– గురుకుల విద్యార్థులకు సరుకులు, కిట్ల సరఫరాలో జాప్యంపై మంత్రి అసంతృప్తి
– నిర్ణీత గడువులోగా సరఫరా పూర్తి కాకుంటే కఠిన చర్యలు
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలకు, అలాగే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, స్టూడెంట్ కిట్లను నిర్ణీత గడువులోగా అందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆహారం, వసతి, నిత్యావసరాల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా బాధ్యులను చేస్తామని, విద్యార్థుల సంక్షేమానికి విఘాతం కలిగించే లోపాలను సహించబోమని హెచ్చరించారు. గురుకుల విద్యాసంస్థలకు పీఎంయూ (ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్) ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకులు, విద్యార్థుల కిట్లు, ఇతర సామగ్రి సరఫరాపై మంత్రి సచివాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారుల నుంచి సరఫరా పురోగతి, పెండింగ్లో ఉన్న వస్తువులు, వాటి నాణ్యత, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తదితర అంశాలపై వివరాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
మఫత్ లాల్ సంస్థకు మంత్రి తీవ్ర హెచ్చరిక
గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం ఆగస్టులోనే టెండర్ ప్రక్రియను ఖరారు చేసి సంబంధిత కాంట్రాక్టర్లకు ఆర్డర్లు జారీ చేసినప్పటికీ విద్యాసంస్థల నుంచి అందిన ఇండెంట్లకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సరుకులు సరఫరా కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మఫత్ లాల్ సంస్థ సరఫరాలో వెనుకబడటాన్ని ప్రస్తావిస్తూ పెండింగ్లో ఉన్న వస్తువులన్నింటినీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పాఠశాలలకు చేరవేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 2,000 జతల రెండో విడత తెల్ల సాక్సులు, 3,000 ట్రంకు పెట్టెల సరఫరా పెండింగ్లో ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. వీటితోపాటు మిగిలిన వస్తువులన్నింటినీ ఏ తేదీలోగా, ఏయే పాఠశాలలకు సరఫరా చేస్తారో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సరఫరా సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సరఫరా చేయకపోతే టెండర్ ఒప్పందంలోని నిబంధనలు, షరతుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో పీఎంయూ చైర్మన్ తగిన చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి స్పందించిన మఫత్ లాల్ సంస్థ ప్రతినిధి, పెండింగ్లో ఉన్న వస్తువులను ఈ నెల 16లోపు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
వస్తువు నాణ్యతపై ప్రత్యేక నిఘా.. బాధ్యత ఎవరిదో తేల్చాలి
గురుకులాలకు సరఫరా చేస్తున్న ప్రతి వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. సరఫరా చేసిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తున్న అధికారులు ఎవరు? ప్రతి విద్యాసంస్థలో సరుకుల స్వీకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనే అంశాలపై అన్ని శాఖల అధిపతులు (హెచ్ఓడీలు) సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేవలం టెండర్లు ఖరారు చేయడం, సరఫరా సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడంతోనే బాధ్యత ముగిసిపోదని, విద్యార్థులకు అవసరమైన ప్రతి వస్తువు వాస్తవంగా పాఠశాలకు చేరిందా లేదా అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో నోడల్ అధికారి.. బఫర్ స్టాక్ తప్పనిసరి
గురుకుల విద్యాసంస్థల్లో నిత్యావసర సరుకులు, విద్యార్థులకు అవసరమైన సామగ్రి కొరత ఏర్పడకుండా ముందస్తుగా బఫర్ స్టాక్ (అదనపు నిల్వలు) నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లోని గురుకులాలను పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. సంక్షేమ గురుకులాల అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అధికారులు పాఠశాలలను సందర్శించి ఇండెంట్లకు అనుగుణంగా సరుకులు అందుబాటులో ఉన్నాయా.. బఫర్ స్టాక్ నిర్వహిస్తున్నారా.. సరఫరాలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. సరఫరా సంస్థలు, పీఎంయూ ప్రతినిధులు ప్రతి జిల్లాలో సమన్వయంతో పనిచేస్తూ స్టాక్ వివరాలు, సరఫరా పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.
25లోగా సరఫరాపై స్పష్టమైన పురోగతి నివేదిక
విద్యాసంస్థలు సమర్పించిన ఇండెంట్లకు అనుగుణంగా అన్ని వస్తువుల సరఫరాను పూర్తి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. 25 నాటికి సరఫరా సంస్థలు అన్ని వస్తువుల సరఫరా పురోగతిపై సమగ్ర వివరాలు అందించాలని, పెండింగ్లో ఉన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఏవైనా లోటుపాట్లు గుర్తిస్తే తక్షణమే సరిదిద్ది విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల భోజనం, సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావులేదు
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత, ఆహార పదార్థాల సరఫరా, ఇతర నిత్యావసరాల నిర్వహణ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వారి ఆహారం, ఆరోగ్యం, విద్య, వసతి విషయంలో ఏ చిన్న లోపం జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, చైర్మన్ గుగులోతు రవి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.ఎల్.సంతోష్, పీఎంయూ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





