లేలేత బాలసుమాల వికాసమిప్పుడు
మొగ్గదశలో నిస్తేజమై వాడి రాలిపడుతోంది
గూటిలోంచి రెక్కలు విదిలించేలోగా కాలం
అరచేతిలో మాయాదర్పణమొకటి మొలిపిస్తోంది!
చూపుడు వేలిని మంత్రదండం చేసి
కళ్లముందు ప్రజ్వరిల్లే రంగుల ప్రపంచంలోకి
శలభాల్లా ఆకర్షించి రెక్కల కదలికలు రాల్చేసి
మనోభావాలు ఇంకించి నాలుగు కళ్ల
మరబొమ్మల్లా మార్చేస్తోంది!
లోకం ఏమాత్రం తెలీని అమాయక చూపులు
నున్నటి వెలుగుల గాజుతెరలపై అమాంతం
జారి పడిపోతూ
వాస్తవానికి దూరంగా కృత్రిమలోకాల్లోకి
విసిరివేయబడుతోంటే
బాల్యం దారం తెంపుకొన్న పతంగిలా
టచ్ స్క్రీన్ పై చిక్కుకొని ఛిద్రమవుతోంది!
పరిసరాలు మరచిన రెప్పవాల్చని బానిసత్వం
అమ్మా నాన్నా తెగిపోయిన ఒంటిరి పక్షిలా
కళ్లలోనే ఆటపాటలాడేస్తూ
స్నేహాల పాలపుంతలు దాటేస్తూ
మరలి రాలేనంతగా అరచేతి అనంతవలయంలో
బందీయై గింగిరాలు తిరుగుతోంది!
సాంకేతికత కన్నా సహజత్వమే మిన్నని..
చిట్టిచిలకమ్మల కళ్ల కనికట్లు విప్పి తెప్పరిల్లజేయాలిక!
తెరల పంజరాలు తెంపి అనంత ఆకాశాలు అందివ్వాలి
లోకం మరచిన కాళ్ళకు కనిపించని కట్లు విప్పి
నేలపై స్వేచ్ఛగా ఎగరనివ్వాలి
భీమవరపు పురుషోత్తమ్





