పుష్క‌రాల శాశ్వ‌త ప‌నుల‌కు రూ.1,115 కోట్లు

– పుష్క‌రాలు లోగో డిజైన్‌, ట్యాగ్ లైన్ పోటీలు
– జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల వ‌ర్క్‌షాప్‌లో మంత్రి ఉత్త‌మ్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 23 : ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా గోదావరి పుష్కరాలు-2027 నిర్వహ‌ణ‌కు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 74 ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ‌చ్చే జూన్‌ 26 నుండి జూలై 7 వ తేదీ వరకు జరిగే గోదావరి పుష్కరాలు లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పోటీలపై జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధులకు సోమ‌వారం నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని శాశ్వత పనుల నిమిత్తం రూ 1,115 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం అభివృద్ధికి రూ 324 కోట్లు, కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి రూ 198 కోట్లు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి రూ 276 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కాపాడటంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యాసంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. గోదావరి పుష్కరాలు లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పోటీలో ముందుగా వచ్చిన వంద ఎంట్రీదారులకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పుష్కరాల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా పోటీలకు పంపే ఎంట్రీలు ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు లోగో, ట్యాగ్ లైన్ డిజైన్ లను కలిపి ఈ నెల 30 లోపు ఎంట్రీలు పంపాలని ఔత్సాహికులకు సూచించారు. ఉత్తమమైన లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పంపిన ముగ్గురు ఔత్సాహికులకు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ 50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు నగదు అందజేయనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు లోగో, ట్యాగ్ లైన్ లను కలిపి godavaripushkaralutg@gmail.com అనే mail కు ఈనెల 30న సాయంత్రం 5 గంటల లోపు పంపాలి. పోస్టల్ లేదా నేరుగా కూడా హైదరాబాద్ బొగ్గులకుంట లో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అందజేయవచ్చు. రాష్ట్రo లోని ఔత్సాహికు లందరూ ఈ పోటీలకు ఎంట్రీలు పంపవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికను తెలియజెప్పే విధంగా కళాత్మకత, జిజ్ఞాస, సృజనాత్మకతతో గోదావరి పుష్కరాలు లోగో డిజైన్ తోపాటు గరిష్టంగా ఐదు పదాలలో ట్యాగ్ లైన్ ఉండాలని మంత్రి పొన్నం వివరించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం హన్మంతరావు, ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.ఎల్.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *