ఎమ్మెల్యేల పనితీరు గ్రాఫ్‌ తో ఎంపీలకు తప్పని రాజకీయ సెగ!

“తెలంగాణలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడుతుంది. అలాంటప్పుడు వాటిలో రెండు, మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు అధ్వానంగా ఉంటే ఆ ప్రభావం ఎంపీపై పడకుండా ఎలా ఉంటుంది? ఎంపీ దిల్లీలో ఎంత చురుగ్గా వ్యవహరించినా, పార్లమెంటులో ఎన్ని ప్రశ్నలు సంధించినా, నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా స్థానికంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం సొంత పార్టీ ప్రజాప్రతినిధులే. రహదారులు బాగోలేకపోయినా, సాగునీటి సమస్య పరిష్కారం కాకపోయినా, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకపోయినా ప్రజలు ముందుగా నిలదీసేది ఎమ్మెల్యేనే. అయితే ఆ అసంతృప్తి అక్కడితో ఆగిపోదు. ఎంపీ పర్యటనల సందర్భంగా, పార్టీ సమావేశాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ అదే ప్రశ్నలు ఎదురవుతాయి..”

పెండ్యాల కొండల్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అధికార కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే పరిణామం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి క్రమంగా ఎంపీల రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో రాజకీయ సమీకరణాలను అధిగమించి విజయం సాధించిన ఎంపీలు ఇప్పుడు తాము ప్రత్యక్షంగా బాధ్యులు కాని అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరుకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల వైఫల్యాల సెగ ఎంపీలను తాకుతోంది. ఒకవైపు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని సమర్థించుకోవాల్సి వస్తుండగా, మరోవైపు సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకతను భరించాల్సి వస్తోంది. ఈ రాజకీయ పరిణామం రాబోయే ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌కు అంత తేలిగ్గా తీసిపారేయలేని హెచ్చరిక.

2025 ప్రారంభంలో వెలువడిన ఒక ప్రజాభిప్రాయ ఆధారిత ప్రజాప్రతినిధుల పనితీరు అంచనా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివిధ పార్టీలకు చెందిన 118 మంది ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించగా కేవలం 24 మందికే మంచి రేటింగ్ లభించింది. 36 మంది పనితీరు బాగోలేదని తేలగా, మరో 58 మంది సగటు లేదా ఫర్వాలేదనే స్థాయిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపించింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మంచి పనితీరు కనబరిచినవారిగా గుర్తింపు పొందారు. 20 మంది పేలవమైన పనితీరు కనబరిచినవారిగా, మరో 37 మంది సగటు స్థాయిలో ఉన్నవారిగా అంచనా వేయబడ్డారు. కాంగ్రెస్ మంత్రుల్లో డి. శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రమే మొత్తం ఎమ్మెల్యేల పనితీరు ర్యాంకింగ్స్‌లో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జరిగిన అంతర్గత సమీక్షలో సుమారు 26 మంది ఎమ్మెల్యేలను రెడ్‌జోన్‌లో గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. నియోజకవర్గాలకు తరచుగా వెళ్లకపోవడం, ఎక్కువ సమయం హైదరాబాద్‌కే పరిమితం కావడం, అభివృద్ధి పనుల్లో ఆలస్యం , పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణాలుగా పేర్కొనబడ్డాయి. ఇవన్నీ కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలుగా మిగిలిపోవడం లేదు. ప్రజల్లోకి చేరిన అభిప్రాయాలు, కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రతిపక్షాలకు లభిస్తున్న విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి.

తెలంగాణలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడుతుంది. అలాంటప్పుడు వాటిలో రెండు, మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు అధ్వానంగా ఉంటే ఆ ప్రభావం ఎంపీపై పడకుండా ఎలా ఉంటుంది? ఎంపీ దిల్లీలో ఎంత చురుగ్గా వ్యవహరించినా, పార్లమెంటులో ఎన్ని ప్రశ్నలు సంధించినా, నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా స్థానికంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం సొంత పార్టీ ప్రజాప్రతినిధులే. రహదారులు బాగోలేకపోయినా, సాగునీటి సమస్య పరిష్కారం కాకపోయినా, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకపోయినా ప్రజలు ముందుగా నిలదీసేది ఎమ్మెల్యేనే. అయితే ఆ అసంతృప్తి అక్కడితో ఆగిపోదు. ఎంపీ పర్యటనల సందర్భంగా, పార్టీ సమావేశాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ అదే ప్రశ్నలు ఎదురవుతాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరాజయం కూడా ఇదే వాస్తవాన్ని గుర్తుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతతోపాటు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పేరుకుపోయిన అసంతృప్తి కూడా ఆ పార్టీ ఓటమికి కారణమైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల రాజకీయ పరిణామాలు సైతం వ్యక్తిగత ప్రజాప్రతినిధుల ప్రభావాన్ని స్పష్టం చేశాయి. ఒక ఎమ్మెల్యే రాజకీయ వైఖరి లేదా విధేయత మారినప్పుడు సంబంధిత నియోజకవర్గంలో వోట్ల శాతాల్లో 20 శాతం పాయింట్ల వరకు మార్పులు నమోదైన సందర్భాలున్నాయి. అంటే స్థానిక నాయకుడిపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఎన్నికల ఫలితాలను ఎంతగా ప్రభావితం చేయగలదో అర్థమవుతోంది. ఇప్పుడు అదే రాజకీయ పరిణామం అధికార కాంగ్రెస్ ఎంపీలకు సవాలుగా మారుతోంది.

ఇక కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విడుదలలో ఆలస్యం  జరుగుతోందని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలకే ప్రాధాన్యం లభిస్తోందనే భావన కూడా కొందరిలో ఉంది. మరోవైపు పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు అప్పుడప్పుడు బహిర్గతమవుతున్నాయి. నిధులు, ప్రాధాన్యం, రాజకీయ గుర్తింపు విషయంలో ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన కార్యకర్తల్లో ఉత్సాహం ఎలా నిలుస్తుంది? 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రేయింబవళ్లు పనిచేసిన కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గుర్తింపు, అవకాశాలు లభించకపోతే ఆ నిరుత్సాహం చివరకు పార్టీ ఎన్నికల అవకాశాలనే దెబ్బతీస్తుంది.

ప్రతిపక్షాలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పనితీరు కనబరిస్తే, అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యాలను ఎత్తిచూపడం వారికి పెద్ద కష్టమేమీ కాదు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు సాధించిన విజయాలు కూడా కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనే సంకేతాలిచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఒకేసారి రెండు రాజకీయ పోరాటాలు చేయాల్సి వస్తోంది. పార్లమెంటులో తమ పనితీరును నిరూపించుకోవడంతోపాటు, రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తోంది.

నిజానికి ప్రజలకు ప్రభుత్వమంటే ముందుగా కనిపించేది రాష్ట్ర ప్రభుత్వమే. తమ గ్రామంలో రోడ్డు వేయించేది ఎవరు? సాగునీరు అందించాల్సిన బాధ్యత ఎవరిది? ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఆశ్రయించాలి? అన్న ప్రశ్నలకు ప్రజలకు తెలిసిన సమాధానం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఎంపీ పనితీరును అంచనా వేసేటప్పుడు కూడా ప్రజలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మొత్తం అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రాజకీయ వాస్తవాన్ని విస్మరించడం ఏ పార్టీకి మంచిది కాదు.

ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. రెడ్‌జోన్‌లో ఉన్న ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. నియోజకవర్గాలకు నిధుల విడుదలలో ఆలస్యం  లేకుండా చూడాలి. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయానికి స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో పార్టీ టికెట్ల కేటాయింపులో ప్రజాభిప్రాయానికి, పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే ఎమ్మెల్యేల పనితీరు గ్రాఫ్‌ కిందకు జారిన ప్రతిసారీ దాని రాజకీయ మూల్యం ఎంపీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. గెలిపించిన ప్రజల ముందు నిలబడలేని ఎమ్మెల్యేల కారణంగా, పార్లమెంటులో చురుగ్గా వ్యవహరించిన ఎంపీలు కూడా ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరు అయినా వాటి రాజకీయ ప్రభావాలు మాత్రం విడదీయలేనివి. ఎమ్మెల్యేల పనితీరే ఎంపీల రాజకీయ భవిష్యత్తుకు గండికొట్టే పరిస్థితి వస్తే, ఆ ప్రమాదాన్ని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకత్వంపైనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *