నీటి హ‌క్కుల‌ తాక‌ట్టుదారులు వాళ్లే

– ఏ సంద‌ర్భంలోనూ అడ్డు చెప్ప‌లేదు
– ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌పై కాంగ్రెస్‌ను బ‌ద్నాం చేస్తున్నారు
– దానిపై మేము ఫిర్యాదు చేశాం
– నీటి ప్రాజెక్టుల‌పై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం
– మీడియా కూడా వాస్త‌వాల‌ను ప‌రిశీలించాలి
– ప్రెస్‌మీట్ లో బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వ‌జం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 23 : కృష్ణా నది జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, రాష్ట్ర హక్కులను కాపాడటం లేదని బీఆర్ఎస్ ఇటీవల పదేపదే చెబుతోంద‌ని, వాదనల కంటే అబద్ధాలను నమ్ముకుని తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తోంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. పల్నాడు వాటర్ గ్రిడ్ గురించి హరీష్ రావు, కేటీఆర్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కారణమని అర్ధసత్యాలు, అబద్ధాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. 2004 నుంచి 2006 వరకు వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, సాగు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు నీటి హక్కులను శాశ్వతంగా ఆంధ్రాకు తాకట్టు పెట్టారంటూ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌తో క‌లిసి సోమ‌వారం నిర్వ‌హించిన‌ విలేక‌రుల స‌మావేశంలో ఎదురు దాడి చేశారు. మీడియా కూడా వాస్తవాలను పరిశీలించాల‌ని సూచించారు. 2022 ఫిబ్రవరి 16న వైఎస్ జగన్ ఏపీ సీఎంగా, తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో నం.56ను విడుదల చేశారని, రూ.1,200 కోట్లతో గుంటూరు జిల్లా పల్నాడు తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్ పథకం కింద తీసుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేలా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో, అనుమతులపై కృష్ణా బోర్డు దగ్గర కానీ, జల్ జీవన్ మిషన్ దగ్గర కానీ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.. అనుమతులు ఇచ్చినప్పుడు అభ్యంతరం పెట్టలేదు.. కేంద్ర ఆర్థిక సహకారంపై అభ్యంతరం చెప్పలేదు.. కానీ ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు మొదలైనట్లు బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తోంద‌ని విమ‌ర్శించారు. వచ్చే ప్రభుత్వాలు అడ్డుకుంటాయన్న ఉద్దేశంతోనే 2022లోనే జీవో ఇచ్చారని, త‌మ‌ దృష్టికి రాగానే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామ‌ని, పనులను ఆపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ త‌మ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. త‌మ‌ బాధ్యతను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే ఉంటామ‌ని స్పష్టం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారు..అప్పుడే పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి అనుమతులు ఇచ్చామని తాను సిద్ధిపేటలో చెప్పానన్నారు. మార్చి 29, 2005న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్‌లో పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యాన్ని పెంచి తరలించుకుపోతామని స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తర్వాత 13.9.2005న జీవో వచ్చింద‌ని, మంత్రులుగా బడ్జెట్‌ను ఆమోదించారు. కానీ అసెంబ్లీలో నిలదీయలేదని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. జీవో వచ్చినప్పుడు తాము మంత్రులుగా లేమని హరీష్ రావు చెబుతున్నాడు.. కానీ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు వారు మంత్రులుగా ఉన్నారన్నారు. ఈ పాపం వాళ్లదేన‌న్నారు. నాయిని నర్సింహారెడ్డి ఆనాడు కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించారంటూ వైఎస్ మోచేతి నీళ్లు తాగింది మీరు కాదా అని నిల‌దీశారు. కృష్ణా జలాలను వైఎస్‌కు తాకట్టు పెట్టింది మీరు.. రూ.1,250 కోట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు అనుమతులు ఇచ్చారు.. రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినప్పుడు హారతులు ఇచ్చింది హరీష్ రావు.. వార్డు మెంబర్ కాకుండానే వైఎస్ ఆయనను మంత్రిగా చేశారు.. హరీష్ రావు గురువు వైఎస్ఆర్ అని ధ్వ‌జ‌మెత్తారు. శ్రీశైలం వెనుక నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు లేదా మల్యాల లేదా ముచ్చుమర్రి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారన్నారు. 2020లో రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతులు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రాంత నీటి హక్కులకు సమాధి కట్టి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ వన్ ద్వారా 40 టీఎంసీల నీళ్లను తరలించుకుపోవడానికి జీవో 24-07-2004న ఇచ్చారు.. అప్పుడు హరీష్ రావు మంత్రివర్గంలోనే ఉన్నాడు..శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకోవడానికి ముచ్చుమర్రికి అనుమతి ఇచ్చారు అని ఆరోపించారు. జూన్ 2, 2014న కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు, కేటీఆర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో అడ్డుకునే అవకాశం లేకపోయినా తెలంగాణ వచ్చాక అన్ని అవకాశాలు ఉన్నాయని, 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 71 శాతం తెలంగాణలో పరివాహక ప్రాంతం, 29 శాతం ఆంధ్రాలో ఉందని చెప్పారు. పరివాహక ప్రాంతం ఆధారంగా చూస్తే తెలంగాణకు 578 టీఎంసీల వాటా రావాల్సి ఉండ‌గా కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు సాగునీటి శాఖ మంత్రిగా జూన్ 26, 2015న కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో ఆంధ్రాకు 512, తెలంగాణకు 298.96 టీఎంసీలు చాలని సంతకం చేశారని, చంద్రబాబుకు సరెండర్ అయి సంతకం పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పరివాహక ప్రాంతం ఆధారంగా పాలమూరు కరువు గురించి మాట్లాడి చంద్రబాబును ఎదిరించి వాటా కోసం వాదించకుండా 299 టీఎంసీలు చాల‌ని సంతకం పెట్టి తెలంగాణ నీటి హక్కులపై మరణశాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు.లేన‌ని విరుచుకుప‌డ్డారు.

మామా, అల్లుళ్లు కలిసి సంతకం చేశారు

ప్రతి ఏడాది చర్చించి ముందుకు వెళ్లే అవకాశం ఉండేది.. కానీ ఈ పంపకాలే శాశ్వతం అని 2020, జనవరి 29న ఒప్పుకున్నారని, ఈ ప్రాంతానికి జలసమాధి కడుతూ కేసీఆర్ ఆనాడు సంతకం చేశారని ఆరోపించారు. 24.02.2022న ప్రకాశం జిల్లాకు 0.22 టీఎంసీ నీటి కేటాయింపులకు జీవో 482ను ఇచ్చారని, ప్రతిరోజూ 11 టీఎంసీల నీళ్లు ఆంధ్రా తరలించుకుపోవడానికి కేసీఆర్ సంతకాలు చేశారని గుర్తు చేశారు. 2023-24లో 208.79 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను ఆంధ్రా తీసుకుంటే 119 టీఎంసీలను తెలంగాణ తీసుకుంద‌న్నారు. 2024-25లో 285 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది..2026లో తెలంగాణ 268 టీఎంసీలను వినియోగించుకుందని, 2027లో 132 టీఎంసీలు ఏపీ వాడుకుంటే 110 టీఎంసీలను తెలంగాణ వాడుకుంద‌ని చెప్పారు. 26-27లో 45.44 శాతం నీళ్లను తెలంగాణ వినియోగించుకుందని చెప్పారు. ఎస్ ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి, భీమా లాంటి ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు..రాయలసీమ వైపు ఉన్న ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పట్టుపట్టి పూర్తి చేసుకుంది అని చెప్పారు. రూ.లక్షా 80వేల కోట్లను కాంట్రాక్టర్లకు కేసీఆర్ చెల్లించాడు..తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎపీకి 4.47 టీఎంసీలు రోజూ తరలించే కెపాసిటీ ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయ‌ని చెప్పారు. ఒక‌ నదిని పూర్తిగా తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కట్టారన్నారు. రొయ్యల పులుసు, పంచభక్ష్య ప‌ర‌మాన్నాలు కేసీఆరే తిని అన్యాయం చేశాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో ఎనిమిది ప్రాజెక్టులను నిర్మించారు.. వాయువేగంతో పూర్తి చేశారన్నారు. కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. దీని వల్ల పూర్తిగా నష్టపోయామ‌న్నారు. కేసీఆర్ హయాంలో భూసేకరణపై 2014 నుంచి అక్టోబర్ 2023 వరకు రూ.11,255 కోట్లు ఖ‌ర్చు చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఏడాదికి స‌గ‌టున‌ రూ.1,187 కోట్ల మాత్ర‌మే ఖర్చు చేశారని, రూ.6,765 కోట్లను త‌మ ప్రభుత్వం భూసేకరణకు కేటాయించింద‌ని వివ‌రించారు. ఏడాదికి రూ.2,417 కోట్లను సగటున ఖర్చు చేశామ‌ని, వీలైనంత మేరకు కృష్ణా జలాలను తరలించాలని తాము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామ‌ని తెలిపారు. 45 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటే రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు..రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయి అని ప్ర‌శ్నించారు. త‌మ ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింద‌ని, త‌మ‌ ప్రభుత్వం రూ.3,518 కోట్లను భూసేకరణపై ఖర్చు చేసింద‌ని, .రూ.1,256 కోట్లను సగటున ఏడాదికి ఖర్చు చేసిన‌ట్లు వివ‌రించారు.

ఉద్దండాపూర్ కోసం 600 కోట్లు ఖ‌ర్చు చేశాం

ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ.600 కోట్లను ఖర్చు చేశామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ముంపు బాధితులను తరలించాలని, భూసేకరణ చేయాలని కేసీఆర్ ఆలోచించలేదని విమ‌ర్శించారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేవ‌ని, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బరితెగించి నీళ్లు తరలించుకుపోయే అవకాశం ఉండేది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కారణం కేసీఆర్న‌ని పున‌రుద్ఘాటించారు. టన్నుల కొద్దీ అబద్ధాలను సంచుల్లో వేసుకుని ఊర్లలో కేటీఆర్, హరీష్ రావు వెదజల్లి వస్తున్నారని విమ‌ర్శించారు. వైఎస్ జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు భోజనం పెట్టిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ వచ్చింద‌ని గుర్తు చేశారు. కేసీఆర్ మంచి మనిషి.. గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చారని జగన్ చెప్పారన్నారు. ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు కానీ 797 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో రాయలసీమ లిఫ్ట్ నుంచి నీళ్లు తీసుకుపోయేందుకు అనుమతి ఇచ్చారు.. నీళ్లు కాదు బురద కూడా దీని ద్వారా తీసుకుపోవచ్చున‌న్నారు.
జగన్‌ను పిలిచి హారతి పట్టి కృష్ణా జలాలను సమర్పయామి చేసింది కేసీఆరేన‌ని ఆరోపించారు.కేసీఆర్ అవినీతి గుర్తించి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందాలి.. మిగిలిపోయిన తెలంగాణ సంపదను ఎలాగైనా కొల్లగొట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు.. మూడో తరానికి సరిపోయేలా సంపాదించాలని చూస్తున్నాడు అని విమ‌ర్శించారు. జ‌ల‌ వివాదాలు శాశ్వతం.. ఏదో రకంగా వివాదాలు వస్తూనే ఉంటాయని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చట్టానికి లోబడి సంబంధిత వ్యవస్థల్లో ఫిర్యాదు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంద‌న్నారు. హరీష్ రావుకు అంత తెలివి ఉంటే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్‌ పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు. త‌న‌కు సాగునీటి పారుదల శాఖను అప్పగించమని హరీష్ రావు అంటున్నాడు.. కానీ ఆయ‌న‌ను ఆయన మామే నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఇక తాము ఎలా నమ్ముతాం అన్నారు. దొంగే తాళం అడుగుతున్నట్లు హరీష్ రావు తీరు ఉందద‌న్నారు.

ట్రిబ్యున‌ల్‌, సుప్రీంకోర్టు ముందు బ‌ల‌మైన వాద‌న‌లు

బ్రిజేష్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సీఎంల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టుల అనుమతుల కోసం కలిశామ‌ని, ప్రధాని మోదీని సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై కలిశామ‌ని, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను లెక్కలేనన్ని సార్లు కలిశామ‌ని వివ‌రించారు. 512 టీఎంసీల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని ఏపీ స్పష్టంగా చెబుతోంద‌ని, ఈ ఒప్పందం తాత్కాలికమని చెప్పడానికి త‌మ‌కు తల ప్రాణం తోకలోకి వస్తోందని అన్నారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కులను జలసమాధి చేసింది కేసీఆర్, హరీష్ రావు మాత్రమేన‌ని పున‌రుద్ఘాటించారు. ఉరేసినా, కోదండం వేసి కొట్టినా ఇది వారిద్దరికే వర్తిస్తుంది.. హక్కులను కాపాడటానికి శాయశక్తులా నిరంతరం ప్రయత్నం చేస్తున్నామ‌ని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *