– ఈ నెలాఖరుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే
– నాణ్యతలో రాజీ పడొద్దు.. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి
– గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలుపై సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా అని నాణ్యతలో రాజీ పడొద్దని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. వర్క్ ప్రోగ్రెస్‌ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతమవుతాయన్నారు. భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలన్నారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ మిస్ అయితే వెంటనే గుర్తించి లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రాథమిక కార్యాచరణ నివేదికపై సమీక్ష
పుష్కరాల సందర్భంగా పాత ఐదు జిల్లాల్లోని 85 పుష్కర ఘాట్లు, వాటికి సమీపంలో ఉన్న 22 ఆర్టీసీ బస్ స్టేషన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంది. డిజాస్టర్ బోట్స్, రెస్క్యూ టీమ్స్, హైడ్రా వంటి బృందాలు సమన్వయం చేసుకునేల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో బస్ స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.3 కోట్లు అవసరమని, 22 బస్ స్టేషన్లకు మొత్తం రూ.66 కోట్లు అవసరం ఉందని అంచనా వేశారు. పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఒక్కో ప్రాంతానికి సుమారు రూ.కోటి చొప్పున 22 ప్రాంతాలకు మొత్తం రూ.22 కోట్లు అవసరమని అంచనా. శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హాల్టింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం మౌలిక వసతుల వ్యయం
బస్ స్టేషన్ల ఆధునికీకరణకు రూ.66 కోట్లు, తాత్కాలిక బస్ షెల్టర్లు, ఇతర సౌకర్యాలకు రూ.22 కోట్లు మొత్తం రూ.88 కోట్లు అవసరం. మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నందున ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం మహిళా ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంది. పుష్కరాల సమయంలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున గత పుష్కరాలతో పోలిస్తే సుమారు 30% అదనంగా బస్సులను నడపాలని ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్‌నుబట్టి ఘాట్లు – ఆర్టీసీ బస్ స్టేషన్ల మధ్య కనెక్టివిటీ పెంచుతారు. అత్యధిక రద్దీ ఉండే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటారు. పార్కింగ్ ప్రాంతాలు, తాత్కాలిక బస్ షెల్టర్లు, ఘాట్ల మధ్య షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తారు. అన్ని గుర్తించిన ఘాట్లు, సంబంధిత బస్ స్టేషన్లు, దూరాలు, రోడ్డు మార్గాలు, కనెక్టివిటీ వివరాలతో సమగ్ర రూట్ మ్యాప్ రూపొందిస్తారు.
ఆర్టీసీ ముందస్తు కార్యాచరణ
పుష్కరాల సందర్భంగా భక్తుల రవాణా సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రం నలుమూలల నుండి బస్సుల నడపడమే కాక ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుండి వచ్చే భక్తులకు ప్రజా రవాణాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నది. టీజీఎస్ ఆర్టీసీ వివిధ రీజియన్ల పరిధిలోని పుష్కర ఘాట్లు, వాటికి కేటాయించిన బస్సు డిపోలు, ప్రణాళిక ప్రకారం బస్సులు, ట్రిప్పులు, ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ రీజియన్ పరిధిలో ప్రధాన ఘాట్లు : ధర్మపురి, ఎర్దండి, కాళేశ్వరం, వాల్గొండ.
డిపోలు: గోదావరిఖని, హుస్నాబాద్, హుజురాబాద్, జగిత్యాల, కరీంనగర్-1, కరీంనగర్-2, కోరుట్ల, మంథని, సిరిసిల్ల, వేములవాడ. పుష్కరాల్లో భాగంగా ధర్మపురి, కాళేశ్వరంలకు అత్యధిక సంఖ్యలో బస్సులు, ట్రిప్పులను ప్రణాళిక సిద్ధం చేశారు.
నిజామాబాద్ రీజియన్ ప్రధాన ఘాట్లు : పోచంపాడ్, కందకుర్తి, తడపాకల, దొంచంద, గుమిర్యాల్, సావేల్, తుంగిని, ఉమ్మేడ, బాసర, తాడ్బిలోలి, కోస్లీ, బినోలా. డిపోలు: ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ 1, బాన్స్ వాడ, బోధన్
కల్పించాల్సిన సౌకర్యాలు: పోచంపాడ్, కందకుర్తి, దొంచంద, తాడ్బిలోలి తదితర ప్రాంతాల్లో నీరు, విద్యుత్ దీపాలు, బల్లలు టెంట్లు
ఆదిలాబాద్ రీజియన్ ప్రధాన ఘాట్లు : బాసర, ముధోల్, నిర్మల్, ఖానాపూర్, మంచేరియల్, జెన్నారం, లక్సెట్టిపేట మొదలైనవి డిపోలు : భైంసా, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరానికి చెందిన సిటీ బస్సులు, నిర్మల్, మంచిర్యాల
విశేషం : బాసర పుణ్యక్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ నగర డిపోలతోపాటు బైంసా డిపో నుండి అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు కేటాయించారు.
వరంగల్ రీజియన్ ప్రధాన ఘాట్లు : కాళేశ్వరం, రామన్నగూడెం, మంగపేట, ముళ్లకట్టు.
డిపోలు: హనుమకొండ, నర్సంపేట, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి
కల్పించాల్సిన సౌకర్యాలు : కాళేశ్వరం ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ కోసం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు.
ఖమ్మం రీజియన్ ప్రధాన ఘాట్లు : భద్రాచలం, పర్ణశాల, రామానుజవరం, చినరావిగూడెం, మోతేగడ్డ, దుమ్ముగూడెం, ఎదుళ్ల బయ్యారం, కొత్తగూడెం, చింతిర్యాల, నెల్లిపాక.
సంబంధిత డిపోలు: ఖమ్మం, మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మధిర భద్రాచలం
విశేషం: భద్రాచలం, పరిసర ప్రాంతాల ఘాట్లకు భక్తులు సులువుగా చేరుకునేలా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం డిపోల ద్వారా విస్తృత బస్సు సర్వీసులు సిద్ధం చేశారు.
ఘాట్ల వద్ద ఆర్టీసీ చేయనున్న ప్రాథమిక ఏర్పాట్లు, అవసరాలు
తాగునీరు : నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కందకుర్తి, పోచంపాడ్, తాడ్బిలోలి వంటి ప్రధాన ఘాట్ల వద్ద ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం. ఎండ, వర్షం నుండి భక్తులను కాపాడేందుకు టెంట్లు, విశ్రాంతి తీసుకోవడానికి బల్లల ఏర్పాటు. ఘాట్లు, బస్ పాయింట్ల వద్ద రాత్రి సమయంలో రక్షణ కోసం వెలుగునిచ్చే హై-మాస్ట్ లైట్ల నిర్వహణ.
తాత్కాలిక బస్ టెర్మినల్స్
కాళేశ్వరం, ఇతర కిక్కిరిసిన ప్రదేశాల్లో బస్సులు నిలపడానికి, ప్రయాణికులు సులువుగా ఎక్కడానికి ప్రత్యేక తాత్కాలిక బస్ స్టేషన్ల ఏర్పాటు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




