– ఇథనాల్ ఇండస్ట్రీ నుండి నదీ జలాలు, ప్రజల ప్రాణాలు కాపాడాలి
– విద్యావంతుల వేదిక, మానవ హక్కుల వేదిక, ప్రజాసంఘాల ఐక్య వేదిక
నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 23 : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సోహం ఇండస్ట్రీ ఇథనాల్ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఆప్రజాస్వామికమైనదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బి.రామయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వెంకటరమణ అన్నారు. వీర్లపాలెం ప్రజలతో కలిసి ఆయా సంఘాల నాయకులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించి ఆ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధాల మధ్య, బెదిరింపుల మధ్య కొనసాగిందని, ఇది ప్రజా వ్యతిరేకమైనదని ఆరోపించారు. సుమారు 5000 జనాభా ఉంటే 20 మందికి లోపే అభిప్రాయాలు తీసుకోవడం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణకు నిదర్శనం అని ప్రశ్నించారు. కంపెనీకి సంబంధించిన కొంతమంది తాబేదారులను తీసుకొచ్చి వారి అభిప్రాయాలను ఇప్పించడం, అక్కడి ఎస్టీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం అసమాన వైఖరికి నిదర్శనమన్నారు. ఇథనాల్ కంపెనీలపై అధ్యయనం చేసిన నిపుణుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శమన్నారు. కొంతమంది వ్యక్తులు ఈ కంపెనీ పట్ల తమకు అపోహాలు ఉన్నాయని, దీని ద్వారా క్యాన్సర్ వస్తుందని, కృష్ణా నదీ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని, కృష్ణా నదికి ఈ కంపెనీ పెట్టబోయే ప్రాంతానికి 3 కి.మీ దూరమే ఉండడం తీవ్ర భయాన్ని కలిగిస్తున్నదని చెప్పారన్నారు. అయినప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గాని, ఆర్డివో గాని, కంపెనీ యజమాన్యం గాని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అర్ధతరంగా ప్రజాభిప్రాయ సేకరణ ముగించారని నాయకులు ఆరో్పించారు. కొంతమంది యువకులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పటికీ ఆ తీర్పును ధిక్కరించి వారందరినీ అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో నిర్భందించారన్నారు. ఇది అప్రజాస్వామిక చర్యగా తాము భావిస్తున్నామన్నారు. కాలుష్యం వెదజల్లని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లని ఎలాంటి పరిశ్రమలు పెట్టినా స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారన్నారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో ప్రజలు, రైతాంగం తీవ్రమైన కరువుతో అల్లాడుతుంటే మరోవైపు విషపూరితమైన కంపెనీలను తీసుకొచ్చి రోజుకు 60 లక్షల లీటర్ల నీటిని కృష్ణా నది నుండి తీసుకోవడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం విధ్వంసక అభివృద్ధికి నిదర్శనమన్నారు. గత అభిప్రాయ సేకరణను రద్దు చేసి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే విధంగా కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సుదర్శన్, ధర్మసమాజ్ పార్టీ నాయకులు ఎల్లయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి, ఆ ప్రాంత ప్రజలు నినాబాద్ సిపాయి, కుంజ రామయ్య, అల్లం నాగరాజు, వినోద్ నాయక్, ఆంగోతు బాలు,రూపావత్ సైదా, రూపవత్ లక్ష్మి, మూడావత్ కిరి, కృపావతు బాజు, ఏడుపాల సౌజన్య, ధనావత్ సైదితోపాటు వీర్లపాలెం ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





