విద్యాలయాలు కేవలం అక్షరాలు నేర్పే నిలయాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజం ప్రగతిని, సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలాలు. అయితే, ఆధునిక కాలంలో కూడా మన ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో నేటికీ వేళ్లూనుకుపోయిన అదృశ్య వివక్ష, అసమానతలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును, వారి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక దశాబ్దం క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల విషాదాంతం దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలోని లోపాలను, సామాజిక పక్షపాతాలను బట్టబయలు చేసింది.
ఆ వేదన, ఆ విద్యార్థి లోకం చేసిన సుదీర్ఘ పోరాటం నుండి పుట్టుకొచ్చిన ఆలోచన ఇప్పుడు తెలంగాణ గడ్డపై ఒక పటిష్టమైన చట్టరూపం దాల్చబోతున్నది . తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తున్న “రోహిత్ వేముల తెలంగాణ బిల్లు, 2026” ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను శాశ్వతంగా రూపుమాపడానికి వేస్తున్న ఒక చారిత్రాత్మక అడుగు.ఈ చట్టాన్ని తీసుకురావడం వెనుక ఉన్న ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేయడం ఈ అంశానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నది . ఇటీవల జరిగిన ఈ కమిటీ తొలి సమావేశంలో చట్టాన్ని న్యాయపరంగా ఎటువంటి లోపాలు లేని విధంగా, అత్యంత పటిష్టంగా మార్చాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కేవలం మార్గదర్శకాలకు మాత్రమే పరిమితమైన నిబంధనలు కోర్టుల స్టేల వల్లనో, లేదా విశ్వవిద్యాలయ యాజమాన్యాల ఉదాసీనత వల్లనో క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. అందుకే, సుప్రీంకోర్టు లాయర్లు, సామాజిక కార్యకర్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన నమూనాను కూడా నిశితంగా అధ్యయనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది .ఈ ప్రతిపాదిత చట్టంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఇవి విద్యావ్యవస్థ నిర్మాణంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా, విద్యా ప్రాంగణాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న గుర్తింపు ఆధారిత వివక్షను, కుల పక్షపాతాన్ని , మానసిక వేధింపులను ఈ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది . ఈ బిల్లులోని అత్యంత కీలకమైన , సాహసోపేతమైన అంశం —క్యాంపస్‌లో వివక్ష ఘటనలు జరిగితే కేవలం తప్పు చేసిన వ్యక్తులనే కాకుండా, ఆయా విద్యాసంస్థల అధిపతులను కూడా బాధ్యులను చేయడం. ఇది సంస్థాగత జవాబుదారీతనాన్ని అపారంగా పెంచుతుంది. యాజమాన్యాలు ఇకపై ఇటువంటి సున్నితమైన సమస్యలను నిర్లక్ష్యం చేయలేవు. అంతేకాకుండా, వివక్షకు గురైన బాధితులకు ఆర్థిక, న్యాయపరమైన తక్షణ పరిహారం అందించడం, నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు పూర్తిగా నిలిపి వేయడం వంటి కఠినమైన శిక్షలు చట్టం గంభీరతను స్పష్టం చేస్తున్నాయి.
అయితే, కేవలం చట్టాలు కాగితాల మీద రాసుకోవడం వల్లనే మార్పు సాధ్యం కాదు, వాటి పారదర్శకమైన అమలు మాత్రమే అసలైన సామాజిక మార్పును తీసుకురాగలదు. గతంలో యూజీసీ ప్రవేశపెట్టిన ఈక్విటీ నిబంధనలు ఉన్నప్పటికీ, విద్యాసంస్థల్లో అంతర్గత వివక్ష స్వరూపాలు మారినాయి తప్ప మూలాలు నశించలేదు. ప్రొఫెసర్ల మార్కుల కేటాయింపులో, పీహెచ్‌డీ గైడ్‌ల కేటాయింపులో, వైవా ఇంటర్వ్యూలలో, ఆఖరుకు హాస్టల్ గదుల కేటాయింపులో కూడా సూక్ష్మ రూపంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ రకమైన వివక్షను గుర్తించడం, నిరూపించడం చట్టపరంగా ఒక పెద్ద సవాలు. వీటన్నింటినీ అరికట్టాలంటే ప్రతి కాలేజీ , విశ్వవిద్యాలయంలో స్వతంత్రంగా, రాజకీయ జోక్యం లేకుండా పనిచేసే ప్రత్యేక ఫిర్యాదుల విభాగాలు నిరంతరం పర్యవేక్షించాలి. ఏ ఒక్క విద్యార్థి కూడా తన గుర్తింపు కారణంగా వెనుకబడిపోతున్నాననే భయానికి లోనుకాకూడదు.ఈ చట్టం క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే కేవలం శిక్షలు, జరిమానాలపైనే కాకుండా, విద్యాసంస్థల అధ్యాపకులకు, పరిపాలనా సిబ్బందికి సామాజిక సున్నితత్వం పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం కూడా అంతే ముఖ్యం… అప్పుడే ప్రాంగణాల్లో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య పరస్పర గౌరవం, భద్రతా భావం,సద్భావన పెంపొందుతాయి.
కేవలం చట్టపరమైన భయంతో కాకుండా, అంతర్గత బాధ్యతతో కూడిన మార్పు వొచ్చినప్పుడే ప్రాంగణాలు నిజమైన విద్యా నిలయాలుగా వర్ధిల్లుతాయి.ఈ క్రమంలో ప్రభుత్వం రాజకీయ పార్టీలు, విభిన్న విద్యార్థి సంఘాలు, పౌర సమాజం, మేధావులతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరమే ముసాయిదాను ఖరారు చేయాలని నిర్ణయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. విద్యార్థుల ఆత్మగౌరవానికి భద్రత కల్పించినప్పుడే నిజమైన విద్యా వికాసం సాధ్యమవుతుంది.ముగింపుగా చెప్పాలంటే, ఉన్నత విద్యాసంస్థలు కేవలం మార్కులు, డిగ్రీలు పంచే ఫ్యాక్టరీలు కావు, అవి నవ సమాజ నిర్మాణానికి పునాదులు. వివక్ష లేని, సమానత్వంతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని నిర్మించడమే ఈ ‘రోహిత్ వేముల బిల్లు’ పరమార్థం కావాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ఈ చారిత్రాత్మక నిర్ణయం కేవలం ఈ రాష్ట్రానికే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలకు, సామాజిక న్యాయ సాధనకు ఒక కొత్త దిక్సూచిగా, ఆదర్శంగా మారుతుందని ఆశిద్దాం.