టుకున్న అనేకమంది అధికారులు తిరిగి ఉన్నత స్థాయి పదవులలో పనిచేయడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. పెట్టిన కేసులను నిర్వీర్యం చేయడం లేదా క్షమాభిక్ష పెట్టడం మన పాలకులకు ఆనవాయితీగా మారిందని అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్న సభ్య సమాజం అభిప్రాయపడుతున్నది. అవినీతి కేసుల్లో అరెస్టయిన అధికారులను తిరిగి ఉద్యోగంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికిచట్టాన్ని సవరించవలసిన విషయాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక వేళ కొన్నేళ్లు శిక్ష తర్వాత తిరిగి ఉద్యోగంలోకి అవకాశం ఇచ్చినా ఉద్యోగి స్థాయిని తగ్గించి ఇతర శాఖల లోకి బదిలీ చేయడం కూడా అవసరమే. అవినీతి మూలంగా రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ బ్రష్టు పట్టిపోతోంది.

అభివృద్ధి సంక్షేమ పథకాల మొత్తం ఖర్చులో ప్రజలకు 30 నుంచి 40 శాతం నిధులు కూడా చేరడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలు, బంధుప్రీతితో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో నాయకులను, ప్రభుత్వాలను మార్చడం జరుగుతున్నది. అయినా అవినీతి మరింత పెరిగిపోతుందనీ బాధిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ‌కవిత ప్రతిపాదించిన లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో చిక్కుకొని జైలు పాలై ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయానికి గురయ్యాడు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి నిరోధక శాఖను మరింత బలోపేతం చేసి పరిధిని విస్తరించి ప్రతి రోజు అవినీతి అధికారులపై నిఘా పెట్టడం అవసరం.

అవినీతి నిరోధక శాఖ ద్వారా కరుడుగట్టిన అవినీతి అధికారులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుండి తొలగించే కార్యక్రమం చేపట్టాలి. ప్రభుత్వ వ్యవస్థల లో వేళ్ళునుకొని ఉన్న అవినీతి మూలంగా ప్రభుత్వం చేసే అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నీరు  కారిపోతున్నాయి. ఒక ప్రక్కన దోపిడీ చేసే ప్రైవేటు కార్పొరేట్‌ ‌వైద్య సంస్థలు, విద్యాసంస్థలు మరోవైపు అవినీతి అధికారుల కబంధ హస్తాలలో చిక్కుకున్న సాధారణ ప్రజలు గౌరవప్రదంగా బ్రతకలేకపోతున్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు రాష్ట్ర అభివృద్ధి ఫలాలు లభించకపోయినా పాలకులు కనీసం ఈ అవినీతి నుండైనా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తించాలి.

image.png
ప్రొ।। కూరపాటి వెంకట్‌ ‌నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *