– పన్ను మోసాలపై కఠిన చర్యలు అవసరం
– తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం
– హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
– ఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క
న్యూదిల్లీ, అక్టోబర్ 8: జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతోపాటు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలుకు పునాది పరస్పర విశ్వాసమేనన్నారు. ఉమ్మడి జాతీయ మార్కెట్ ఏర్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న నమ్మకంతో రాష్ట్రాలు తమ స్వతంత్ర పన్ను విధించే అధికారంలో గణనీయమైన భాగాన్ని వదులుకున్నాయని గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు భాగస్వాములుగా పనిచేయడం, రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడటం, కీలక మార్పులను సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో చేపట్టడం ఈ వ్యవస్థకు మూల సూత్రాలని అన్నారు.
తెలంగాణపై ప్రభావం
తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35 శాతం ఉందని భట్టి తెలిపారు. ఈ ఆదాయంతోనే రాష్ట్రంలో పాఠశాలలు, హాస్పిటల్స్, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుతున్నాయని చెప్పారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల కేవలం లెక్కల అంశం కాదని, ప్రజలకు సేవలు అందించే రాష్ట్ర సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మోటార్ వాహనాలు, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌పుట్ సర్వీసుల రిఫండ్‌లకు సంబంధించిన మార్పులు చేపట్టే ముందు వాటి పూర్తి ఆర్థిక ప్రభావాన్ని రాష్ట్రాలకు వివరించాలని కోరారు. మోటార్ వాహనాల విషయంలో కేంద్రం అందించిన అంచనాల ప్రకారం తెలంగాణకు ఏడాదికి సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం ఉంటుందని, రాష్ట్ర సొంత అంచనాల ప్రకారం ఈ నష్టం అంతకంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. తగిన సందర్భాల్లో ఆటోమేటిక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ మార్పులు, రద్దు దరఖాస్తుల ఆటోమేటిక్ ప్రాసెసింగ్‌కు భట్టి మద్దతు తెలిపారు. రిస్క్ లేని కేసుల్లో ఆటోమేటిక్‌గా రిఫండ్‌లు మంజూరు ద్వారా నిజాయతీగల పన్నుదారులకు త్వరగా ప్రయోజనం అందుతుందన్నారు. అదే సమయంలో అధిక రిస్క్ ఉన్న కేసులపై పన్ను అధికారులు మరింత దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పెనాల్టీలను హేతుబద్ధీకరించడం, రహదారులపై సరకుల వాహనాలను యాదృచ్ఛికంగా నిలిపివేయడాన్ని తగ్గించడం వంటి చర్యలను స్వాగతించారు. జీఎస్టీ రిటర్నుల్లో అవసరమైన మార్పులు చేసి పన్ను వివరాల్లో తేడాలను తగ్గించాలని, జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం తగిన సర్క్యులర్లు, వివరణలు జారీ చేయాలని కోరారు.
నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
పన్నుదారులకు అనుకూలమైన విధానాల అమలుతోపాటు జీఎస్టీ మోసాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, గుర్తింపు వివరాల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. వృద్ధులు, గృహిణులు, రోజువారీ కూలీలు, ఇతర అమాయకుల ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసి మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టిస్తున్న ఘటనలను ప్రస్తావించారు. నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడం, అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడం లేదా ఇతరులకు బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, వ్యవస్థీకృత ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధానాల సరళీకరణ పేరుతో వ్యవస్థీకృత పన్ను ఎగవేతపై అమలు చర్యలు బలహీనపడకూడదని స్పష్టం చేశారు.
స్క్రాప్ రంగంపై ప్రత్యేక దృష్టి
దేశవ్యాప్తంగా స్క్రాప్ రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతను భట్టి ప్రస్తావించారు. అసంఘటిత, నగదు ఆధారిత వ్యవస్థ కారణంగా నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడం, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ చేయడం జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న చెత్త సేకరించే కార్మికులు, చిన్న స్థాయి సేకరణదారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, పేదల ప్రయోజనాలను కాపాడే కార్యాచరణను రూపొందించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చాలాకాలంగా అధికారుల కమిటీల్లో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించే కమిటీల్లో తెలంగాణకు సభ్యత్వం కల్పించాలని కోరారు. స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌లోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాలు
హైదరాబాద్ భౌగోళికంగా అనుకూలమైన నగరం మాత్రమే కాదని, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశంలోని ప్రముఖ కేంద్రాల్లో ఒకటని భట్టి పేర్కొన్నారు. భవిష్యత్ జీఎస్టీ పరిపాలనకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల జీఎస్టీ పరిపాలన రాష్ట్రాలకు మరింత చేరువ కావడంతోపాటు, సాంకేతికత ఆధారిత పన్ను మోసాల గుర్తింపు వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. సరకుల వాహనాల తనిఖీల విషయంలో ప్రస్తుతం ఉన్న అధికారాలను మూల రాష్ట్రం, గమ్య రాష్ట్రం రెండింటికీ కొనసాగించాలని సూచించారు. పన్ను ఎగవేతను అరికట్టడంతోపాటు వ్యాపార కార్యకలాపాలకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా సమతుల్య విధానం అవసరమని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ వంటి ఎగుమతి రాష్ట్రాల సహకారాన్ని గుర్తించాలని కోరారు. పోటీతో కూడిన ఎగుమతి వ్యవస్థ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుబడులు పెట్టే రాష్ట్రాలకు తగిన మద్దతు, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్సులలో రాష్ట్రాలకు నిర్దిష్టమైన, పారదర్శక వాటా కల్పించాలని కోరారు. జీఎస్టీ ఆదాయం కేంద్రానిదీ, రాష్ట్రాలదీ కాదని.. అది భారత ప్రజలకు చెందినదని భట్టి పేర్కొన్నారు. ప్రజలు కేంద్రం, రాష్ట్రాలపై ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా జీఎస్టీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





