రాధాకృష్ణుడు-రాజీవన్

తిరువనంతపురం రైల్వే స్టేషన్ మధ్యాహ్నం. నేను, రాధాకృష్ణ- ప్లాట్‌ఫారం మీదున్న సిమెంట్ బెంచీపై కూర్చుని ఉన్నాము. మధ్యాహ్నం కాబట్టి ప్లాటుఫారం మీద జనాలు చాలా తక్కువ కనిపిచ్చారు. మా రైలు గంట ఆలస్యం అవుతుందని ప్రకటన. వెంటనే కంగారుగా అనిపించింది. కానీ రాధాకృష్ణ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రయాణం ఉత్తరప్రదేశికి. మేము మధురై, ద్వారక మరియు అక్కడి ఉన్న అన్ని ఆలయాలను సందర్శించాలి అని అనుకున్నాము.

పాఠశాల రోజులనుండి మొదలైన మా స్నేహం కళాశాల సమయంలో మరింత బలపడింది. ఆ తర్వాత, నేను మా కుటుంబంతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆ స్నేహం ఏ విధంగానూ దెబ్బతినలేదు. దానికి ప్రధాన కారణం మేము కలిసి చేసే ప్రయాణాలే. కుటుంబం విషయానికి వస్తే, నాకు భార్య, పిల్లలు, మనవళ్లు ఉన్నారు. మా అమ్మాయికి గత సంవత్సరం వివాహం జరిగింది. కానీ రాధాకృష్ణకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ అతనికి పెళ్లి జరిగి ఉంటే, అతనికి కూడా పిల్లలు, మనవళ్లు కూడా ఉండేవారేమో! అప్పుడప్పుడు అతన్ని పెళ్లి గురించి అడుగుతూ ఉండేవాన్ని. అప్పుడల్లా అతని ఏకైక సమాధానం పెద్ద చిరునవ్వు మాత్రమే.

రైలు ఆలస్యం కావడం వల్ల కంగారుగా అనిపించినప్పుడు, ఎప్పటిలాగే ఆ ప్రశ్నను మళ్ళీ అడిగాను.

“రాధాకృష్ణ, నీవు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?”

అప్పుడు అతను రైలు పట్టాల చివర వైపు చూస్తూ ఉన్నాడు. దూరం వైపు చూస్తున్న అతని మనసు కూడా దూరంలోనే ఉందని గ్రహించాను. ఇలా లక్ష్యం లేకుండా ఆలోచించడం అతనికి అలవాటే. మేము కలిసి చేసిన అన్ని ప్రయాణాలలో అతన్ని చాలావరకూ అర్థం చేసుకున్నాను. ఆ మధ్యాహ్నం, ఎండ అంత తీవ్రంగా లేదు. అతను నెమ్మదిగా నావైపు తలతిప్పాడు. అప్పుడు ఆశ్చర్యంగా, అతను మొదటిసారిగా నా ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

“మిత్రమా, నేను రాధాకృష్ణుడినా?”

“అవును. దానిలో సందేహం లేదు.”

“అవును, నేను రాధాకృష్ణుడిని. అంటే, రాధ, కృష్ణుడు ఇద్దరు కలిసి ఉండేవాడు!”

నాకు నవ్వొచ్చింది కానీ… అకస్మాత్తుగా, నా ముందున్న నా స్నేహితుడు నేను ఇంతకు ముందెన్నడూ కలవనివ్యక్తిలా అనిపించాడు.

అవును, నేను ఎప్పుడూ కలవని వ్యక్తిలా!

అప్పుడు మేము కూర్చున్న ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా రైలు వస్తోందని ప్రకటన విన్నాను. అతను నన్ను వదిలి, అక్కడి నుండి లేచి ముందుకు నడిచాడు. అప్పుడు పక్కపట్టాలపై మరోరైలు వెళ్ళింది, అది నా గుండెని దడదడలాడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *