అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి
– చారిత్రక కట్టడాల పరిరక్షణ, ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు
– పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచాలి
– అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి అంటే పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా భవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులు, శాఖ పరిధిలోని ఆస్తుల వినియోగం, బడ్జెట్ కేటాయింపులు, ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పర్యాటక శాఖ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. భవనాలు ఉన్న ఆస్తులు, ఖాళీ స్థలాలు, పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

టూరిజం ద్వారా గ్లోబల్ గుర్తింపు

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా విస్తృత స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలన్నారు.

చారిత్రక సంపద పరిరక్షణకు ప్రభుత్వ మద్దతు

రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతలో కీలక భాగమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రామప్ప వంటి చారిత్రక ప్రదేశాల్లో పరిరక్షణ, నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తొమన్నారు. అదే సమయంలో కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వ బాధ్యతగా చేపట్టాల్సిన పరిరక్షణ కార్యక్రమాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టగల అభివృద్ధి ప్రాజెక్టుల మధ్య సమతుల్యత పాటించాలన్నారు.

‘తెలంగాణ దర్శిని’కి ప్రాధాన్యం

విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సమావేశంలో చర్చించారు. విద్యార్థులను చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర వారసత్వంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పర్యాటక రంగంపై చిన్న వయసు నుంచే ఆసక్తి పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు వివరించారు.

పెట్టుబడుల ఆకర్షణలో సమస్యలను పరిష్కరించాలి

పర్యాటక ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి అవసరమైనచోట అన్ని శాఖల అధికారులతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పెరిగేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *