– గుంట నక్కల గుండెల్లో గుబులు మొదలైంది
– జగిత్యాలలో కేసీఆర్ సభ రోజే రేవంత్ మేడిగడ్డకు
– మా అధినేతపై కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
– జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం
– జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది.. ఇక్కడి నుంచే మళ్లీ పూర్వ వైభవం సాధించడానికి, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుతాము అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించబోయే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగే స్థలాన్ని, ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. కేటీఆర్ వెంట హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసీఆర్ సభ ఏర్పాటుతో జిల్లాలో పండగ వాతావరణం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది.. సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. కేసీఆర్ ఏడాది తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తోంది అని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎంత సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటే కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే రెండున్నరేళ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయం లేకుండె.. కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉన్న రోజే అర్జంట్‌గా మేడిగడ్డ వెళ్లాల్సి వచ్చింది అని ఎద్దేవా చేశారు. టీవీల్లో సగం కేసీఆర్‌ను చూపెట్టాలి.. సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి.. పేపర్లలో సగం రేవంత్ రెడ్డిదే రాయాలి.. అవతలి వైపు కేసీఆర్‌ది రాయాలి అని ఒక చిల్లర ప్రయత్నం. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారి అయిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరు.. రేవంత్ రెడ్డి తప్ప అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఇంత చిల్లరగా ఉండకూడదని హితవు పలికారు. ఈ వయసులో, ఈ స్థాయికి చేరుకున్న తర్వాత పేపర్లో ఏమి రాస్తారు.. టీవీ వాళ్లు ఏమి చూపెడతారు అనే విషయాలు కేసీఆర్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదు.. జగిత్యాలకు వచ్చి జనాలను కలుసుకుని లక్షలాదిమందితో సంభాషించడం ఆయనకు తెలిసిందే.. ఆయన ప్రస్థానమే అది అని పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్ల వైపు నుంచి ఇక్కడికి రానీయకుండా రోడ్డు తవ్వుతున్నారట.. మూడేళ్లుగా గుర్తుకు రాని ఈ రోడ్డు ఇప్పుడే గుర్తుకొచ్చింది అని ఆరోపించారు. ఇంత చీప్ రాజకీయాలతో జగిత్యాలలో జనప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి, ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక హైబ్రిడ్ కూడా కాదు.. ఇది ఏం బ్రీడో.. ఇక్కడున్న ఆయన ఏ పార్టీ వాడో ఆయనకే తెలియదు అని వ్యంగ్యంగా అన్నారు. ఇక్కడికి వచ్చి కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్.రమణన్న, వసంత అందరూ కలిసి ఒక వేదికపై మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆరఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది.. దండయాత్ర మొదలవుతుంది.. రేవంత్ రెడ్డి భరతం పట్టడానికి ప్రజలు రంగం సిద్ధం చేశారనే ఒక వాతావరణం వస్తుందనే భయం అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్లకు పట్టుకుంది అని వ్యాఖ్యానించారు. రేవంత్ అట్టర్ ఫ్లాప్ పాలన, ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు.. అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని భయం పట్టుకుందని, అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే జగిత్యాలలో కేసీఆర్ గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు.. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతాంగం, ప్రజానీకం భారీగా కదిలి వచ్చే పరిస్థితి
తమ సోదరుడు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో బాధ్యతలు తీసుకున్నారని, పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే ధర్మపురి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లిÁవీందర్ రావు కూడా కొప్పుల ఈశ్వర్‌తో కలిసి సమన్వయం చేస్తున్నారని, చొప్పదండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రవిశంకర్‌తో సమన్వయం చేసుకుంటూ అక్కడినుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కోరుట్లలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి సమన్వయం చేస్తున్నారని, వేములవాడలో లక్ష్మీనరసింహారావు తో పాటు మాజీ ఎంపీ బాల్క సుమన్ బాధ్యతలు తీసుకున్నారని, ఈ విధంగా పార్టీ నాయకత్వం మొత్తం సమష్టిగా పనిచేస్తోందని, సభా ప్రాంగణంలో బాలమల్లు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని¾ వివరించారు. జీవన్ రెడ్డి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం, ప్రజానీకం బ్రహ్మాండంగా కదిలి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని, ఎండలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, దాదాపు మూడు లక్షల మంచినీళ్ల బాటిల్స్, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడికి చేరుకుంటారని, ఎండ చల్లబడిన తర్వాతనే సభ ప్రారంభమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చిక్కులు సృష్టించినా, ఎంత ఇబ్బందులు కలిగించినా ప్రజలు, కార్యకర్తలు సంయమనంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ చాలాకాలం తర్వాత జగిత్యాల వేదిక నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్నారు.. ఆయన ఏమి మాట్లాడతారో వినాలని రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పెద్దలు అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. జగిత్యాలలో ఉన్న ప్రతి సోదరుడు, సోదరీమణికి విజ్ఞప్తి.. ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. అవసరమైతే కార్యకర్తలు ఒక మెట్టు దిగివచ్చి సహకరించాలి అన్నారు. మా రమణన్న, మా వసంత దావా జీవన్ రెడ్డి చేరికను స్వాగతిస్తూ అవసరమైతే ఒక వరుస వెనక్కి జరిగి కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించే సంస్కారాన్ని చూపిస్తున్నారంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హరీష్ రావు మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని స్వాగతించి, పలకరించారన్నారు. దాదాపు 25 సంవత్సరాల పరిచయం ఉన్న నేపథ్యంలో వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారన్నారు. పాత్రికేయ మిత్రులకు ప్రార్థన.. మొన్న మీకు కొంత అసౌకర్యం కలిగింది.. క్షమించండి.. ఒక సోదరుడికి కాలు ఫ్రాక్చర్ అయింది. కొన్ని కెమెరా ట్రైపాడ్‌లు కూడా విరిగినట్లు చెప్పారు.. తప్పకుండా ఆ నష్టాన్ని తాము భర్తీ చేస్తాము. ఆ సోదరుడిని కూడా తమ ఎమ్మెల్యే సంజయ్, ఇతర మిత్రులు హాస్పిటల్‌లో పరామర్శించారు.. ఈశ్వర్, జీవన్ రెడ్డి కూడా వచ్చారు. ఆ బాధ్యత మొత్తం తామే తీసుకుంటాము అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





