అధ్యయనంతో పెంపొందనున్న అవగాహన

– స్పీకర్ ప్రసాద్ కుమార్

బెర్న్(స్విట్జర్లాండ్), అక్టోబర్ 8 : స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ సిటీలో ఉన్న చరిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని శాసనసభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం సందర్శించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు వంటి అంశాలపై అధ్యయనం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తద్వారా మరింత అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పర్యటనలో శాసనసభ సెక్ర‌టరీ రెండ్ల తిరుపతి, శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

విదేశాల్లోనూ వెలుగుతున్న తెలంగాణ సంస్కృతి 

విదేశాల్లో స్థిరపడినా మాతృభాషను, మన సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా కాపాడుతుండడం అందరూ హర్షించదగ్గ విషయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిన్న పిల్లలకు తెలుగు భాష నేర్పిస్తూ, బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలను నిర్వహిస్తూ భాషా సంస్కృతిని స్విట్జర్లాండ్‌లో ఇనుమడింపజేయడం భావితరాలకు ఆదర్శమన్నారు. తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ లోని బెర్న్ సిటీలో పర్యటించింది. స్పీకర్ మిత్రుడు బ్రహ్మానంద రెడ్డి బావిగడ్డ ఆహ్వానం మేరకు అక్కడి ప్రవాస తెలుగు భారతీయులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్ సైట్‌ను స్పీకర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. తర్వాత ప్రవాస తెలుగు సంఘం ప్రతినిధులతోనూ మాట్లాడారు. స్విట్జర్లాండ్‌లో నిర్మించబోయే వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి స్పీకర్ బృందానికి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు, సహాయ సహకారాల గురించి తప్పకుండా టీటీడీ ప్రతినిధులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. బతుకమ్మ ఉత్సవం అనేది పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళా శక్తికి, ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక అని ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఇలా ఏటా స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంఘం ప్రతినిధులను స్పీకర్ బృందం అభినందించింది. ఈ నెల 24న స్విట్జర్లాండ్‌లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్ వేదాంతం, కార్యదర్శి హరిప్రసాద్, ఈసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *