– హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
– శాయంపేట పాఠశాలలో ఘనంగా ‘గ్రాండ్ పేరెంట్స్ డే’
– వృద్ధుల పోషణ, రక్షణ చట్టం-2007పై అవగాహన
– వృద్ధులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ
హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : చిన్నతనం నుంచే పిల్లలకు పెద్దల పట్ల ప్రేమ, గౌరవ మర్యాదలు చూపేలా సంస్కారం నేర్పాలని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. నేడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటం వల్ల పిల్లల మానసిక స్థితిలో ‘మా’ అనే పదం పోయి ‘నా’ అనే స్వార్థం అలవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబాలతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో
శాయంపేట పాఠశాలలో బుధవారం గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు, ఇందులో భాగంగా పిల్లలు, తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ తాతయ్యలకు మధ్య ఉండవలసిన ప్రేమ, బాధ్యతలపై అవగాహన కల్పించారు. వయోవృద్దుల పోషణ, రక్షణ చట్టం-2007, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ చాహత్ వాజ్‌పాయ్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి, డిడబ్ల్యూవో విశ్వజ హాజరయ్యారు. పిల్లలకు అన్నప్రాసన చేయించారు. అనంతరం కలెక్టర్, అనితారెడ్డితోపాటు మిగతా అతిథులు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా పిల్లలతో సమయం గడపలేకపోవడం, టీవీలు, సెల్ ఫోన్లకు బానిస కావడం వల్ల పిల్లలు పెడదోవ పడుతున్నారని తెలిపారు. ఇంట్లో తాత, నానమ్మలు ఉన్నప్పుడు ఆ లోటు తీరుతుందని, వారి అనుభవాలు పిల్లలకు పాఠాలుగా మారుతూ మంచి పౌరులుగా తయారవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అంశంపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
వయోవృద్ధుల రక్షణ చట్టం-2007పై అవగాహన
వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు ఒక వరమని అతిథులు స్పష్టం చేశారు. పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, సమస్యలు ఎదురైనా ట్రిబ్యునల్ కోర్టును సంప్రదిస్తే ఉచిత న్యాయం అందుతుందని తెలిపారు. వృద్ధులను వేధించినా, అగౌరవపరిచినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వృద్ధులను గౌరవిస్తామని, వారి హక్కులను పరిరక్షిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం లో డిఈఓఎం ఈఓ, సిడిపిఓలు, ఎ.ఫ్.ఆర్.ఓ రవికిరణ్, స్కూల్ ప్రిన్సిపాల్ ఉప్పలయ్య, సీనియర్ సిటిజన్స్ యుగేందర్, చంద్రమౌళి, దేవాచారి, దామోదర్, అంగన్వాడీ టీచర్లు , సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





