మహిళా బిల్లుపై మాటల యుద్ధం

-కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజుకు రాహుల్‌ ‌కౌంటర్‌

‌న్యూదిల్లీ, ఆగస్ట్ 8 : ‌మహిళా రిజర్వేషన్‌ అం‌శంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు ’ఎక్స్’ ‌వేదికగా పరస్పరం స్పందించారు. మహిళా శక్తిపై రాహుల్‌ ‌వ్యాఖ్యలను స్వాగతించిన రిజిజు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌పార్టీ బేషరతుగా మద్దతివ్వాలని కోరారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన రాహుల్‌ మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. వీడియోపై రిజిజు స్పందిస్తూ ’కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇది సానుకూల సందేశంగా కనిపిస్తోంది. రాహుల్‌ ‌వైఖరిలో మహిళల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది’ అని పోస్ట్ ‌చేశారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతివ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ ‌గాంధీ వెంటనే స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును 2023లోనే పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కంటే ఈ విషయం ఎవరికి బాగా తెలుస్తుంది? మహిళా రిజర్వేషన్‌ ‌చట్టం-2023 కాంగ్రెస్‌ ‌పూర్తి మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదమైంది.. అయినా మూడేళ్లు గడిచినా ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు దాన్ని డీలిమిటేషన్‌తో అనవసరంగా ఎందుకు ముడిపెడుతున్నారు అని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్‌ ‌కల్పించే 2023 చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. రాహుల్‌ ‌విడుదల చేసిన ఈ వీడియోలో మహిళల సామర్థ్యంపై విస్తృతంగా ప్రసంగించారు. దేశంలోని మహిళల శక్తి ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని, తమకు నచ్చిన రంగాల్లో ముందుకు సాగేందుకు అవకాశం ఉండాలని పేర్కొన్నారు. మహిళలు.. వ్యాపారం, రాజకీయాల్లో రాణించడమే కాక ఇళ్లలోనూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలగాలని, సమాజంలో ఎలాంటి భయం లేకుండా తిరగగలగాలని చెప్పారు. పితృస్వామ్య భావజాలం, మహిళలపై ఉండే కఠిన నియంత్రణ నుంచి కొంత విముక్తి అవసరమని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. మహిళా శక్తి, మహిళా రిజర్వేషన్‌ అం‌శాలపై రాహుల్‌ ‌వరుస వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం-కాంగ్రెస్‌ ‌మధ్య రాజకీయ వాగ్వాదం మరోసారి తెరపైకి వచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *