ప్రజల నెత్తిన ‘ఫిరాయింపు’ ఉప–ఎన్నిక భారం!

తెలంగాణ రాజకీయ యవనికపై హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన వేదికగా మారింది. ఒక ప్రజాప్రతినిధి స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య విలువలను, వోటర్లను తీర్పును కాలరాస్తూ చేసిన పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆఖరుకు న్యాయస్థానాల ద్వారా ఉపఎన్నికకు దారితీసింది. రాజకీయ నైతికతకు, వ్యవస్థల జవాబుదారీతనానికి ఈ పరిణామం ఒక పెద్ద పరీక్షగా నిలిచింది.2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ వోటర్లు భారత్ రాష్ట్ర సమితి గుర్తుపై దానం నాగేందర్‌ను గెలిపించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆయన నైతిక విలువలను పక్కనబెట్టి అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, వేరే పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది రాజ్యాంగ నిబంధనలను, వోటర్ల నమ్మకాన్ని అపహాస్యం చేయడమే.
ఈ అనైతిక పార్టీ మార్పిడి వ్యవహారంపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపరమైన పోరాటానికి దిగారు. న్యాయస్థానాల జోక్యంతో ఖైరతాబాద్ స్థానం ఖాలీ కావడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక రేస్‌లోకి తెలంగాణ రక్షణ సేన సరికొత్త సమీకరణాలతో ప్రవేశించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ స్థానం నుండి పోటీ చేయబోతున్నారనే వదంతులు, ప్రచారాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. దిల్లీ లిక్కర్ కేసు పరిణామాల తర్వాత కవిత ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి తన రాజకీయ పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ వదంతులు నిజమై కవిత గనుక ఖైరతాబాద్ బరిలో నిలిస్తే, ఈ ఉపఎన్నిక కేవలం స్థానిక సంస్థల ఎన్నికగా కాకుండా, రాష్ట్ర , జాతీయ స్థాయి రాజకీయాలను ఆకర్షించే హై-ప్రొఫైల్ పోరాటంగా మారుతుంది.
ఖైరతాబాద్‌లో గెలుపు మూడు ప్రధాన పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తానే మళ్లీ పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయనపై ‘ఫిరాయింపుదారుడు’ అనే ముద్ర పడటం , కోర్టుల ద్వారా అనర్హత వేటు పడటంతో, ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే దానిపై అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తుంది.పార్టీ మార్చినప్పటికీ, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కార్పొరేటర్లు , స్థానిక క్యాడర్‌పై దానానికి వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. ఈ బలాన్ని వదులుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు.రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తర్వాత హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న మొదటి ప్రధాన ఉపఎన్నిక ఇది. నగరంలో కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో సీట్లు లేవు. అందువల్ల, ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా హైదరాబాద్‌పై కూడా తమ పట్టును నిరూపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు.దానం నాగేందర్ రాకతో ఖైరతాబాద్‌లోని పాత కాంగ్రెస్ నాయకులు, టికెట్ ఆశావహులు కొంత అసంతృప్తితో వున్నమాట వాస్తవం. ఉపఎన్నిక వేళ వీరందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం పార్టీకి పెద్ద సవాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నందున, ఖైరతాబాద్ అభ్యర్థి ఎంపిక ,ఎన్నికల రోడ్ మ్యాప్‌పై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తమ పార్టీ గుర్తుపై గెలిచి  గెలిచి, వోటర్ల నమ్మకాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ నైతికతను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తుంది . ఈ ఉపఎన్నిక రావడం వెనుక తాము చేసిన న్యాయపోరాటమే కారణమని, కోర్టుల ద్వారా లభించిన ఈ విజయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ‘ఫిరాయింపుదారులకు’ వోటు తోనే బుద్ధి చెప్పాలని క్యాడర్‌కు పిలుపునిస్తుంది . మాజీమంత్రి తలసాని యాదవ్ కుమారుడు తలసాని కిరణ్ యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత, విద్యావంతుడైన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్లు ప్రస్తుతం పరిశీలనలో వున్నట్టు తెలుస్తుంది . హైదరాబాద్ బాధ్యతలను పూర్తిగా చూసుకునే కేటీఆర్‌కు ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం. అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహాలు, సమన్వయం అంతా ఆయన నాయకత్వంలోనే జరగనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పోటీ చేసిన సమయంలో, ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే బీజేపీకి దాదాపు 17,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యం  లభించింది. 2014లో ఇక్కడ బీజేపీ తరఫున గెలిచిన మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఈయనకున్న గుర్తింపు, పాత క్యాడర్ బలం పార్టీకి ప్లస్ పాయింట్. ప్రస్తుతం ఈయనే రేసులో ముందున్నారు.
వీరితో పాటు కవిత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగితే, ఈ ఉపఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించనుంది. 2026 ప్రత్యేక వోటర్ల జాబితా సవరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో వోటర్ల సంఖ్య దాదాపు 1.86 లక్షలుగా ఉంది.జూబ్లీహిల్స్ పరిసర విలాసవంతమైన ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా వంటి మధ్యతరగతి కాలనీలు, బస్తీలు , గణనీయమైన సంఖ్యలో మైనారిటీ వోటర్లు ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *