– రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి
– రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్న నినాదం
– బీజేపీ ఎంపీ తేజస్వి తక్షణమే క్షమాపణ చెప్పాలి
– జగిత్యాలలో మీడియా సమావేశంలో హరీష్‌రావు
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే పార్లమెంటులో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. బడే భాయ్‌కు భయపడే ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించలేదన్నారు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు తీరని ద్రోహం చేశాయన్నారు. రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదు.. అది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్ బ్రీడ్ బంధం అని వ్యాఖ్యానించారు. బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావులు శనివారం జగిత్యాలలో పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆరఎస్‌లో చేరనున్న నేపథ్యంలో ఆ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఎంతో విలువలతో కూడిన నాయకుడు జీవన్ రెడ్డి ఈ నెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆరఎస్‌లో చేరుతున్నారని, ఆయన చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు.. యావత్ ఉత్తర తెలంగాణకు, బీఆరఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి చేరిక ఒక సజీవ సాక్ష్యం అన్నారు. నిన్న పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమని హరీష్‌రావు అన్నారు. తేజస్వి మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయంటూ కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కించపరుస్తారా అని నిలదీశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు పాసై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడిందనే కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. తమ ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణమన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందన్నారు.
మన ఎంపీలు సభలో ఉంటే..
లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని, మన ఎంపీలు సభలో ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా అని రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ లోక్‌సభ సభ్యులను నిలదీశారు. అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జల వనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారన్నారు. స్పీకర్‌ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరింపచేశారన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే రేవంత్ రెడ్డి మాత్రం దిల్లీలో బీజేపీ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు.. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా అని నిలదీశారు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైందని, అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని వ్యాఖ్యానించారు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదోనన్నారు. బడే భాయ్‌కి భయపడే తెలంగాణను అవమానించిన తేజస్వి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు.. పార్లమెంటులో 2/3 మెజారిటీ లేదని బీజేపీకిì స్పష్టంగా తెలిసీ కేవలం రాజకీయాల కోసమే, చిత్తశుద్ధి లేకుండా మహిళా బిల్లును తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లపై బీఆరఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైందని, కేసీఆర్ నాయకత్వంలో మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత తమ పార్టీదే అని హరీష్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





