ప్రజల విశ్వాసమే పోలీసులకు అసలైన గౌరవం

– పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మీదే
– సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి నియామకాలు సాధించాం
– పారదర్శకతతోనే పేదల పిల్లలకు కొలువులు
– సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– అవ‌స‌ర‌మైతే మెరుగైన శిక్షణ కోసం విదేశాలకు పంపిస్తాం
– నూతన డీఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రాష్ట్రంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు పూర్తి పారదర్శకతతో డీఎస్పీల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచఆర్‌డీ)లో  నూతన ప్రొబేషనరీ డీఎస్పీల (DSP – 2025 సెకండ్ బ్యాచ్) ముఖాముఖి, ముగింపు వేడుకల సమావేశంలో పాల్గొన్నారు. 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది జాయిన్ అయ్యారు.. 112 మంది డీఎస్పీల నియామకం చాలా పెద్ద విషయం.. నియామకాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకతను పాటించింది అని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉన్నారంటే తమ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని సీఎం గర్వంగా పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో గ్రూప్-1 సహా ఇతర నియామకాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుందని గుర్తు చేశారు. 2011 తర్వాత దాదాపు 13 ఏళ్లపాటు గ్రూప్-1 నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ బోర్డును రాజకీయ పునరావాసంగా మార్చి అనర్హులను నియమించడం వల్ల వ్యవస్థపై విశ్వసనీయత సన్నగిల్లిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే యూపీఎస్సీ విధానాలను స్వయంగా అధ్యయనం చేసి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. రిటైర్డ్ డీజీ మహేందర్ రెడ్డి, ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటేశంను చైర్మన్‌లుగా నియమించి బోర్డుపై నమ్మకాన్ని నిలబెట్టామన్నారు. ఈ నియామకాలపై కొందరు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అభ్యర్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయం సాధించిందని చెప్పారు.

పోలీసు అధికారులకు సీఎం హితవు

మీరు ఏ కష్టాలు పడి, ఏ లక్ష్యంతో ఈ స్థాయికి వచ్చారో ఆ నేపథ్యాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు. మీ హోదాకు తగినట్లుగా నిజాయతీగా బాధ్యతలు నిర్వర్తించాలి అని నూతన డీఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సమస్యను పరిష్కరించాలంటే సమస్యను వినాలి, అర్థం చేసుకోవాలి.. అప్పుడే పరిష్కారం పెద్ద విషయం కాదు.. సమస్య పరిష్కారంలో సమయం, రిసోర్సెస్, టెక్నికల్ సపోర్ట్ అత్యంత ముఖ్యం అన్నారు. ప్రజలకు ఏ ఆపదొచ్చినా కన్న తల్లిదండ్రుల కంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థే. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారిని ఆప్యాయంగా కూర్చోబెట్టి సమస్యను ఓపికగా విని ప్రేమపూర్వకంగా మాట్లాడాలి అని సూచించారు. వచ్చే 30 ఏళ్లపాటు తెలంగాణ భవిష్యత్తును సరైన దిశలో నడిపించే బృహత్తర బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే పెద్ద హోదా మీది.. మీ ఫీడ్‌బ్యాక్, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారుతుంది.. మీరు నిటారుగా నిలబడి డ్యూటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది అని స్పష్టం చేశారు. నిజాయతీగా డ్యూటీ చేయాలి, బాధ్యతను గుర్తించి పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇకముందు రెండో అధ్యాయం ప్రారంభం కాబోతుంది.. ఇది మీ జీవితాల్లో చాలా ముఖ్యం అన్నారు.

ఆధునిక సవాళ్లు – నూతన వ్యవస్థలు 

మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల సరళి కూడా మారిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా సమాజాన్ని కుదిపేస్తున్నాయని హెచ్చరించారు. పంజాబ్ రాష్ట్రం మాదిరిగా యువత డ్రగ్స్ బారిన పడకుండా రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసమే ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియంత్రణ, డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్స్ అణచివేత కోసం సరికొత్త వ్యవస్థలను తీసుకువచ్చామని, అవసరమైతే నూతన డీఎస్పీలను మెరుగైన శిక్షణ కోసం విదేశాలకు పంపిస్తామని వెల్లడించారు. అధికారులు తమ శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ డీఎస్పీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, ఎంసీఆర్ హెచఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్ శాంతకుమారి, డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *