దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్ 13, 1999) సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్ లో పుట్టిన అయన ప్రాధమిక విద్య ధన్వాడ గ్రామంలో చేసి, ఎస్ ఎస్ సి వరకు మంథనిలోని బావ సువర్ణ చంటయ్య ఇంట్లో ఉండి పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. ఎల్. బి. పూర్తి చేసి ప్రాక్టీసు పెట్టారు. తండ్రి మరణాంతరం స్వంత ఊరికి వచ్చిన శ్రీపాద వ్యవసాయమే వృత్తిగా చేసుకొని, గ్రామంలోనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడి చేశారు.
నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులు ప్రోత్శాహించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటిసారి సర్పంచ్ గా ఎన్నుకో బడ్డారు. వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవ సారి ఎన్నికయ్యారు. మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ ఎం బి ఛైర్మన్ పదవికి మంథని నుండి గెలిచారు. ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ ఎం బి బ్యాంకు ఛైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది. దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనారు. పదవివస్తే ముఖం చాటు చేసుకునే నాయకులకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగారు.1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమ్మేల్లెగా పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించ గలుగుతారా? అనే అంశం ఫై స్వ, విపక్షాలలో చర్చ జరిగింది. తెలుగుదేశం, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిగా సంజయ్ విచార మంచ్ నుండి చంద్రుపట్ల రాజి రెడ్డి పోటీ పడ్డారు. వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు.
కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ తరపున మంథని ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు పి. సి.సి. సభ్యునిగా స్థానం కల్పించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికైన ఆయనకు శాసనసభ స్పీకర్ గా అన్ని పార్టీల మద్దతుతో పదవి అలంకరించారు ఆ పదివికి వన్నె తెచ్చారని ఎంతో మంది ప్రముఖుల, రాజకీయ విశ్లేషకుల ప్రశంశలు పొందారు. ఒకవైపు స్పీకర్ పదవి బాధ్యతతో నిర్వహిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు. విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు. ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగిన రాజకీయ నాయకుడు కావడంతో ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన మహా మేధావి కనుక ప్రభుత్వ విధి – విధానాలపై అసెంబ్లీలో చురుకైన పాత్ర పోషించి, ఆ పదివికే వన్నె తెచ్చారని ఎంతో రాజకీయ విశ్లేషకులు కితాబిచ్చారు.1999 ఏప్రిల్ 13న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా విషాద ఛాయలు అలుము కున్నాయి.
మంథని ప్రాంతమంత శోక సాగరంలో మునిగి పోయింది. మహాదేవపూర్ మండలం అన్నారం కు తన అనుచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గమధ్య లోని అడవుల్లో శ్రీపాదరావు వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారనే వార్త తెలవగానే ప్రజలలో నక్సల్స్ పై ఆక్రోశం ఒక్కసారిగా ఉప్పెనల బయటికి వచ్చింది. ప్రజా నాడి అయిన శ్రీపాదరావును హత మార్చిన విషయం తెల్సుకున్న ప్రజలు నక్సల్స్ ను ఎవరిపైన మీ యుద్ధం ప్రజల పైననా? ప్రజా హృదయం పైననా?’’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వేల మందికి పైగా కన్నీటి పర్యంతమై శ్రీపాదరావు అంత్య క్రియల్లో పాల్గొన్నారు. అనంతరం పీపుల్స్ వార్ అగ్రనాయకత్వం, కేంద్ర కమిటీ సబ్యుడు సంతోష్, శ్రీపాదరావును హతమార్చడం నక్సల్స్ యొక్క చారిత్రాత్మక తప్పిదం అని పేర్కొన్నాడు . ఒక ప్రజా నాయకున్ని అన్యాయంగా చంపామంటూ తప్పు ను ఒప్పుకునారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494