– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు
– మరో రెండు రోజులు మాత్రమే గడువు
– 20 తర్వాత లాటరీ
– హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో నిర్మించనున్న ఫ్లాట్లకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 ఇండ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా శనివారంనాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో విలువైన భూముల్లో నిర్మిస్తున్న ఈ ఇండ్లను కేవలం నామమాత్రపు ధరకే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.30 నుంచి రూ.58 లక్షల వరకు ధర పలికే ఈ ఫ్లాట్లను ప్రజల సంక్షేమం కోసం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో కేవలం రూ.6 లక్షలకే ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. ఇండ్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. ప్రజలు సొంత ఇంటి కోసం తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి వలస/తరలివెళ్లకుండా ప్రస్తుతం వారు ఉంటున్న నియోజకవర్గంలోనే సొంత ఇంటిని పొందే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి కుల, ఆదాయ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇండ్లు రాని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజు రూ.10వేలు తిరిగి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను సమర్పించడానికి మరో రెండు రోజులు మాత్రమే గడవు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
20 తరువాత లాటరీ.. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి
ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తూనే మరోవైపు ఇండ్ల కేటాయింపు, నిర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై కూడా హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్నది. ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 20 నుంచి చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేకాక ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ పనులను చేపట్టడానికి టెండర్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఈ ఇండ్లన్నింటినీ ఒక ఏడాదిలోపే పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు గౌతం వెల్లడించారు.
నియోజకవర్గాలవారీగా దరఖాస్తులు
ఖైరతాబాద్ 4,394, అంబర్‌పేట 2,357, బహదూర్‌పుర-1,135, ఇబ్రహీంపట్నం-749, కూకట్‌పల్లి-5,233, కార్వాన్-1,574 మహేశ్వరం-471, మలక్‌పేట-2,846, మల్కాజిగిరి-1,033, మేడ్చల్-1,153, నాంపల్లి-3,613, సనత్ నగర్-1,046, కుత్భుల్లాపూర్-4,121, రాజేంద్రనగర్-1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్-1,374, శేరిలింగంపల్లి-2,530మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ టవర్స్‌కు సంబంధించి సందేహాల నివృత్తికి కాల్ సెంటర్ ఫోన్ 040-24603572ను సంప్రదించవచ్చని గౌతం సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





