విద్యుత్ భారం: వినియోగదారుడే బలిపశువా?

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రెండు డిస్కమ్‌లకు గత ఆర్థిక సంవత్సరాల (2022-23, 2023-24) ఆదాయ లోటు, విద్యుత్ కొనుగోలు వ్యయాల సర్దుబాటు కింద రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ రికవరీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, సాధారణ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై ఏకంగా రూ.5,420.23 కోట్ల భారీ భారం పడనుంది. నవంబర్ బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఈ రికవరీ ప్రక్రియ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో 26 నెలల పాటు సాగనుంది. ‘ట్రూ-అప్’ అనేది చట్టబద్ధమైన రెగ్యులేటరీ విధానమే అయినప్పటికీ, ఇంతటి భారీ ఆర్థిక భారం వెనుక దాగున్న డిస్కమ్‌ల వైఫల్యాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఇప్పుడు తీవ్ర చర్చ అవసరమౌతుంది .

డిస్కమ్‌లు తాము ముందే అంచనా వేసిన విద్యుత్ కొనుగోలు వ్యయాలకు, వాస్తవంగా మార్కెట్లో చెల్లించిన ధరలకు మధ్య భారీ వ్యత్యాసం రావడం వల్లే ఈ అదనపు భారం ఏర్పడింది. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీనివల్ల బహిరంగ మార్కెట్ (ఎనర్జీ ఎక్స్ఛేంజ్) లో డిస్కమ్‌లు అత్యధిక ధరలకు స్వల్పకాలిక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వొచ్చింది. ముందస్తు ప్రణాళిక లోపించడం, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) సక్రమంగా లేకపోవడం వల్లే పవర్ పర్చేజ్ కాస్ట్ అదుపు తప్పి, ఈ స్థాయి లోటుకు దారితీసింది. విద్యుత్ రంగాన్ని కుదిపేస్తోన్న మరో ప్రధాన సమస్య డిస్కమ్‌ల నిర్వహణ లోపాలు, సరఫరా-పంపిణీ నష్టాలు. గ్రిడ్ ఆధునీకరణ మందగించడం, విద్యుత్ దొంగతనాలు, ఉచిత విద్యుత్ సరఫరాలో సరైన మీటరింగ్ లేకపోవడం వల్ల ఏటా వందల కోట్ల నష్టం వాటిల్లుతున్నది . వీటికి తోడు ప్రభుత్వ సబ్సిడీ బకాయిల పాత్ర అత్యంత కీలకంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి డిస్కమ్‌లకు అందాల్సిన వేల కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు సకాలంలో రాకపోవడంతో, సంస్థలు రోజువారీ నిర్వహణకు మరియు విద్యుత్ కొనుగోళ్లకు భారీగా అప్పులు చేయాల్సి వొస్తున్నది . ఈ అప్పులపై వడ్డీల భారం కూడా చివరికి వినియోగదారుడి పైకే నెడుతున్నారు.

విద్యుత్ నిర్వహణలో, కొనుగోళ్లలో లోపాలు డిస్కమ్‌లవి; సకాలంలో నిధులు విడుదల చేయని తప్పు ప్రభుత్వానిది. కానీ, ఈ రెండింటికీ ఏమాత్రం సంబంధం లేని సామాన్య వినియోగదారుడు ఆఖరుకు ‘బలిపశువు’ ఎందుకు కావాలనేది ప్రాథమిక ప్రశ్న. బిల్లులు క్రమబద్ధంగా చెల్లించే వినియోగదారుడిపై శిక్షలాంటి ఈ ట్రూ-అప్ వసూళ్లు సమర్థనీయం కావు. అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ఏర్పడిన లోటును ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడం కంటే, డిస్కమ్‌ల అంతర్గత సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం కేవలం వ్యవసాయ సబ్సిడీ వాటాను భరిస్తే సరిపోదు. డిస్కమ్‌లను బలోపేతం చేసేందుకు తక్షణ ప్యాకేజీని ప్రకటించాలి. ప్రభుత్వ సంస్థల బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలి. అలాగే, డిస్కమ్‌లు కూడా పారదర్శకమైన విద్యుత్ కొనుగోలు విధానాలను అవలంబించకపోతే, భవిష్యత్తులో సామాన్యుడిపై కరెంట్ బిల్లుల భారం మరింత అసాధ్యమైన స్థాయికి చేరుకుంటుంది.

ఈ ట్రూ-అప్ భారం కేవలం వాతావరణ మార్పుల వల్లో, పెరిగిన విద్యుత్ డిమాండ్ వల్లో మాత్రమే రాలేదు. దీని వెనుక ఏళ్ల తరబడి పేరుకుపోయిన పంపిణీ సంస్థల పాలనాపరమైన వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిస్కమ్‌లు విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ, వాటికి రావాల్సిన వాస్తవ రాబడికి, చేస్తున్న ఖర్చుకు పొంతన ఉండటం లేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ వినియోగాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడంలో మీటరింగ్ లోపాలు స్పష్టమైన అడ్డంకిగా మారాయి. పంపిణీ నష్టాలను తగ్గించడంలో జాతీయ సగటు కంటే వెనుకబడి ఉండటం సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నది . సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోకపోవడం, గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ ‘ట్రూ-అప్’ మార్గాన్ని సులువైన ప్రత్యామ్నాయంగా మార్చుకున్నారు.

మరోవైపు ప్రభుత్వాలు ఉచితాలు, సబ్సిడీలను ప్రకటించి రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయే తప్ప, వాటికి సమానమైన నిధులను డిస్కమ్‌లకు సకాలంలో విడుదల చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో డిస్కమ్‌లకు స్వేచ్ఛ కరువైంది. దీంతో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల వడ్డీలు కొండలా పేరుకుపోయాయి. ఈ అదనపు 50 పైసల భారం కేవలం గృహ వినియోగదారులకే పరిమితం కాదు; వాణిజ్య, పారిశ్రామిక రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిశ్రమలపై విద్యుత్ ఖర్చులు పెరిగితే, ఉత్పత్తి వ్యయం పెరిగి సరుకుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది అంతిమంగా మార్కెట్లో ద్రవ్యోల్బణానికి దారితీసి మళ్లీ సామాన్య ప్రజల జేబులకే చిల్లు పెడుతుంది. పాలకుల ఉదాసీనతకు, డిస్కమ్‌ల అసమర్థతకు పన్నులు కట్టే పౌరుడే నిరంతరం నష్టపరిహారం చెల్లించాల్సి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతుంది . ఇప్పటికైనా విద్యుత్ రంగంలో జవాబుదారీతనం పెరగకుంటే ఈ భారం శాశ్వతంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *