ఇందిరమ్మ టవర్స్ కు ‘రెరా’ అనుమతులు

– హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులకు ఇదే తొలిసారి
– ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్దత

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 23: అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ‘రెరా’ అనుమతులు లభించాయి. ‘రెరా’ చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి ఈ అనుమతుల పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం అందుకున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత, నిబంధనల ప్రకారం అమలు, లబ్ధిదారుల హక్కుల పరిరక్షణ పట్ల హౌసింగ్ బోర్డు చూపుతున్న నిబద్ధతకు ఈ అనుమతులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగర పరిథిలో ఈ పథకం ద్వారా లక్ష ఇండ్లను నిర్మించాలని నిర్ణయించి తొలి విడతలో పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో సుమారు 12,000 ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పరంగా భూములను ఉచితంగా అందచేయడంతోపాటు, సంబంధిత ప్రాజెక్టులో అవిభక్త భూమి వాటాను కూడా రిజిస్టర్ చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్నింటికీ మించి ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలన్న దృఢ‌ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇలాంటి హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పిస్తూ నిబద్దతతో, నియమిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంపై ఇండ్ల లబ్ధిదారులకు సంపూర్ణ విశ్వాసం కలిగించడంలో ‘రెరా’ అనుమతులు కీలకమైన భూమిక వహిస్తాయి. అంతేకాక ‘రెరా’ అనుమతులున్న ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టులన్నిటికీ ‘రెరా’ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. తొలి దశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు ఈ అనుమతులు మంజూరయ్యాయి. బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.30-50 లక్షల విలువ చేసే ఈ ఫ్లాట్లను పేదల కోసం కేవలం రూ.6 లక్షలకే ప్రభుత్వం అందచేస్తున్నందున ‘రెరా’ చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకుని అనుమతుల జారీని వేగవంతం చేశారు. ఈ అనుమతుల ద్వారా ప్రాజెక్టులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని, గృహ నిర్మాణ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ హౌసింగ్ బోర్డు తన సేవలను కొనసాగిస్తుందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *