యువత చూపు ఇప్పుడు రాహుల్ వైపు!

“రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక చారిత్రక అవకాశం ఉంది. యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను జాతీయ రాజకీయాల ఎజెండాగా మార్చాలి. మోదీ అధికారాన్ని చూసి యువత భయపడే రోజులు కావు ఇవి. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే తపనతో యువత ముందుకొస్తున్న కాలం ఇది. ఆ యువశక్తికి రాహుల్ గాంధీ నాయకత్వం బలంగా నిలిస్తే దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది..”

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ శాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.
సెల్- 9866255355

ఉద్యమమంటే ఆవేశపూరిత నినాదాలు, ఉద్రిక్తతలు, దూకుడుగా ముందుకెళ్లడమే కాదు. కాలానుగుణంగా ఉద్యమాల స్వరూపం, పోరాట పద్ధతులు కూడా మారుతున్నాయి. సృజనాత్మక నిరసనలు, ఆధారాలతో కూడిన ప్రశ్నలు, ప్రజల్లో చైతన్యం కల్పించడం నేటి ఉద్యమాలకు కొత్త రూపాన్నిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి సాగిస్తున్న వోటు హక్కుల పరిరక్షణ పోరాటం ఈ దిశగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది .దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న ఇండియా కూటమి నిర్వహించిన సభ వినూత్న నిరసనలు, నినాదాలతో రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ‘వోట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ నినాదంతో సాగిన ఈ ఉద్యమం కేవలం రాజకీయ నిరసనగా కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను కోరుతున్న పోరాటంగా ముందుకొస్తుంది . మోదీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని అణచివేయలే. యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాన్ని అధికార బలంతో నిలువరించడం సాధ్యం కాలేదు.జెన్‌జీ ఉద్యమ స్ఫూర్తితో రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్త ప్రజాస్వామ్య ఉద్యమంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ప్రజల ఆకాంక్షను రాజకీయ కుట్రగా చిత్రీకరించడం అధికార పక్షం చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే. విద్యార్థులు, యువత లేవనెత్తుతున్న ప్రశ్నలను దేశద్రోహంగా ముద్ర వేయలేనట్లే, వోటు హక్కును పరిరక్షించాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని కూడా రాజకీయ స్వార్థంగా కొట్టిపారేయలేరు.

భారత ప్రజాస్వామ్యంలో వోటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియలో భాగం కాదు. అది సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం. పేద, ధనిక, ఉన్నత, బలహీన వర్గాలనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి సమాన రాజకీయ హక్కును కల్పించేది వోటు. అలాంటి వోటు హక్కుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత కాదా? వోటరు జాబితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, ఒకే చిరునామాలో పెద్ద సంఖ్యలో వోటర్లు నమోదవుతున్నారనే ప్రశ్నలు, వోటర్ల పేర్ల తొలగింపుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతపై చర్చకు దారితీస్తున్నాయి.ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల సంఘం పారదర్శకతను నిలదీస్తున్నారు. ప్రతి పౌరుడి వోటుకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అధికార పక్షం, ప్రతిపక్షాల పోరాటాన్ని రాజకీయంగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజల్లో మరిన్ని అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. జెన్‌జీ యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని గుర్తించి, వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకు భిన్నంగా యువత ఉద్యమాలకు దురుద్దేశాలు ఆపాదించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.అదే తరహాలో ‘వోట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ ఉద్యమాన్ని కూడా కొందరు రాజకీయ ప్రేరేపిత పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వోటు హక్కు పరిరక్షణ అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. అది ప్రతి భారతీయుడి హక్కు. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఆయన నాయకత్వాన్ని విమర్శించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే ఆరోపణలపై పారదర్శకమైన విచారణకు సిద్ధపడాలి. ప్రజలకు సందేహాలు కలిగినప్పుడు వాటిని నివృత్తి చేయడం రాజ్యాంగబద్ధ సంస్థల బాధ్యత.

గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించామని ప్రచారం చేసుకుంటున్న విజయాలను సోషల్ మీడియా వేదికగా పదేపదే ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజల ముందున్న అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. రాహుల్ గాంధీ పోరాటాన్ని నీకు ఎప్పటికి  ‘మాక్ పార్లమెంట్’ అంటూ ఎద్దేవా చేయడం కూడా ప్రజాస్వామ్యవాదుల విమర్శలకు గురవుతోంది. ప్రతిపక్షాల ర్యాలీకి పోటీగా వివిధ ప్రాంతాల్లో అధికార పక్షం సభలు, ర్యాలీలు నిర్వహించడం రాజకీయ పోటీలో భాగమే కావచ్చు. కానీ రాజకీయాల్లో పార్టీల జెండాలు, నినాదాల కంటే న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలే కీలకమని ఈ పరిణామాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.నిస్సందేహంగా ఈ సభ ప్రతిపక్ష ఐక్యతను చాటిన రాజకీయ వేదికగా నిలిచింది.

వివిధ పార్టీల అగ్రనేతలు ఒకే తాటిపైకి వచ్చి వోటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వోటరు జాబితాల సవరణలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై గళమెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పరిణామం. కొంతకాలంగా అధికారానికి దూరంగా ఉన్న ఇండియా కూటమి చేస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఒక రాజకీయ దిశను అందిస్తుంది . కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, యువత, విద్యార్థులు, పౌరసంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం అధికార మార్పిడి కోసం చేసే పోరాటంగా మిగిలిపోకూడదు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రత, వోటరు జాబితాల ప్రక్షాళన, ప్రతి పౌరుడి వోటు హక్కుకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. మోదీ ప్రభుత్వం ఎంతటి రాజకీయ ఎదురుదాడికి దిగినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లేవనెత్తిన ప్రశ్నలను శాశ్వతంగా మౌనం చేయలేరు. ప్రజల సందేహాలను తీర్చకుండా ఉద్యమకారులపై విమర్శలు చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు.

యువతను తక్కువ అంచనా వేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రపంచ చరిత్ర చెబుతోంది. యువతరం కేవలం ఉద్యోగాలు, ఉపాధి కోసం మాత్రమే ఎదురుచూసే తరం కాదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కూడా వారిదే. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, హక్కులకు భంగం కలిగినప్పుడు పోరాడటం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎదురైనప్పుడు గొంతెత్తడం నేటి యువతరానికి తెలుసు. ఈ యువశక్తిని రాజకీయ మార్పు దిశగా నడిపించే నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది . ఆ దిశగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది .రాహుల్ గాంధీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. యువతరం ఆలోచనలను, ఆకాంక్షలను చిన్నచూపు చూడొద్దు. ఇదే నేటి రాజకీయాలకు యువత ఇస్తున్న సందేశం. చరిత్రలో ఎన్నో ప్రజా ఉద్యమాలను అధికార వ్యవస్థలు మొదట్లో చిన్నచూపు చూశాయి. వాటికి రాజకీయ రంగు పులిమాయి.

అయినప్పటికీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగిన ఉద్యమాలను ఏ శక్తీ శాశ్వతంగా అడ్డుకోలేకపోయింది. జెన్‌జీ ఉద్యమమైనా, వోటు హక్కుల పరిరక్షణ పోరాటమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనాన్ని కోరుతున్నవే.రాహుల్ గాంధీ ఈ పోరాటాన్ని వ్యక్తిగత రాజకీయ విమర్శల స్థాయి నుంచి దేశవ్యాప్త ప్రజాస్వామ్య ఉద్యమంగా విస్తరించాలి. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలి. యువతను భాగస్వాములను చేయాలి. ప్రతి వోటరులో చైతన్యం కలిగించాలి. యువత ఆకాంక్షలకు గొంతుకగా మారడంతో పాటు వారి సమస్యలను పార్లమెంటు నుంచి పల్లె వరకు తీసుకెళ్లాలి. యువతకు కేవలం హామీలు ఇవ్వడం కాకుండా నిర్ణయాధికారంలో, రాజకీయ నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించాలి. అప్పుడే యువతలో రాహుల్ గాంధీ పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఒక బలమైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుంది.

వోటు హక్కును పరిరక్షించాలని అడగడం నేరం కాదు.. అది ప్రజాస్వామ్య బాధ్యత. వోటు చోరీ జరిగిందన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలు కాదు.. సంబంధిత వ్యవస్థలు, బాధ్యత కలిగిన పాలకులు. ప్రజల సందేహాలకు సమాధానాలు చెప్పకుండా విమర్శలతో కాలం గడపడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ‘వోట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ పోరాటాన్ని ఎన్ని రాజకీయ అడ్డంకులు సృష్టించినా నీరుగార్చడం అంత సులభం కాదు.రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక చారిత్రక అవకాశం ఉంది. యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను జాతీయ రాజకీయాల ఎజెండాగా మార్చాలి. మోదీ అధికారాన్ని చూసి యువత భయపడే రోజులు కావు ఇవి. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే తపనతో యువత ముందుకొస్తున్న కాలం ఇది. ఆ యువశక్తికి రాహుల్ గాంధీ నాయకత్వం బలంగా నిలిస్తే దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటం కాదు.. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వోటు హక్కును కాపాడాలనుకునే ప్రతి పౌరుడి పోరాటంగా మారాలి. జాతీయ స్థాయిలో రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను, ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ ప్రజాపాలనలో పారదర్శకతను, సంక్షేమ పథకాల సమర్థ అమలును, యువతకు ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతను గుర్తించాలి. జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే పార్టీగా రాష్ట్రంలోనూ అదే విలువలకు కట్టుబడి ఉండాలి.చివరగా ఒక్కటే ప్రశ్న.. వోటు ప్రజాస్వామ్యానికి పునాది అయినప్పుడు, ఆ వోటు భద్రతను ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? ప్రజల వోటుకు రక్షణ కల్పించాలని కోరడం రాజకీయ నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడం కాదు.. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే పాలకుల బాధ్యత. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలు వ్యక్తిగత రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి గొంతుకగా మారాలి. యువతరం మేల్కొంటే మారేది ప్రభుత్వాలు మాత్రమే కాదు.. దేశ రాజకీయాల దిశ కూడా! ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో ప్రజలే అసలైన శక్తి.. ఆ శక్తిని ఏ అధికారమూ శాశ్వతంగా అడ్డుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *