– కాళోజీ గొప్ప ప్రజా కవి
– ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవడమే నిజమైన నివాళి
– స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం
– కాళోజీ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు భవాని
నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజల కష్టాలను, కన్నీళ్లను, ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించిన గొప్ప ప్రజాకవి అని ‘కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు పి.భవాని అన్నారు. కాళోజీ తన జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలను, అక్రమాలను,సామాజిక అసమానతలను ప్రశ్నించారని పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణరావు 24వ వర్ధంతి సందర్భంగా నవంబర్ 13న నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నల్లగొండ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.సతీష్ కుమార్, కార్యదర్శి బి.అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళోజి అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు పి. భవాని మాట్లాడుతూ కాళోజీ కవిత్వం కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదని,అది ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సామాజిక ఉద్యమమని అన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం,మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండటమే కాళోజీకి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
కాళోజీ ఆశయాల్లో మానవత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉందని,మనిషిని మనిషిగా గౌరవించడం,కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని భవాని పేర్కొన్నారు.ఈ స్ఫూర్తితోనే ఆయన వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.రక్తదానం అనేది మరొక మనిషికి ప్రాణం పోసే గొప్ప మానవతా కార్యక్రమమని అన్నారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాలు,ఇతర వైద్య అవసరాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. ఆరోగ్యపరంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా సమాజంలో సమానత్వం, సహకారం, సేవాభావం వంటి విలువలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, మహిళా న్యాయవాదులు న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడటమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండటం అభినందనీయమని అన్నారు.న్యాయవాద వృత్తి అనేది కేవలం వృత్తిపరమైన బాధ్యత మాత్రమే కాదని, సమాజం పట్ల బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కాళోజీ వర్ధంతిని కేవలం స్మరణ కార్యక్రమంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.మాటలతో నివాళులు అర్పించడం కంటే చేతల్లో మానవత్వాన్ని చాటడం గొప్ప విషయమని అన్నారు.భవిష్యత్తులో కూడా కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక చైతన్యం,మానవతా విలువలు, ప్రజాసేవ లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పి.భవాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పజ్జూరి స్వామి గౌడ్,నూకల సంధ్యారాణి, బార్ అసోసియేషన్ సభ్యులు పందుల సైదులు,నాంపల్లి భాగ్య, స్వామి దాస్,న్యాయవాదులు పి.శ్రీనివాస్ రెడ్డి, ఎం.వి. రాఘవరావు,ఎస్.శ్రీనివాస రెడ్డి, జె.లక్ష్మణ్, నాగిరెడ్డి, మామిడి ప్రమీల,పజూరి ఇందిర,తడకమల్ల వరుణ, దర్శనం ప్రియాంక, ముక్కెర శ్రీనివాస్,అంజనా యాదవ్, ఎం.నరేష్, సిహెచ్.సతీష్ కుమార్,మానుపాటి శ్రీకాంత్, పిట్ట సతీష్ అనేకమంది సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





