టుబాకో కంట్రోల్ హీరో మాచన

– 22 ఏళ్లగా నిశ్శబ్ద పోరాటం
– అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
– వరల్డ్ నో టుబాకో డే(మే 31) సందర్భంగా ప్రత్యేక కథనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : పొగాకు వ్యసనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన మహమ్మారి. ఆ వ్యసనాన్ని మాన్పించడంలో ఓ వ్యక్తి చేసిన తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ వ్యక్తి ఎవరో కాదు మాచన రఘునందన్. ఆయన కేవలం ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. టుబాకో నియంత్రణలో ఆయన చేసిన సేవ మాత్రం అమూల్యం. ఆయన సేవలకు అత్యున్నత గౌరవమైన టుబాకో కంట్రోల్ హీరో అవార్డు ఆయనను వరించింది. సార్.. నో స్మోకింగ్ ప్లీజ్ అని వినయంగా చెప్పడం ఆయన అలవాటు. ధూమపానం, గుట్కా వ్యసనం కారణంగా తన ఆప్తమిత్రుడు దీక్షితులును కోల్పోయినప్పుడు రఘునందన్ ఉద్యమం ప్రారంభమైంది. తీవ్రంగా కలత చెందిన ఆయన ఇతరులను కూడా అదే గతి నుండి కాపాడతానని జీవితకాల ప్రతిజ్ఞ చేశారు. రఘునందన్ తన ద్విచక్ర వాహనంపై 500 గ్రామాలలో 5,000 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి తన ‘పొగాకు మానేయండి’ ప్రచారాన్ని ప్రారంభించారు.గత పాతికేళ్లుగా ఆయన ఈ మాటను లక్షలాదిమందికి చెబుతూ పొగాకు వ్యసనం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కృషి దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది.

వైద్యుడు కాదు.. కానీ సమాజానికి వైద్యుడే

మేము రోగులకు చికిత్స చేస్తున్నాం.. కానీ రఘునందన్ మాత్రం సమాజానికి చికిత్స చేస్తున్నారు అని వైద్యులు ఆయన గురించి చెబుతున్నారు. వైద్య వృత్తికి సంబంధం లేకపోయినా సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అత్యున్నత గౌరవం

పొగాకు నియంత్రణపై విశేషంగా పనిచేసే వ్యక్తులకు రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్‌సిటిసి) సంస్థ ప్రతి సంవత్సరం ‘టుబాకో కంట్రోల్ హీరో’ అవార్డు అందిస్తుంది. దేశవ్యాప్తంగా 2025లో ఎంపికైన 15మందిలో మాచన రఘునందన్ మాత్రమే వైద్యేతర వ్యక్తి. అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా కూడా నిలిచారు.

సాధారణ ఉద్యోగి.. అసాధారణ సేవ

ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రఘునందన్ విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడం, యువతను దూరం చేయడం ఆయన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. రఘునందన్ చేస్తున్న ఈ కృషి ఒక నిశ్శబ్ద విప్లవంగా చెప్పవచ్చు. ఎలాంటి ప్రచారం లేకుండా, హడావుడి లేకుండా సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నిజమైన హీరో ఆయన.

ప్రేరణగా నిలిచిన వ్యక్తిత్వం

మాచన రఘునందన్ అనే పేరు ఇకపై కేవలం ఒక అధికారి పేరు మాత్రమే కాదు. పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వంగా చరిత్రలో నిలిచే పేరు. ఆయన పొందిన హీరో అవార్డు కేవలం ఒక గౌరవం కాదు.. నిస్వార్థ సేవకు లభించిన కిరీటం.

చండీఘర్ సదస్సుకు హాజరు కావాలి : మాచనకు హ్వానం

పొగాకు నియంత్రణపై జరుగు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్పోఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ తెలిపారు. శనివారం ఆయన అమీర్పేటలో మాట్లాడుతూ పొగాకు నియంత్రణలో నవీన పద్ధతులు అనే అంశంపై పంజాబ్ రాష్ట్రం చండీఘర్‌లో ఈ నెల 25న అంతర్జాతీయ సదస్సును రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్‌సిటిసి) నిర్వహిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా వ్యక్తులు, సంస్థలు పొగాకు నియంత్రణకు అవలంబిస్తున్న/అనుసరిస్తున్న విధానాల తాలూకు పద్ధతులను జాతీయస్థాయి సదస్సులో ప్రదర్శిస్తారన్నారు. 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషిచేస్తూ 2025 ఆగస్టులో టుబాకో కంట్రోల్ హీరో అవార్డుకు ఎంపికైన ఘనతతోపాటు ఆర్‌సిటిసి సదస్సుకు ఆహ్వానం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇంతకన్నా ఇంకేం కావాలి కన్నా

జీవితంలో ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావాలి అనుకున్నా.. డిగ్రీ చేశాక నాలుగు పర్యాయాలు సివిల్స్ రాశా. నేను కలెక్టర్ అయితే ఆ ఆనందం మా అమ్మ కళ్ళలో చూడాలి అని నా ఆశ. కానీ ఇపుడు దేశ విదేశ వెబినార్‌లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆహ్వానం, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఇమ్స్) నుంచి పొగాకు నియంత్రణ సదస్సులకు  హాజరు కావటం అంతర్జాతీయ వేదికలపై నేను మాట్లాడటం. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి కన్నా అంటూ అమ్మ ఆనందపడటం ఈ జన్మకు ఇది చాలు అనే సంతృప్తి మిగిలించింది.

– మాచన రఘునందన్
టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *