– బాల్య వివాహాల రహిత పంచాయతీలుగా తీర్మానించాలి
– సర్పంచ్ లు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శనివారం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, రక్షణతోపాటు గ్రామాల్లో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రతి గ్రామంలో బాల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ – సవాళ్లు, ప్రాధాన్యతలు, కార్యాచరణ ప్రణాళిక అనే ప్రధాన అజెండాతో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయి తీర్మానాలు
గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు. గత 12 నెలల్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగని గ్రామాలను బాల్య వివాహాల రహిత పంచాయతీలుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని సూచించారు. బాల్య వివాహాల నిరోధంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల విద్య, పోషకాహారం, ఆరోగ్యం, టీకాలు, రక్షిత మంచినీరు వంటి ప్రాథమిక సేవలపై గ్రామ సభల్లో చర్చించాలని సూచించారు. పిల్లలకు అవసరమైన సేవల్లో లోటుపాట్లను గుర్తించి వాటి పరిష్కారానికి తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో చేర్చాలని ఆదేశించారు. బాలల సమస్యలపై గ్రామ సభల్లో చర్చించే సమయంలో వారి వ్యక్తిగత వివరాలు, సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గ్రామ సభలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసే సమయంలో కూడా పిల్లల గోప్యతకు భంగం కలగకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





