“దేశ అభివృద్ధిని కొలవడానికి కేవలం పేదరిక శాతాలను చూపించడం పాలకులకు సులభమైన మార్గం. కానీ ఒక పేద కుటుంబం నెలాఖరుకు ఎంత మిగుల్చుకుంటోంది? ఎంత అప్పు చేస్తోంది? పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెడుతోంది? అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునే స్థోమత ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఉచిత బియ్యం అందిస్తే ఆకలి సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లేనా? సంక్షేమ పథకం కింద కొంత నగదు జమ చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లేనా? ప్రజలను నిరంతరం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో ఉంచడం అభివృద్ధి కాదు. వారి కాళ్లపై వారు నిలబడేలా ఉపాధి, ఆదాయం, ఆర్థిక అవకాశాలు కల్పించడమే నిజమైన పాలన..”
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ 9848559863
పేదరికం తగ్గిందని గణాంకాలు గర్జిస్తున్నాయి.. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు డప్పులు కొడుతున్నారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని నివేదికలు ప్రకటిస్తున్నాయి. కానీ నేలమీద సామాన్యుడి బతుకు చూస్తే ఆ గణాంకాల గొప్పదనం ఎక్కడా కనిపించడం లేదు. నిత్యావసరాల ధరలు నిప్పులా మండుతున్నాయి. చదువుల ఖర్చులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఉద్యోగం దొరికినా కుటుంబాన్ని పోషించలేని వేతనాలు. ఇదేనా పేదరికం నుంచి బయటపడిన భారత్? కాగితాలపై పేదరికం తగ్గినంత మాత్రాన కడుపులో ఆకలి తగ్గుతుందా? నివేదికల్లో ఆదాయం పెరిగినట్లు చూపినంత మాత్రాన ఇంట్లో అప్పులు తీరిపోతాయా? పాలకులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.
ప్రపంచ బ్యాంకు 2026 అక్టోబరు నివేదిక ప్రకారం రోజుకు మూడు డాలర్ల ఆదాయ ప్రమాణంతో లెక్కించిన అత్యంత పేదరికం 2011లో 27.1 శాతంగా ఉండగా, 2023 నాటికి 2.6 శాతానికి తగ్గింది. మరో ప్రమాణం ప్రకారం పేదరికం 57.7 శాతం నుంచి 16.1 శాతానికి పడిపోయింది. సుమారు 49.6 కోట్ల మంది పేదరిక స్థాయిని దాటినట్లు అంచనా. ఇవి దేశానికి సానుకూల పరిణామాలే. కానీ రోజుకు 8.30 డాలర్ల ఆదాయ ప్రమాణాన్ని తీసుకుంటే భారత్లో దాదాపు 80 శాతం మంది ఇప్పటికీ ఆ స్థాయికి దిగువనే ఉన్నారు. అంటే పేదరికం తగ్గిందన్న ప్రకటన వెనుక ఆర్థిక అస్థిరత అనే చేదు వాస్తవం దాగి ఉంది. పేదరిక రేఖను కొద్దిగా దాటిన వ్యక్తి సంపన్నుడైపోడు. అప్పుల ఊబి నుంచి బయటపడని కుటుంబం ఆర్థికంగా భద్రత సాధించినట్లు కాదు.
గణాంకాల వెలుగులో పేదల చీకటి బతుకులు!
దేశ అభివృద్ధిని కొలవడానికి కేవలం పేదరిక శాతాలను చూపించడం పాలకులకు సులభమైన మార్గం. కానీ ఒక పేద కుటుంబం నెలాఖరుకు ఎంత మిగుల్చుకుంటోంది? ఎంత అప్పు చేస్తోంది? పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెడుతోంది? అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునే స్థోమత ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఉచిత బియ్యం అందిస్తే ఆకలి సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లేనా? సంక్షేమ పథకం కింద కొంత నగదు జమ చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లేనా? ప్రజలను నిరంతరం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో ఉంచడం అభివృద్ధి కాదు. వారి కాళ్లపై వారు నిలబడేలా ఉపాధి, ఆదాయం, ఆర్థిక అవకాశాలు కల్పించడమే నిజమైన పాలన.
ఉపాధి లెక్కలు గొప్ప.. వేతనాల పరిస్థితి దారుణం!
2017 నుంచి 2023 మధ్య దేశంలో ఉపాధి పొందిన వారి సంఖ్య సుమారు 13.4 కోట్ల మేర పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉపాధి పెరిగిందని చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ ఆ ఉపాధి ద్వారా కుటుంబం గౌరవంగా బతుకుతోందా? అన్నదే అసలు ప్రశ్న. రోజంతా కష్టపడినా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలని కార్మికులు లక్షల్లో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు, తాత్కాలిక పనులు, తక్కువ వేతనాలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. చదువులు పూర్తిచేసిన యువత ఉద్యోగాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, ఉపాధి పెరిగిందన్న ప్రకటనలు వారి నిరాశను తొలగించలేవు. పని కల్పించామని చెప్పడం కాదు.. ఆ పనికి గౌరవప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి.
సంపద కొందరిది.. కష్టాలు కోట్లాదిమందివి!
దేశంలో సంపద సృష్టి జరుగుతోంది. పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. కానీ ఆ సంపద ఫలాలు ఎవరికి అందుతున్నాయి? సంపన్నుల సంపద కొండలా పెరుగుతుంటే మధ్యతరగతి కుటుంబాలు అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. పేద కుటుంబాలు కనీస అవసరాల కోసం పోరాడుతున్నాయి. ఆదాయ అసమానతలు పెరుగుతున్న పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. అభివృద్ధి అంటే కొద్దిమంది చేతుల్లో సంపద పేరుకుపోవడం కాదు. కష్టపడే ప్రతి చేతికి తగిన ప్రతిఫలం దక్కడం. పేదవాడి పిల్లలకు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండటం. సామాన్యుడి ఇంట్లో ఆర్థిక భద్రత ఉండటం.
గ్రామీణ భారతాన్ని విస్మరిస్తే అభివృద్ధి బూటకమే!
పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రైతుకు పంట పెట్టుబడి భారంగా మారుతోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. వ్యవసాయ కూలీలకు ఏడాది పొడవునా పని ఉండటం లేదు. గ్రామీణ యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. మహిళలు కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నా వారి శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదరికం తగ్గిందని ప్రకటించడం సమస్యను పరిష్కరించినట్లు కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దేశం సమగ్ర అభివృద్ధి సాధించలేదు.
పేదరికం నుంచి బయటపడినవారిని మళ్లీ ఆ ఊబిలోకి నెట్టొద్దు!
ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడటం ఎంత కష్టమో, తిరిగి పేదరికంలోకి జారిపోవడం అంతకంటే సులభం. కుటుంబంలో ఒక్కరికి అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం పోయినా, ప్రకృతి వైపరీత్యం సంభవించినా ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అప్పులు పెరిగి కుటుంబం మళ్లీ పేదరికంలోకి చేరుతుంది. అందుకే ప్రభుత్వాలు కేవలం పేదరిక నిర్మూలన గణాంకాలకే పరిమితం కాకుండా ప్రజలకు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించాలి. నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం, స్థిరమైన ఉపాధి, సామాజిక భద్రత, పొదుపు అవకాశాలు కల్పించాలి. పేదరికం నుంచి బయటపడిన కుటుంబాలు తిరిగి వెనక్కి వెళ్లకుండా రక్షణ వ్యవస్థను నిర్మించాలి.
దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పుకోవడానికి గణాంకాలు ఉపయోగపడవచ్చు. కానీ ప్రజల ఆకలి, నిరుద్యోగం, అప్పులు, అసమానతలను కప్పిపుచ్చడానికి అవే తెరలుగా మారకూడదు. పేదరికం తగ్గిందని ప్రకటించే ముందు పేదవాడి ఇంట్లోకి వెళ్లి అతని కష్టాలను చూడాలి. పాలకుల ప్రసంగాల్లో అభివృద్ధి కనిపించడం కాదు.. ప్రజల జీవితాల్లో అది ప్రతిబింబించాలి. పేదవాడికి ఉచిత పథకం అందించడం కంటే తన కష్టంతో సంపాదించి గౌరవంగా బతికే అవకాశం కల్పించడం గొప్ప పాలన. పేదరికాన్ని గణాంకాల్లో ఓడించి, ప్రజల జీవితాల్లో ఓడిపోతే ఆ విజయానికి అర్థం లేదు. పేదరికం తగ్గిందని డప్పులు కొట్టడం మానండి.. పేదవాడి బతుకులో భరోసా నింపండి! ఆకలి లేని ఇల్లు, అప్పులేని కుటుంబం, నిరుద్యోగం లేని యువత, భద్రతతో కూడిన భవిష్యత్తు నిర్మించినప్పుడే భారత్ నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది.