కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర స్టే రాష్ట్రంలో ఒక సరికొత్త, అత్యంత ఆవశ్యకమైన చర్చకు తెరతీసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా నిలిచిన ఈ పథకాలు ప్రజాదరణ పొందినప్పటికీ, న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఈ రెండు పథకాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు చట్టబద్ధత ఉండాలా? కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా ఏటా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దశాబ్దాల తరబడి ఖర్చు చేయవొచ్చా? అనే రాజ్యాంగబద్ధ, పరిపాలనాపరమైన ప్రాథమికాంశాలను ఈ పరిణామం ప్రశ్నిస్తున్నది.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలి. ఒక పథకాన్ని కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రవేశపెట్టినప్పుడు, దానికి శాసనసభ ఆమోదం కేవలం బడ్జెట్ కేటాయింపుల రూపంలోనే లభిస్తుంది.
కానీ, ఆ పథకం నియమ నిబంధనలు, అర్హుల ఎంపిక, పారదర్శకతపై సమగ్రమైన చర్చ జరగదు. శాసనసభలో చట్టం చేయడం ద్వారా మాత్రమే ఒక పథకానికి పూర్తి స్థాయి చట్టబద్ధత, స్థిరత్వం లభిస్తాయి. చట్టబద్ధత లేని పథకాలు ప్రభుత్వాలు మారినప్పుడు లేదా పాలకుల ప్రాధాన్యతలు మారినప్పుడు సులభంగా రద్దు కావడానికి లేదా మార్పులకు గురికావడానికి అవకాశం ఉంటుంది. కేవలం పాలకుల విచక్షణ పై ఆధారపడి నడిచే పథకాల వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర ఖజానాపై పడే భారం, వాటి నిర్వహణలో జరిగే అవినీతిని అరికట్టడం కష్టమవుతుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందిన మాట నిజమే అయినప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున నిధుల బదిలీ జరిగే ప్రక్రియకు నిర్దిష్టమైన చట్టపరమైన రక్షణలు అవసరం. న్యాయస్థానం కూడా పథకం ఉద్దేశాన్ని తప్పుపట్టలేదు; కేవలం దాని అమలు తీరు, దానికి ఉన్న చట్టబద్ధ ఆధారాన్ని మాత్రమే ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉపాధి హామీ (ఎంజీఎన్ ఆర్ ఈజీఏ) లేదా ఆహార భద్రత వంటి పథకాలకు పార్లమెంటు చట్టాల రక్షణ ఉంది. దీనివల్ల లబ్ధిదారులకు అది ఒక ‘హక్కు’గా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలుగా మార్చాలి. అప్పుడే పథకాలకు శాశ్వతత్వం చేకూరుతుంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగ్గుతుంది. అర్హత ఉండి పథకం అందకపోతే ప్రజలు న్యాయం కోరే హక్కు లభిస్తుంది.హైకోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వును ప్రభుత్వాలు ఒక హెచ్చరికగా కన్నా, తమ పరిపాలనా విధానాన్ని సంస్కరించుకునే అవకాశంగా భావించాలి. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ఎంత ముఖ్యమో, దాన్ని అమలు చేసే విధానంలో పారదర్శకత, చట్టబద్ధత కూడా అంతే ముఖ్యం.
ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదనే వాదన ఒకవైపు ఉన్నప్పటికీ, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ సమీక్ష తప్పనిసరవుతుం ది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తక్షణ వోట్ల వేట కోసం చట్టబద్ధత లేని పథకాలను ప్రకటించడం దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు, హైకోర్టు జోక్యం ప్రజాధన రక్షణకు ఒక ముందస్తు రక్షణ కవచంలా పనిచేస్తుందనే చెప్పాలి. భవిష్యత్తులో వొచ్చే ప్రభుత్వాలు కూడా పారదర్శకత లేని జీఓ ల ద్వారా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేయకుండా ఈ తీర్పు ఒక స్పష్టమైన గీటురాయిగా మారుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు ఎలాంటి చెక్కులు లేదా నగదు బదిలీ చేయకూడదు కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఈ పథకాలకు కేటాయించిన వందలాది కోట్ల రూపాయల నిధులు తాత్కాలికంగా ప్రభుత్వ ఖజానా లోనే నిలిచిపోతాయి. దీనివల్ల తక్షణ ప్రాతిపదికన ప్రభుత్వానికి కొంత నగదు లభ్యత పెరుగుతుంది.
ఈ కేసులో ప్రధానంగా లేవనెత్తిన అంశం– రాజ్యాంగంలోని ఆర్టికల్ 202, 204, 266, 283 ల ఉల్లంఘన. బడ్జెట్ ఆమోదం పొందినప్పటికీ, నిర్దిష్ట చట్టం లేకుండా ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ ద్వారా నిధులు విత్‌డ్రా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ తీర్పుతో ప్రభుత్వం ఇకపై బడ్జెట్ కేటాయింపులు చేసేటప్పుడు కేవలం అంకెలు చూపించడమే కాకుండా, వాటి వెనుక బలమైన శాసనసభ చట్టం ఉండేలా చూసుకోవాల్సి వొస్తుంది. ఇది దీర్ఘకాలంలో బడ్జెట్ పారదర్శకతను పెంచుతుంది.
ఏదైనా ఒక సంక్షేమ పథకానికి చట్టబద్ధత కల్పించినప్పుడు, దానికి సంబంధించిన నిధుల వినియోగాన్ని కాగ్ వంటి స్వతంత్ర సంస్థలు మరింత కచ్చితత్వంతో ఆడిట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని రెట్టింపు చేస్తుంది. సంక్షేమం అనేది కేవలం పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ‘ఉచితం’ కాకూడదు, అది పౌరుల ‘హక్కు’గా మారాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ న్యాయపరమైన సవాలును ఒక సదవకాశంగా మలుచుకుని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు బడ్జెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ప్రత్యేక చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే లబ్ధిదారుల్లో నమ్మకం పెరగడమే కాకుండా, న్యాయపరమైన చిక్కుల నుంచి ఈ ప్రజాకర్షక పథకాలకు శాశ్వత విముక్తి లభిస్తుంది.





