ఇర్రం మంజిల్‌లో ‘ట్రెజర్ హంట్’

– ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా..

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చరిత్రాత్మకమైన ఇర్రం మంజిల్ ప్యాలెస్‌లో రోడ్లు, భవనాలు శాఖ, డెక్కన్ ఆర్కైవ్ సహకారంతో శుభ్రత కార్యక్రమం ట్రెజర్ హంట్‌ను శనివారం నిర్వహించింది. ఎంఏ అండ్ యూడీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ దీన్ని పరిశీలించి ఈ స్థల చరిత్రాత్మక ప్రాముఖ్యతను, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే హెరిటేజ్ పార్ట్నర్ స్కీమ్ కింద దీని సంరక్షణ, వినియోగ అవకాశాలను ప్రస్తావించారు. శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న 60మందికి పైగా వలంటీర్లను అభినందిస్తూ హెరిటేజ్ అంబాసిడర్లుగా భవిష్యత్తులో కూడా సంరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. ‘పరడైస్ మెన్షన’ అనే అర్థం కలిగిన ఇర్రం మంజిల్‌ను 19వ శతాబ్దం చివర్లో నిజాం ప్రభుత్వంలో సేవలందించిన సలార్ జంగ్ కుటుంబానికి చెందిన ప్రముఖ నవాబ్ ఫఖ్ర్ అల్ ముల్క్ నిర్మించారు. పంజాగుట్టలోని కొండపై ఉన్న ఈ ప్యాలెస్ ఒకప్పుడు అనేక ఎకరాలలో విస్తరించి, సుందరమైన తోటలు, మార్గాలతో వందల గదులను కలిగి ఉండేది. స్వాతంత్య్రం తర్వాత ఇది ప్రభుత్వ వినియోగానికి మారింది. స్టేట్ ఆర్కైవ్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, తరువాత ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలు ఇక్కడ పనిచేశాయి. ప్రస్తుతం పదేళ్లుగా ఈ చారిత్రక భవనం ఎక్కువ భాగం వినియోగంలో లేకుండా ఉంది. ఒక దశలో దీన్ని కూల్చివేయాలని కూడా ప్రతిపాదించారు. అయితే ఈ భవన అంతర్గత నిర్మాణ వైభవం, విస్తీర్ణం చూసి పాల్గొన్న వారు ఆశ్చర్యపోయారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్ పి.గౌతమి భవిష్యత్ తరాల కోసం వారసత్వాన్ని సంరక్షించడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. అదనంగా వారసత్వ అవగాహన, సంరక్షణను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా కార్యక్రమాలతో కూడిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *