డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి

– రైతులకు ఆధునిక సాంకేతికతను అందించాలి
– వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాల్లో మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా విశ్వవిద్యాలయం తలపెట్టిన విత్తన వారోత్సవాలు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి పదిమంది రైతులకు వివిధ పంటలకు చెందిన నాణ్యమైన మూల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం చాలా అభినందనీయం అని మంత్రి అన్నారు. కొన్ని విత్తన కంపెనీల మాయమాటలకు మోసపోకుండా రైతులు ఈ నాణ్యమైన విత్తనాలు వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలన్నారు. తొలుత గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్, టెక్నాలజీని సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగం పై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. భవిష్యత్తు వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికమయ్యే అవకాశం ఉన్నందున డ్రోన్స్ వినియోగం ప్రాముఖ్య తను గుర్తు చేశారు. తదనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డ్రోన్ ఆధారిత వివిధ వ్యవసాయ విధానాల్ని మంత్రి అభినందించారు. ఇటీవల ఎస్‌బీఐ-సీఎస్‌ఆర్ నిధుల సాయంతో అభివృద్ధి చేసిన రోబోటిక్స్, సెన్సర్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించి ఇప్పటికే కొన్ని రోబోలను వ్యవసాయ రంగంలో ఉపయోగించేలా అభివృద్ధి చేసినందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను మంత్రి అభినందించారు. సీ-డాట్‌లో భాగం అయిన ఆరఎస్ అండ్ జీఐఎస్ ల్యాబ్‌ను సందర్శించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఉపగ్రహ ఆధారిత గణాంకాల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని రైతాంగం యాజమాన్యం పరిధిలో ఉన్న మొత్తం భూమిలో సుమారు 9.3 శాతం భూమి సాగులో లేదని ఈ సందర్బంగా మంత్రికి వివరించారు. 60 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహా అనేకమంది మహానుభావుల తోడ్పాటుతో దేశం లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడ్పాటుతో విశ్వవిద్యాలయం ఇంకా పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిరంతరం రైతులతో మమేకమై వారికి కావలసిన పరిష్కారాలు అందించాలన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక అదునాతన సాంకేతికతలను విశ్వవిద్యాలయం రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు ఆయన సూచించారు. సాగుకు కీలకమైన నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ఈ విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరామ్,డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నీలిమ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ వై.చంద్రమోహన్ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *