– సీఎం విజయ్‌తో వైకో భేటీ
– డీఎంకే పక్షాన్ని వీడతారన్న ప్రచారం
చెన్నై, జూన్ 18 : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి విజయ్ అడుగులు వేస్తున్నారు. ద్రవిడ పార్టీలు కలిసినా తన మనుగడకు ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. అందుకే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా రాజీనామా చేసి టీవీకేలో చేరుతున్నారు. వీరంతా మళ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో అన్నా డీఎంకే కూడా పూర్తిగా బలహానపడే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ నాయకుడు వైకో సీఎంతో భేటీ కావడం మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) టీవీకేతో జట్టుకట్టనుందా అనే చర్చ ఆ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. ఇటీవలే వైకో కుమారుడు, ఎండీఎంకే ఎంపీ దురై వైకో కూడా విజయ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఎండీఎంకే పోటీ చేసి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ సాధారణ మండలి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. పార్టీ భవిష్యత్తు దిశగా ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే టీవీకే నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో ఎండీఎంకే తటస్థంగా వ్యవహరించింది. డీఎంకేతో కలిసి పనిచేసిన మాజీ మిత్రపక్షాలు కొన్ని ఇప్పటికే టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్, వీసీకే, ఐయÖఎంఎల్‌లు అధికార వ్యవస్థలో భాగస్వాములయ్యాయి. మరోవైపు సీపీఐ, సీపీఎంలు ప్రభుత్వానికి బయటనుంచే మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఎంకే వైఖరి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఊహాగానాలపై వైకో అప్రమత్తంగా వ్యవహస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలను సాధారణ మండలి ఆధ్వర్యంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం విజయ్‌తో సమావేశం పూర్తిగా ప్రజా సమస్యలపైనే జరిగిందన్నారు. తూత్తుకుడిలో వేదాంత గ్రూప్‌నకు అనుబంధంగా మరో రాగి పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాంటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని కోరానని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





