– అవినీతి రహిత పాలన దిశగా కీలక ముందడుగు
– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరుస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఒ సర్టిఫికెట్లు లభించాయి. ఈ సర్టిఫికెట్లను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం అందుకున్నారు.రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ఐఎస్ఒ ప్రతినిధుల బృందం ఈ మేరకు సర్టిఫికెట్లను అందచేసింది. పాలనాపరమైన అంశాల్లో నాణ్యతా ప్రమాణాల వ్యవస్థ పటిష్టంగా అమలు చేస్తున్నందుకు ఐఎస్ఒ 9001:2015 (నాణ్యతా నిర్వహణ వ్యవస్థ) సర్టిఫికెట్ తోపాటు అవినీతికి తావులేకుండా సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్నిపెంపొందించే చర్యలకు ఐఎస్ఒ 37001:2016 (అవినీతి నిరోధక నిర్వహణ వ్యవస్థ) సర్టిఫికెట్లు లభించాయి. అలాగే ఐటీ సర్వీసుల్లో అత్యున్నతమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఐఎస్ఒ27001 ( సమాచార భద్రతా నిర్వహణ వ్యవస్థ), వినియోగదారుల సంతృప్తి, ఫిర్యాదుల పరిష్కార నిర్వహణ వ్యవస్థ నిర్వహణకు ఐఎస్ఒ10002 సర్టిఫికేట్లను ఐఎస్ఒ సంస్థ జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ లో అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయడంలో మంత్రి పొంగులేటి మార్గదర్శకంలో సంస్థ ఎండీ గౌతం అనేక రకాల సంస్కరణలను తీసుకొచ్చారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేయడంతోపాటు, పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన దగ్గర నుంచి ఇండ్ల కేటాయింపు, మంజూరు, బిల్లుల విడుదల మొదలైన ప్రక్రియల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా ఇందిరమ్మ యాప్ ను వినియోగిస్తున్నారు. ఇండ్ల పథకంలో నాణ్యమైన సేవలు అందించడంతోపాటు కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించి, అవినీతికి తావులేని పని సంస్కృతిని తీసుకురావాలనే లక్ష్యంతో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అవినీతి, లంచగొండి తనాన్ని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను నిర్వహించడంతోపాటు ముఖ్యంగా ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను (1800 599 5991) కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు అంతర్జాతీయ ధ్రువీకరణలు సంస్థకు లభించిన గుర్తింపులు మాత్రమే కాక నాణ్యతతో కూడిన పరిపాలన, నైతిక విలువలు, పారదర్శకత, జవాబుదారీతనం దిశగా చేపట్టిన కీలక ముందడుగు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





