– అంతిమంగా సత్యానిదే గెలుపు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
దుబాయి, సెప్టెంబర్ 24 : ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చారిత్రక విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. సత్యమేవ జయతే- ప్రజాస్వామ్యంలో ఎంతటివారైనా రాజ్యాంగానికి తలవంచాల్సిందేనని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తమ శాసనసభా పక్షం చేసిన రాజీ లేని న్యాయ పోరాటం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందన్నారు. చట్టసభలు ఆయారాం, గయారాంలకు అడ్డా కాకూడదని, ఘర్ వాపసీల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అహంకారానికి గట్టి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటాన్ని, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కంచే చేను మేసిన వైనాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. న్యాయం ముందు ఎవరూ తప్పించుకోలేరని తేలిపోయిందన్నారు. రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో తక్షణమే రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగ ప్రతి పట్టుకుని దేశమంతా తిరుగుతూ సంవిధాన్ బచావో అని నాటకాలాడుతున్న రాహుల్ గాంధీ మరో పార్టీ బీ-ఫాంతో గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించడం ఆయన నయవంచనకు, కపట రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని రామచందర్‌రావు మండిపడ్డారు.
ఆ తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు
– బీఆర్ ఎస్ నేత హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ గురించి పదేపదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోందని బీఆర్ ఎస్ నేత టి.హరీష్‌రావు అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సంవిధాన్ బచావో అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు.. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజమైన నిబద్ధత ఉంటే కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజల తీర్పు కోరాలని ఆయన డిమాండ్ చేయాలన్నారు. దిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుతున్న రాహుల్ తెలంగాణలో తమ పార్టీ అనుసరిస్తున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సంవిధాన్ బచావో అనేది కేవలం రాజకీయ నినాదమా.. లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా అనేది రాహుల్ గాంధీ స్పష్టం చేయాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ప్రజాక్షేత్రంలోకి పంపాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





