తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని ఎట్టకేలకు ప్రభుత్వమే గుర్తించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 235 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ధారణకు వొచ్చింది. నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని నిర్ణయించడం, రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భావించడం స్వాగతించాల్సిన చర్యలే. కానీ కరువును గుర్తించడం మొదటి అడుగు మాత్రమే. కరువుతో పోరాడుతున్న రైతుకు ప్రభుత్వం నుంచి భరోసా ఎప్పుడు అందుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
రాష్ట్ర సగటు వర్షపాతం లోటు 17 శాతం అని చెప్పడం ద్వారా పరిస్థితి తీవ్రత పూర్తిగా అర్థం కాదు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఉంటే, మరికొన్ని మండలాల్లో పంటలు నిలబడలేని పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా కాకుండా మండలమే ప్రాతిపదికగా కరువు తీవ్రతను అంచనా వేయాలి. వర్షపాతం ఎంత తగ్గింది? సాగు విస్తీర్ణం ఎంత తగ్గింది? వేసిన పంటలో ఎంత ఎండిపోయింది? భూగర్భ జలాలు ఏ స్థాయికి పడిపోయాయి? చెరువులు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితి ఏమిటి? అనే వివరాల ఆధారంగా సహాయం నిర్ణయించాలి.
కరువు అంటే రైతు పొలంలో పంట ఎండిపోవడం మాత్రమే కాదు. దాని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై పడుతుంది. పంట చేతికి రాకపోతే రైతు ఆదాయం పోతుంది. వ్యవసాయ కూలీకి పని తగ్గుతుంది. పశువులకు మేత, నీరు కష్టమవుతాయి. అప్పుల భారం పెరుగుతుంది. ఆఖరుకు గ్రామీణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గి చిన్న వ్యాపారాలపైనా ప్రభావం పడుతుంది. అందుకే కరువు ను అధిగమించే చర్యలను వ్యవసాయ శాఖ ఒక్కదాని బాధ్యతగా చూడలేం.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తినట్లు ప్రభుత్వం గుర్తించడం మరింత ఆందోళన కలిగించే విషయం. మరోవైపు విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వర్షాభావంతో సాగునీటి కోసం బోర్లపై ఆధారపడటం పెరిగితే విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నీటి కొరత–వ్యవసాయం–విద్యుత్ డిమాండ్ మూడూ ఒకదానితో మరొకటి ముడిపడిన సంక్షోభంగా మారుతున్నాయి.ఈ పరిస్థితిలో కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోసం ఎదురుచూడటంతో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ముగియదు. కేంద్రం నుంచి ఎంత వొస్తుందో, ఎప్పుడు వొస్తుందో..అసలు వొస్తుందో రాదో తర్వాతి విషయం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వనరులతో అత్యవసర కార్యాచరణ ప్రారంభించాలి. ప్రభావిత మండలాల్లో పంట నష్టం అంచనాను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి. యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సరఫరా ప్రణాలికను సిద్ధం చేయాలి. పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రబీ సాగుకు అందుబాటులో ఉన్న నీటిపై ముందుగానే స్పష్టత ఇవ్వాలి.
అంతేకాదు, పంట నష్టపోయిన రైతుల రుణాల విషయంలో బ్యాంకులతో ప్రభుత్వం చర్చించాలి. అవసరమైన ప్రాంతాల్లో తిరిగి చెల్లించడానికి రీషెడ్యూలింగ్ కు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ పనులు తగ్గే గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి కూలీల ఆదాయానికి రక్షణ కల్పించాలి. రైతుకు సహాయం ప్రకటించడం మాత్రమే కాదు—ఎవరికి ఎంత సహాయం అందింది, ఎప్పుడు అందింది అన్న వివరాలు కూడా ప్రజలకు తెలియాలి.అందుకోసం 235 మండలాలకు సంబంధించిన వర్షపాతం, పంట నష్టం, భూగర్భజలాలు, తాగునీటి పరిస్థితి, పరిహారం పంపిణీ వివరాలతో ప్రజలకు అందుబాటులో ఉండే ‘కరువు డ్యాష్‌బోర్డ్’ ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే అర్హుడైన రైతు జాబితాలో ఉన్నాడా లేదా తెలుసుకోగలడు; ప్రభుత్వ చర్యలనూ ప్రజలు పరిశీలించగలుగుతారు.
ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వం ఆపలేకపోవొచ్చు. కానీ దాని ప్రభావం ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. వాతావరణ మార్పుల కారణంగా ఒక సంవత్సరం అతివృష్టి, మరో సంవత్సరం వర్షాభావం ఎదురయ్యే పరిస్థితుల్లో శాశ్వత అనావృష్టి నివారణ ప్రణాళిక తెలంగాణకు అవసరం. 235 మండలాల్లో వర్షాభావ తీవ్రతను గుర్తించడం ఆలస్యమైనా అవసరమైన అడుగు. ఇప్పుడు కావాల్సింది సమావేశాలు, నివేదికలు మాత్రమే కాదు—క్షేత్రస్థాయిలో కనిపించే కార్యాచరణ. కరవును ప్రభుత్వం గుర్తించింది… ఇక రైతుతో పాటు సామాన్య ప్రజలకు భరోసా కనిపించాలి.





