యూరియా పక్కదారి.. ఫెర్టిలైజర్ షాపుపై కేసు

– చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి
– రూ.17,10,144 సబ్సిడీ యూరియా దారి మళ్లించిన డీలర్

చేర్యాల, ప్రజాతంత్ర, జూన్ 26 : చేర్యాల పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో యూరియా బస్తాలు పక్క దారి పట్టడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి సూర్య సూచనల మేరకు చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర స్వామి ఈనెల 9న శ్రీ సాయిశివ ఫెర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. గోదాంలో ఎలాంటి యూరియా నిల్వలు లభించకపోగా స్టాక్ సమాచారం రిజిస్టర్‌లో పొందపరచకుండా డీలర్ సందీప్ రెడ్డి 6,429 యూరియా బ్యాగులకు సంబంధించిన టాక్సి ఇన్వాయిస్‌లు ఈ-పాస్ నుండి అంగీకారం ధ్రువీకరించలేదని తేలిందని ఏడిఏ టి.రాధిక తెలిపారు. ఈ-పాస్‌లో యూరియా ఇన్వాయిస్ ధ్రువీకరించకపోతే రైతులకు యూరియా యాప్‌లో ఫెర్టిలైజర్ బుకింగ్ చూపించదు. కానీ డీలర్ సందీప్ రెడ్డి రైతులకు 6429 బ్యాగులు అమ్మినట్లు తప్పుడు బిల్లులు తయారు చేసినట్లు నిర్ధారించిన‌ట్లు చెప్పారు. ఈ-పాస్‌లో మాత్రమే లావాదేవీలు నమోదు చేసి భౌతిక బిల్లులు స్టాక్ రిజిస్టర్ ఇన్వాయిస్‌లో కాగితాలపై మాత్రమే తయారు చేశారన్నారు. ప్రభుత్వం రైతులకు 45 కిలోల యూరియా సంచిపై రూ.2200 నుండి రూ.2500 వరకు సబ్సిడీ అందిస్తుందని ఆమె చెప్పారు. రైతుల కోసం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర రూ.226 మాత్రమే ఉంటుందని, ఈ అక్రమాల వల్ల నిజమైన రైతులకు సబ్సిడీ యూరియా అందకపోవడమే కాక ఎరువుల పంపిణీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏడిఏ అన్నారు. దీనివల్ల రైతుల్లో ఆందోళన నెలకొనడంతోపాటు వ్యవసాయ శాఖ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్నారు. అసలైన రైతులకు యూరియా అందకుండా రైతులకు అమ్మినట్లు నకిలీ కాగితాలు సృష్టించి సుమారు రూ.17,10,144 విలువైన సబ్సిడీ యూరియా దారి మళ్లించిన ఆంజనేయ ఫెర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్‌తోపాటు శ్రీ గణేష్ ట్రేడర్స్, శ్రీ సాయిశివ ఫెర్టిలైజర్ షాపులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఏ రాధిక ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అపూర్వరెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *