దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి, రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ను ఈనెల 24న జి.ఒ.ఎం.ఎస్. నెం.135 ద్వారా ఏర్పాటు చేయడం అభినందనీయమైన పరిణామం. సాంకేతిక హంగులు, స్పష్టమైన అధికారాలతో కూడిన ఈ ప్రత్యేక బ్యూరో ఏర్పాటు కేవలం ఒక ప్రభుత్వ జీఓ మాత్రమే కాదు; నిత్యం రోడ్లపై ఉపాధి వెతుక్కునే కోట్లాది మంది ప్రయాణికుల ప్రాణాలకు లభించిన అతిపెద్ద రక్షణ కవచం.
తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం 32,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు, 1.8 కోట్లకు పైగా వాహనాల నెట్‌వర్క్ ఉంది. గతంలో వివిధ జిల్లాల్లో, కమిషనరేట్లలో విడివిడిగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థల వల్ల సమన్వయ లోపం స్పష్టంగా కనిపించేది. ఒక హైవేపై వివిధ జిల్లాల పరిధి మారినప్పుడు నిఘా లోపించి, రోడ్డు ప్రమాదాలు పెరిగేవి. ఈ లోపాలను సరిదిద్దుతూ, యావత్ రాష్ట్రాన్ని ఒకే ఏకీకృత ట్రాఫిక్ పర్యవేక్షణలోకి తీసుకురావడం ఈ బ్యూరో అతిపెద్ద బలం. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో కూడిన ఈ బ్యూరో, కేవలం రోడ్డు రవాణాకే పరిమితం కాకుండా రైల్వే, మెట్రో భద్రతను కూడా పర్యవేక్షించడం ప్రయాణికులలో మరింత భరోసాను నింపుతుంది.
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రతను గమనిస్తే ఈ సరికొత్త బ్యూరో అత్యవసర ప్రాధాన్యత మనకు స్పష్టమవుతుంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం, దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాదాలలో తెలంగాణ దురదృష్టవశాత్తూ మొదటి 10 రాష్ట్రాల జాబితాలో నిలుస్తున్నది. రాష్ట్రంలో ఏటా సగటున 21,000 కి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతుండగా, దాదాపు 7,000 నుండి 7,500 మంది వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతిరోజూ సగటున 20 మంది రహదారులపై బలవుతున్నారు. ఇందులోనూ మరణిస్తున్న వారిలో 70 శాతానికి పైగా 18 నుండి 45 ఏళ్ల లోపు వయసున్న యువత ,సంపాదించే వ్యక్తులే ఉండటం అత్యంత ఆందోళనకరమైన విషయం.
ఈ ప్రమాదాలలో దాదాపు 55 శాతం మరణాలు జాతీయ, రాష్ట్ర రహదారులపైనే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం వల్ల 72 శాతం ప్రమాదాలు జరుగుతుండగా, తప్పుడు దిశలో ప్రయాణించడం వల్ల 10 శాతం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మరో 8 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ‘టీజీ-టిమార్స్’ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే వ్యవస్థీకృత నిఘా అత్యంత కీలకంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 1,200 కి పైగా ‘బ్లాక్ స్పాట్స్’ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు) వద్ద ఈ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించనుంది. గతంలో కేవలం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే అత్యాధునిక ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు ఈ బ్యూరో ద్వారా 33 జిల్లాల్లోని రోడ్డు నెట్‌వర్క్‌ను అనుసంధానించనున్నారు. రూ. 100 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనాన్ని అందుబాటు ఉంచడం ద్వారా ప్రమాదాల తీవ్రతను కనీసం 30 నుండి 40 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త బ్యూరో విధానాల్లో అత్యంత మానవీయమైన కోణం—ప్రతి పోలీస్ స్టేషన్‌లో ‘రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్’ను నియమించడం. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడే ‘గోల్డెన్ అవర్’ (తొలి గంట) లోపు క్షతగాత్రులను హాస్పిటల్ చేర్చే బాధ్యతను వీరికి అప్పగించడం వల్ల రోడ్డు ప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించవొచ్చు . అలాగే హైవేలపై స్మార్ట్ పెట్రోలింగ్, సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు లాంటి అధునాతన సాంకేతికతను జోడించడం ద్వారా విధుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా, వాహనదారులలో క్రమశిక్షణ అలవడుతుంది.
అయితే, ఈ బ్యూరో నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్’ విధానం చాలా కీలకం. ట్రాఫిక్ చలాన్ల ద్వారా వొచ్చే నిధులలో 40 శాతాన్ని నేరుగా ఈ బ్యూరోకే కేటాయించడం శుభపరిణామం. ఈ నిధులను సిబ్బంది శిక్షణకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి , బ్లాక్ స్పాట్స్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు) వద్ద అత్యవసర మరమ్మతులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన అత్యంత పారదర్శకమైనది. జరిమానాల రూపంలో వొచ్చే ఆదాయం తిరిగి ప్రజల ప్రాణరక్షణకే ఖర్చవుతుందనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. నిజానికి 2024లో రాష్ట్రంలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా, 7,281 మంది ప్రాణాలు కోల్పోవడం , జాతీయస్థాయిలో తెలంగాణ 7వ స్థానంలో నిలవడం ఈ వ్యవస్థ ఏర్పాటులోని ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.
చట్టాలు, బ్యూరోలు కాగితాలపై ఎంత బలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో వాటి అమలు, ప్రజల భాగస్వామ్యంపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైనా వాహనదారులు స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రభుత్వం కల్పించిన ఈ ‘టీజీ-టిమార్స్’ వ్యవస్థ సఫలీకృతం కావాలంటే ప్రజల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెరగాలి. తెలంగాణను సురక్షితమైన ప్రయాణాల రాష్ట్రంగా మార్చడంలో ఈ కొత్త బ్యూరో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.





