– అందుబాటులోకి హైడ్రా వెబ్‌సైట్
హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : నగరంలో విపత్తు నిర్వహణ, చెరువుల పరిరక్షణ, ఆస్తుల రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు హైడ్రా కీలక అడుగు వేసింది. హైడ్రా అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొత్త పోర్టల్‌ను ప్రారంభించారు. హైడ్రా అందిస్తున్న సేవలు, కార్యకలాపాలు, అత్యవసర సహాయం, వాతావరణ పరిస్థితులు, చెరువులు, భూములు, అధికార పరిధి తదితర వివరాలను ఇక ప్రజలు ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం కల్పించారు. పోర్టల్‌లో చెరువుల హద్దులు, కాలువల వివరాలు, ప్రభుత్వ భూములు, విపత్తు నిర్వహణకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలు, అధికారిక ప్రకటనలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, చెరువుల పునరుద్ధరణ వివరాలను కూడా ప్రజలు తెలుసుకోవచ్చు. హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్ 1070ను పోర్టల్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. చెట్లు కూలడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు లేదా ఇతర విపత్తు పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఈ నంబర్‌కు సమాచారం అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీల కోసం కూడా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. భవన యజమానులు, నిర్మాణదారులు దరఖాస్తు సమర్పించడంతోపాటు అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ప్రత్యేక డ్యాష్‌బోర్డు ద్వారా దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే వీలుంది. భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించేందుకు పోర్టల్‌లో ప్రత్యేక మ్యాప్‌లను అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని వాటర్‌లాగింగ్, వరద ప్రభావిత ప్రాంతాలను వేర్వేరుగా పరిశీలించవచ్చు. దీంతో వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలపై ప్రజలకు అవగాహన పెరగనుంది. పోర్టల్‌లో లైవ్ రైన్‌ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో తాజా పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడనుంది. హైడ్రా వెబ్‌సైట్ నుంచి హెచ్‌ఎండీఏ లేక్స్ పోర్టల్‌కు నేరుగా వెళ్లే అవకాశం కల్పించారు. చెరువులు, జలాశయాలకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను పరిశీలించవచ్చు. చెరువుల పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ భూ భారతి పోర్టల్‌కు కూడా హైడ్రా వెబ్‌సైట్‌లో నేరుగా లింక్ ఇచ్చారు. భూమి కొనుగోలు లేదా ఇతర లావాదేవీలకు ముందు సర్వే నంబర్, పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. హైడ్రా పునరుద్ధరించిన చెరువులు, చేపట్టిన పరిరక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పనులకు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా పోర్టల్‌లో పొందుపరిచారు. వార్తలు, ఫ్లాష్ న్యూస్, ఫొటోలు, వీడియోల ద్వారా హైడ్రా కార్యకలాపాలను ప్రజలు తెలుసుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





