చ‌నిపోయిన వారి వోట్లు తొల‌గిస్తే త‌ప్పేమిటి?

– రాహుల్ విమ‌ర్శ‌ల‌పై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ధ్వ‌జం
– అధికారం కోసం కార్య‌క‌ర్త‌ల క‌ష్టం మాట‌ల్లో చెప్ప‌లేను
– బీజేపీ ఎక్క‌డ అని ప్ర‌శ్నిస్తున్న వారికి ఇక్క‌డి జ‌న స్పంద‌నే స‌మాధానం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర‌హ్ 23 : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన మహా పాదయాత్ర భారీ జనసందోహం మధ్య ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ గడ్డపై కనిపిస్తున్న కాషాయ దళ ప్రభంజనం తన మనసును పులకరింపజేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఇక్కడి జనస్పందనే సమాధానమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారం కోసం ఏళ్లతరబడి బీజేపీ కార్యకర్తలు పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేనిదని బండి అన్నారు. కాషాయ జెండా మోసి భుజాలు కాయలు కాసినా, లాఠీ దెబ్బలు తిన్నా కార్యకర్తలు వెనుకంజ వేయలేదని గుర్తు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుత సుమారు మూడు కోట్ల మంది మరణించిన వారి ఓట్లు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ వంటి నేతలు మరణించి ఏళ్లు గడిచినా కొనసాగుతున్న ఓట్లు, కోటి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. 2014కు ముందు అక్రమంగా వలస వచ్చిన సుమారు నాలుగు కోట్ల మంది ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఆరు కోట్ల మంది ఓట్లను తొలగిస్తే అభ్యంతరం ఎందుకని నిలదీశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండాలని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోందా అని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని, విదేశీ శక్తులతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వెనుకడుగు వేయదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అక్రమ వలసదారులు రేషన్ కార్డులు, ఓట్లు పొంది స్థానికుల ఉపాధి దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. యువత డ్రగ్స్ బారిన పడుతుండటంపై మోదీ ఆవేదన చెందారని, ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఇప్పటివరకు అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన ప్రజలు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని సంజ‌య్ పిలుపునిచ్చారు.

నితిన్ నబీన్ ప్రస్థానంపై ప్రశంసలు

కరీంనగర్ గడ్డపై నితిన్ నబీన్ అడుగుపెట్టడం సంతోషకరమని పేర్కొంటూ ఆయనను ‘కొదమ సింహం’గా బండి సంజయ్ అభివర్ణించారు. నితిన్ అంటే నిజాయ‌తీ, నైతికత అని, నబీన్ అంటే నూతనత్వమని కొనియాడారు. పాతికేళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదుసార్లు విజయం సాధించడమే కాక 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎదగడం సాధారణ విషయం కాదని అన్నారు. ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో ఉండాలనుకున్న ఒక సామాన్య కార్యకర్త ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, దేశం-ధర్మం పట్ల అంకితభావంతో ఈ స్థాయికి చేరుకున్నారని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *