“ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన బడి పంతులా? ఐతే, కాల మహిమ విచిత్రమైంది. ఆ బాలుడి భవిష్యత్ జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని క్రొంగొత్త భవిష్యత్తు రూపు దిద్దుకుంది. బహుషా ఎవరూ – అప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా – అంచనా వేయని రీతిలో ఆ బాలుడు ఎంతో ఎదుగెక్కి ఊహించని ఉన్నత శిఖరాలు చేరుకున్నాడు..”
పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి జయంతి సందర్భంగా వారి బాల్య విశేషాల గురించి మరొక్కసారి:
-సేకరణ, సమర్పణ: పాములపర్తి నిరంజన్ రావు, పిన్నా శివకుమార్
1921 లో వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో పుట్టి, ప్రక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలోని మరో చిన్న గ్రామంలో పదేండ్ల వరకు పెరిగి తన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆ బాలుడు 1931 లో మాధ్యమిక విద్యకై మళ్ళీ పేటకు వచ్చాడు. ఆ రోజుల్లో వరంగల్ చుట్టు ప్రక్కల గ్రామస్తులు వరంగల్ పట్టణాన్ని ‘పేట’ అనేవారు. ఆ బాలుడు ఈ పదేండ్ల వ్యవధిలో గ్రామ వాతావరణానికి, అక్కడి అమాయకత్వానికి అలవాటు పడ్డాడు. ఇక పోతే వారుండేది అలనాటి రాచరికపు నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన క్రింది హైదరాబాద్ రాష్ట్రంలో! పరిపాలనా, విద్యా బోధనా అంతా ఉర్దూ మీడియమే. ఆ బాలుడు చదవవలసిన ఆ పాఠశాలలో ఇంటర్మీడియేట్ వరకు చదవవచ్చు. ఆ బాలుడు ప్రాథమిక విద్యలో మెరుగైన విద్యార్థి అనిపించుకున్నాడు, కాబట్టి బహుషా ఆ బాలుడి తలిదండ్రులు ఇతను బాగా చదువుకొని ఒక లాయర్ గానో లేక తహసిల్దార్ గానో కావాలని కోరుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి పల్లె ప్రజలు భయమూ, గౌరవమూ సమపాళ్ళల్లో కలిపి చూసే ఉద్యోగాలివి! అంతే కాకుండా ఆనాటి సమాజంలో, ముఖ్యంగా వారున్న గ్రామ సామాజిక వాతావరణంలో గౌరవ ప్రదమైన వృత్తులివి.
మరి ఆ బాలుడి మనస్సులో ఏముందో?
ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన బడి పంతులా? ఐతే, కాల మహిమ విచిత్రమైంది. ఆ బాలుడి భవిష్యత్ జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని క్రొంగొత్త భవిష్యత్తు రూపు దిద్దుకుంది. బహుషా ఎవరూ – అప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా – అంచనా వేయని రీతిలో ఆ బాలుడు ఎంతో ఎదుగెక్కి ఊహించని ఉన్నత శిఖరాలు చేరుకున్నాడు.
ఒక్కసారి 1930 నాటి దేశ పరిస్థితులు గమనిద్దాం. అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలు. అప్పటికే విదేశీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమం దేశమంతా సాగుతున్నా, నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో ఆ ఉద్యమ ఛాయలు మృగ్యం. ఒక వేళ ఉన్నా అవి ఆర్య సమాజ్ నినాదంతో మొగ్గ తొడుగుతూ ఇంకా బలహీనంగా ఉన్నట్టే లెక్క. అప్పుడు ఎవరు అనుకున్నారు రాబోయే పది ఇరవై సంవత్సరాలలో బ్రిటిష్ పాలన నుండి విముక్తమై స్వతంత్ర భారత దేశావతరణ జరుగుతుందని…! అనుకున్నారు పో, ఆ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమై అంతర్భాగమవుతుందని…! అనుకున్నారు పో, విలీనమైన తదుపరి కొద్ది కాలానికే ఏక భాష రాష్ట్రంగా కొత్త రూపు దిద్దుకుంటుందని…! అనుకున్నారు పో, ఈ పదేండ్ల బాలుడు ఆ రాష్ట్ర ఏలికగా ఎదుగుతాడని…! అనుకున్నారు పో, అంతటితో ఆగక ఈ బాలుడు మరింత ఎదిగి భారత దేశాధినేతగా ఉన్నత శిఖరాలందుకుంటాడని!
మొత్తానికి జరిగింది ఈ క్రమానుసరణ సంఘటనలు ఆ బాలుని విషయం లో… ఇన్నిసార్లు ఖచ్చితంగా అనుకోవడం మామూలు మానవులకే కాదు, మహిమాన్విత మహనీయులకు గూడా సాధ్యం కాని పని.
అందుకే దీనిని ‘కాల మహిమ’ అన్నాను. ఇప్పటికే మీకు తెలిసిపోయుంటుంది ఆరవ తరగతి లో చేరడానికై వరంగల్ పట్టణంలోని హనుమకొండ ప్రాంతంలో గల ‘కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు చేరుకున్న ఆ పది పదకొండేండ్ల నాటి బాలుడే, ఆరోగ్యం సహకరించని 70 ఏండ్ల వయస్సులో అనుకోని ఆకస్మిక పరిణామాలతో ప్రధాని పదవి అధిష్టించి దేశ భవిష్యత్తుకై క్రొంగొత్త రూప కల్పనలను గావించి అవిశ్రాంతంగా శ్రమపడ్డ మొన్నటి మన తెలుగు బిడ్డ – మన తెలంగాణా స్ఫూర్తి – శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారని. ఇంకా ఆప్యాయంగా చెప్పుకోవాలంటే మన పీవీ గారని! ఇంకా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆ అమాయకపు బాల్య దశలో ఆ పాఠశాల భవన ప్రాంగణంలో అడుగిడిన ఆ విద్యార్థిని ఉత్తేజపరచి ఒక ఉత్తమ ఆలోచనా పరుడిగా చేసి అతని భవిషత్తు తీరు తెన్నులకు దిశా నిర్దేశం జరిగింది అప్పటినుండే… ఆ క్షణం నుండే.
ఒక్కసారి ఆ గతంలోకి పోదామా?
గతంలోకి పోయే ముందు కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా పీవీ గారు అలనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయింపబడ్డ సమయం చూద్దాం. 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులవి. సామరస్య పరిస్కారానికి కృషి సల్పకుండా , ఉద్యమాన్ని తుడిచిపెడదామని అన్ని తీరులా (కర్ఫ్యూలు, కాల్పులు, అరెస్టులు మొదలగు అన్ని రకముల అణచివేత కార్య క్రమాలను సాగించి) విఫలము చెందిన అలనాటి రాష్ట్ర , కేంద ప్రభుత్వాలు తుది ప్రయత్నంగా అప్పటి ముఖ్య మంత్రి స్థానంలో తెలంగాణాకు చెందిన వ్యక్తిని నియమించాలని భావించి ‘ఆమోద వ్యక్తి ఎవరా?’ అని శోధించే క్రమంలో ఉద్యమ నాయకుడైన చెన్నా రెడ్డి గారూ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బ్రహ్మానంద రెడ్డి గారితో సహా అటు కాంగ్రెస్ ఆంధ్రా శాసన సభ్యులకు, ఇటు తెలంగాణా శాసన సభ్యులకు ఆమోదయోగ్యుడిగా కనుగొన్నబడ్డ వాడు మన పీవీ గారు.
ఇకపోతే 1991వ సంవత్సరానికి చేరుదాం. వివిధ కారణాల వల్ల రాజకీయాల నుండి సంపూర్ణ విరమణ తీసుకుందామని పీవీ గారు భావించారు. దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రచార సమయంలో ఆకస్మిక దాడికి గురై దుర్మరణం చెందటంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా నాయకుడిని కోల్పోయింది. ఆ సందర్భంలో తగు నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ లిస్టులో పీవీ గారి పేరే మొదటిగా ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, తదుపరి అదే క్రమంలో ప్రధాన మంత్రిగా నియమింపబడ్డారు మన పీవీ. రాజకీయాల నుండి రిటైరై దిల్లీని వదిలివేయాలనుకున్న పీవీ గారిని ‘ఎక్కడికీ పోవద్దు – ఇక్కడే ఉండ’ మని యేకంగా దిల్లీ గద్దెనే ఆహ్వానించింది.
ఈ రెండు సందర్భాలు – మామూలు సందర్భాలు కావు, విపరీత పరిస్థితులు – పీవీ గారి వైపే దిశా మార్గం చూపించాయి. ఎందుకని? ముందుగా 1971 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రత పెరిగి ఇంకేం అవుతుందో అన్న అగమ్య గోచరం. చాలా మంది తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు వారి వారి గ్రామాలకు పోతే అక్కడ ఇల్లు వదిలి బయటకు వచ్చే స్థితి లేదు. అందరూ హైదరాబాదుకే, ఎం ఎల్ ఏ క్వార్టర్స్ కే పరిమితమయ్యారు. కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇది ప్రజా మనోభావాల నెరిగి తదనుగుణంగా తయారు చేసిన కుంపటి కాబట్టి ప్రజల నాకర్షించడంలో అది ముందుంది. ఇక అటు ఆంధ్రాకు చెందిన మంత్రులైనా, శాసన సభ్యులైనా ఈ ఉద్యమానికి త్వరలో చరమగీతం పాడాలని తహతహలాడు తున్నారు, ఈ పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రిని మార్చి తెలంగాణా వారికి ఆ పదవి ఇచ్చేట్లుగా నిర్ణయించడమైంది.
ఇక పీవీ గారు – 1962 లో మొదటి సారిగా శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో న్యాయ సమాచార మంత్రిగా చేరారు. తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగార్ల ముఖ్యమంత్రుల సారధ్యంలో కూడా పనిచేసి 9 సంవత్సరాలు వివిధ ముఖ్య శాఖల్లో మంత్రివర్యులుగా, ప్రభుత్వంలో ఒక ముఖ్య నాలికగా మెలిగారు. అప్పటి శాసన సభలల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు, ఆయన చేసిన ప్రసంగాలు ఆయన సునిశిత మేధా సంపత్తికి అద్దం పడతాయి. అప్పటి ప్రతి ముఖ్య మంత్రికి ఆయన దగ్గరి వాడే! ప్రతి మంత్రికి ఆయన అవసర సమయాల్లో సలహాదారే!! ఇక అప్పటి మేటి ప్రతిపక్ష ప్రశ్నా నాయకులైన శ్రీ తెన్నేటి విశ్వనాధం, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మొదలగు వారి ఉద్ధండ విమర్శనా వాగ్ఢాటి ప్రసంగాలకు ఆయన ప్రభుత్వం తరఫున ఇచ్చిన సమాధానాలు ఆ విమర్శించిన వారే చివరకు ఔనన్నట్లుగా తలలూప జేసిన సమ్మోహన అస్త్రాలే!!! ఇందుకు ఉదాహరణగా 1965-66 లో అధికార భాషగా తెలుగును ఏర్పరచడానికి సంబంధించిన శాసన సభా ప్రసంగాలు ‘భువన విజయ’ అష్ట దిగ్గజాల కావ్య పఠన మాధుర్యాలను గుర్తుకు తెచ్చేవని అనుకునేవారు, ఇక ఆ శాసనసభా నిలయ ప్రసంగకర్తల సాహిత్య సముదాయంలో పీవీగారు అల్లసాని పెద్దనగారే! ఆయన సునిశిత మేధస్సు, స్పష్టమైన భావ వ్యక్తీకరణం, విలక్షణ ఆలోచనా ధోరణి మొదలగు సుగుణాలు ఆయనను అందరికీ దగ్గర చేసాయి. ఈ విధంగా అందరి మనస్సును చూరగొన్న పీవీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరి ఆమోదం పొందారంటే ఆశ్చర్యమేముంది? ఆవిధంగా పీవీ గారు ముఖ్యమంత్రయ్యారు. తర్వాత క్రమంలో ముఖ్యమంత్రిగా పీవీకి అలనాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో పరిచయాలు ఏర్పడ్డాయి.
(మిగతా రేపటి సంచికలో ..)