22ఏ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి

– ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు
– 30 శాతం కమీషన్ల కోసం చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి
– ధరణి రక్షణ కవచమైతే ‘భూభారతి భూ హారతి’
– అసైన్డ్ భూములపై ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాలి

– రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తాం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : లక్షల ఎకరాలను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని, 30 శాతం కమీషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు కాదు.. ప్రభుత్వమే.. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదు’ అని అన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే వాటిని బేషరతుగా తొలగించి బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ధరణి రక్షణ కవచం

ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదిలీ చేయడం సాధ్యం కాని విధంగా భద్రత ఉండేదన్నారు. ప్రస్తుతం యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ‘ఇది భూభారతి కాదు.. భూ హారతి’ అని వ్యాఖ్యానించారు. అన్ని అడ్డగోలు చర్యలను నిలిపివేసి ప్రజల యాజమాన్య హక్కులకు రక్షణ కల్పించేలా యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని కోరారు.

అసైన్డ్ భూములపై హామీ నిలబెట్టుకోవాలి

అసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి పథకం వెనుక అక్రమాలు ఉన్నాయన్న తమ ఆరోపణలు భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయన్నారు. ‘రెండేళ్లలో బీఆరఎస్ ప్రభుత్వం వస్తుంది.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’ అని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపారు

ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు తమకుందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు అనని మాటలను అంటగట్టి సభ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాల నుంచి తప్పించుకునేందుకే తమను సస్పెండ్ చేసిందన్నారు. సస్పెండ్ చేసినప్పటికీ తాము ప్రజల్లోనే ఉన్నాం.. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే ఉంటాం.. 22ఏ అంశమైనా, ప్రజల భూముల సమస్యలైనా ప్రజల మధ్యకు తీసుకెళ్తాం అని కేటీఆర్ అన్నారు.

22ఏపై న్యాయ విచారణకు స్వాగతం

22ఏ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగితే అందరికీ మంచిదేనని కేటీఆర్ అన్నారు. తప్పు చేసింది ప్రభుత్వం.. శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు అని వ్యాఖ్యానించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చడం ద్వారా ప్రజల యాజమాన్య హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరని హెచ్చరించారు.

పోలీసులపై నమ్మకం లేదు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు. వారిని నమ్ముకుంటే న్యాయం దొరకదనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం.. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. కామన్ సివిల్ కోడ్‌పై ఇప్పుడే నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదని, ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *