– దాన్ని తిప్పికొట్టడానికే ‘మహా పాదయాత్ర’
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : దేశంలో గత 12 ఏళ్లుగా అధికారానికి దూరమైన అసహనంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. కేవలం నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారే దేశాన్ని పరిపాలించాలని, ఇతరులకు ఆ అర్హత లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరీంనగర్లో సోమవారం నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ దాదాపు 50 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖ నుంచి బయటపడటాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. అధికారం కోసం దేశ విచ్ఛిన్నకర శక్తులను పెంచి పోషిస్తూ, విద్యార్థులను రెచ్చగొడుతూ, కులాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి దేశంలో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు, అలాగే కార్యక్రమానికి హాజరైన నితిన్ నబీన్, రాష్ట్ర ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఇతర ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలిపారు.
ఈ ఎస్ ఐఆర్పైనే విమర్శలు ఎందుకు రాహుల్
ఎన్నికల సంఘం చేపడుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక సవరణ (‘సర్’) ప్రక్రియపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను రామచందర్ రావు తీవ్రంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో గతంలో ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు 9వ సారి జరుగుతోందని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో జరిగినప్పుడు లేని అభ్యంతరం నేడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటే ఎందుకు వస్తోందని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ ఎన్నికల ప్రక్రియ ప్రకారం మోదీ ఎన్నిక చెల్లకపోతే అదే ప్రక్రియ ద్వారా గెలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు కట్టుబడి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.
రాహుల్‌ను ప్రధానిని చేస్తామనడం పెద్ద జోక్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందిస్తూ అంతకన్నా పెద్ద జోక్, హాస్యాస్పదమైన వ్యాఖ్య మరొకటి ఉండదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోవడానికి బీజేపీ అగ్రనేతలు అవసరం లేదని, బీజేపీ తెలంగాణ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సరిపోతారని వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డపై విదేశీయులతో కలిసి భారతదేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే కరీంనగర్ గడ్డపై ఈ మహా పాదయాత్రను చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




